Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 5


    బాయ్ వినయంగా ఆ స్టిక్ ని తీసుకొని ఆయన వెనుకే బయలుదేరాడు.

 

    రెండు నిమిషాలు నడిచి, అక్కడ తనకోసం ఎదురుచూస్తున్న వ్యక్తి ముందుకొచ్చి కూచున్నాడు.

 

    అక్కడో ఫోల్డింగ్ టేబుల్ వేసుంది.

 

    దానిమీద టీచర్స్ విస్కీ ఫుల్ బాటిల్, సోడా, దాని పక్కనే రెండు గ్లాసులు అమర్చి వున్నాయి.

 

    ఆ వ్యక్తి మందహాసం చేస్తూ ఒక గ్లాసును తీసుకొని దానిలోకి ఒక పెగ్ కి సరిపడా విస్కీ వంపి, పక్కనే వున్న సోడా బాటిల్ ఎత్తి ఆ గ్లాసునిండా పోసి అర్జునరావు కందించాడు. చుట్టూ ఎత్తయిన చెట్లు, కొండలు, సరస్సులతో అదో షాంగ్రీలా వుంది.

 

    చల్లనిగాలి వుండుండి వీస్తోంది.

 

    అర్జునరావు మెల్లగా ఆ గ్లాసును తీసుకొని పెదాల కానించుకున్నాడు.

 

    వారికి కొద్ది దూరంలో ప్రీమియర్ నైన్ నైన్ ఎయిట్ కారు ఆగి వుంది.

 

    కాశ్మీర్ లోని శ్రీనగర్ కి దగ్గరలో వున్న ఛస్మాషాహి ప్రాంతమది.

 

    వ్యాలీ ఆఫ్ పేరడైజ్...

 

    అంతటి స్వర్గధామమైన ప్రాంతంలో కూర్చుని అతి ప్రమాదకరమైన వలనొక దానిని పన్నబోతున్నారా ఇద్దరు వ్యక్తులు.

 

    "ఏ ఫ్లయిట్ అన్నావ్?" అర్జునరావు సిప్ చేసి రిలాక్స్ గా ఫీలవుతూ అడిగాడు.

 

    "పానమ్... ఫ్రమ్ న్యూయార్క్ టూ న్యూఢిల్లీ"

 

    "వెరీగుడ్... ఢిల్లీలో బస....?"

 

    "సెంటౌర్ హోటల్, ఢిల్లీ ఎయిర్ పోర్ట్..."

 

    "ఫైన్"

 

    గ్లాసు ఖాళీ అయింది.

 

    ఆ వ్యక్తి మరోసారి గ్లాసు నింపాడు.

 

    "ఆ పిల్ల చాలా తెలివికలది"

 

    "తెలుసు... తెలివితేటలు ఆ పిల్ల సొత్తే కాదుగా"  

 

    "శెభాష్... ఆ మాత్రం నమ్మకం నీమీద నీకుంటే చాలు"

 

    మరికొద్ది నిముషాలకు బాటిల్ ఖాళీ అయింది.

 

    వారి మెదళ్ళు వేడెక్కి చురుగ్గా పనిచేయ నారంభించాయి.


                                                       *    *    *    *


    ఉదయం సరిగ్గా ఏడుగంటలకు డెట్రాయిడ్ మెట్రోపాలిటిన్ ఎయిర్ పోర్ట్ కి ఫ్రెండ్స్ తో కలిసి బయలుదేరింది నాయకి.

 

    ఫోర్డ్ ముస్టాంగ్ కారు నున్నటి రోడ్ పై ఎయిర్ పోర్ట్ కేసి దూసుకు పోతోంది.

 

    ముగ్గురి గుండెలు బరువెక్కాయి. నాలుగు సంవత్సరాలుగా కలిసి పంచుకున్న విజ్ఞానం, వికాసం, వినోదం వారికిప్పుడు జ్ఞప్తికొస్తూ గుండెల్ని తొలుస్తున్నాయి.

 

    ఆ ముగ్గురిలో నాయకే ఒకింత నయం. మాతృదేశాన్ని చూడబోతున్నానన్న ఆనందం- తనకెంతో ఇష్టమైన నాయనమ్మను కలుసుకోబోతున్నానన్న సంతోషం ఆమెను కొంత ఉపశమింపజేస్తున్నాయి.

 

    కారులో అలుముకున్న నిశ్శబ్దం బరువుగా, బాధగా వున్నట్టు తోచి ఏదో మాటల్లో పెడితే తప్ప వాళ్ళ ఎడబాటు బాధ నుంచి డైవర్ట్ కారనిపించి కారు వేగాన్ని ఒకింత తగ్గించి, తన ప్రక్కనే వున్న క్రీస్టినీ, మాంటేలవేపు చూస్తూ అంది నాయకి-

 

    "మా నాయనమ్మ పేరు గుర్తుందా మీకు?"

 

    కొద్ది క్షణాలకు తేరుకొని "పాడన్" అన్నారు ఇద్దరూ ఒకేసారి.

 

    "మా నాయనమ్మ పేరు తెలుసా మీకు?"

 

    అదే ప్రశ్న తిరిగివేసింది నాయకి.

 

    "ఓ... నాగమ్మ..." మాంటే చప్పున చెప్పింది.

 

    "పూర్తిగా చెప్పలేదు..." నాయకి తిరిగి అంది.

 

    "నాయకురాలు నాగమ్మ... కరెక్టేనా?" క్రీస్టినీ తమాషాగా నవ్వుతూ అంది.

 

    నాయకి నాయనమ్మ పేరు వింటూనే ఒకింత గర్వంగా భుజాల్ని కదిలించింది.

 

    "మా నాయనమ్మ నాకు నాయకి అని పేరెందుకు పెట్టింది?"  

 

    కారులోని స్పీడోమీటర్ లోని నీడిల్ వందకి - నూట ఇరవైకి మధ్య ఊగిసలాడుతోంది. నాయకికి ఫాస్ట్ డ్రైవర్ గా మంచి పేరుంది. ఎంత ట్రాఫిక్ లోనైనా కారును తూనీగలా ముందుకు తీసుకెళ్లగల నేర్పు వుంది నాయకకి. ఆమె డ్రైవింగ్ అంటే కొందరికి భయం, మరి కొందరికి క్రేజ్.     

 

    "యు షుడ్ బి ద లీడర్... నువ్వెక్కడున్నా, ఎప్పుడైనా, ఎవరిలోనైనా, ఎందరి మధ్యనైనా నువ్వే నాయకురాలివి కావాలని. అంతే గదా...?" మాంటే ఆ విషయం తనకు గుర్తున్నందుకు గర్విస్తూ అంది.

 

    నాయకి మరోసారి భుజాల్ని తమాషాగా కదిలించింది.

 

    వారికి ముందుగా వెళ్తున్న ట్రక్ సడన్ గా ఆగిపోయింది.

 

    అప్పటికి వారి కారుకు, ట్రక్ కి మధ్యనున్న దూరం కేవలం యాభై గజాలే.

 

    అప్పటికే ముంచుకు రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన క్రీస్టినీ కీచుగారిచింది "ఓ మై గాడ్" అంటూ.

 

    ఎలర్ట్ గా వున్న నాయకి కారును పూర్తిగా ఎడంవైపుకి కోసింది. ఎదురుగా మరో హెవీ వెహికల్ ఇటుకేసి వేగంగా దూసుకు వస్తోంది.

 

    మాంటే షాక్ అయింది ముంచుకు వచ్చిన మరో ఆపదను చూస్తూనే.

 

    నాయకి చప్పున క్లచ్ నొక్కి, గేరుమార్చి పూర్తిగా కుడివైపుకు కోయటంతో కారు వెంట్రుకవాసిలో ముందు ఆగివున్న టక్ నుంచి తప్పుకొని రోడ్డు పక్కనున్న ఫీల్డ్ లోకి వెళ్ళి, తిరిగి వెంటనే ఎడంవేపుకు తిరిగి రోడ్డెక్కింది. (అమెరికాలో వెహికల్స్ రోడ్ కి కుడివేపు వెళుతుంటాయి)

 

    తిరిగి కారిప్పుడు ప్రశాంతంగా ముందుకు దూసుకుపోతోంది.

 

    భయంతో కళ్ళు మూసుకుని బిగుసుకుపోయి వున్న ఆ యిద్దర్నీ కుడిచేతితో తట్టింది నాయకి. అప్పటికిగానీ తేరుకోలేక పోయారా ఇద్దరు.

 

    వారి భయాన్ని చూసి పకపకా నవ్వింది నాయకి.

 

    "ఎవరా స్టుపిడ్, సడన్ గా రోడ్డుమీదే ట్రక్ ఆపినవాడ్ని కోర్టు కీడ్చాలి" అంది మాంటే కోపంగా.

 

    "ఎందుకంత ఫాస్ట్ నాయకి? ఫ్లయిట్ కింకా టైముందిగా" మందలించే ధోరణిలో అంది క్రీస్టినీ.

 

    "నా ఫ్రెండ్ రాబర్ట్ ఈపాటికి ఎయిర్ పోర్ట్ కొచ్చి నాకోసం ఎదురు చూస్తుంటాడు. అదీకాక ఇదే నా లాస్ట్ డ్రయివింగ్ అమెరికాలోని విశాలమైన, చదునయినా రోడ్లపై. ఇలాంటి రోడ్లు ఇండియాలో చాలా తక్కువ" అంది తిరిగి కారు వేగాన్ని పెంచుతూ నాయకి.

 

    క్రీస్టినీ "సారీ" అంది వెంటనే.

 

    నాయకి క్రీస్టినీ చేతిని సున్నితంగా నొక్కి వదిలింది.

 

    "ఏం చేయాలనుకుంటున్నావ్ భవిష్యత్తులో?" మాంటే ప్రశ్నించింది దిగులును దిగమింగుకుంటూ.

 

    "నాకై నేను ఓ మెగా ఎంపైర్ ని సృష్టించుకుంటాను. మీ మార్కెట్ లోకి సయితం రంగ ప్రవేశం చేస్తాను. ఇంకా ఏదేదో చేయాలనే వుంది. కాని మా నాయనమ్మ దాచిన ఆస్తి ఒక ఎంపైర్ క్రియేట్ చేయడానికే సరిపోతుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS