అతను మామూలుగానే ప్రొద్దుటే ఇందిరాగాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి వెళతాడు.
నాయకి కోసమే ఎంతో దూరంనుంచి వచ్చినట్టు నటిస్తాడు.
స్వాగతం చెప్పటానికే ఎన్నో ముఖ్యమైన పనుల్ని వాయిదా వేసుకున్నట్టు నాయకి తెలుసుకునేలా రకరకాల గిమ్మిక్స్ ప్రదర్శిస్తాడు.
అప్పుడు పన్నుతాడు - అసలైన వలను.
తను నాశనం చేయాలనుకునే వ్యక్తులపై వడుపుగా వల విసరటం వెన్నతో పెట్టిన విద్య కాదు - ఎదిగాక అలవర్చుకున్న విద్య.
మరో గంట గడిచింది.
అర్జునరావు మరలా ఓడిపోయాడు.
"ఓటమిలో వున్న కిక్కు గెలుపులో లేదోయ్... చిన్నప్పుడు ఒక పాము నన్ను కాటువేసిందోయ్... ఒకసారి కాదు - మూడుసార్లు. నాకేం కాలేదు. కొద్దిగా మైకం కమ్మినట్టు అనిపించిందంతే. ఆ తరువాత ప్రక్కనే వున్న పూలకుండీ వెనుక దాగిన ఆ పామును పట్టుకున్నాను. గిరగిరా తిప్పి దాని తలను చెట్టుకేసి బాదాను. అంతే ఒక్క దెబ్బతో చచ్చి ఊరుకుంది..." తాపీగా అంటూ చిన్నగా నవ్వాడు.
"ఇప్పుడు తల చెట్టుకేసి కొట్టవలసింది నన్నుకాదుగా?" పీటర్ చెస్ బోర్డ్ ని మడుస్తూ అన్నాడు.
"నిన్ను కాదు దిగ్రేట్ ఆటోమొబైల్ బిజినెస్ వుమన్ నాయకురాలు నాగమ్మ..."
ఇద్దరూ అక్కడి నుండి లే బెడ్స్ వేపుకి నడిచారు.
సరిగ్గా అదే టైమ్ కి పానమ్ ఫ్లయిట్ సముద్రాల్ని అధిగమిస్తూ న్యూఢిల్లీ కేసి దూసుకువస్తోంది.
నాయకి సీట్లో జారగిలబడి వుంది.
నిద్రపోవాలని ఎంతగానో ప్రయత్నించింది.
కాని ఫలితం లేకపోయింది.
ఆమె తన దృష్టిని తన భవిష్యత్ పథకాల మీదకు మరల్చింది.
నాయనమ్మ కలల్ని తాను నిజం చేయాలి.
ఒక అనితర సాధ్యమైన ఆటోమొబైల్ ఎంపైర్ ని క్రియేట్ చేయాలి.
తనమీద నాయనమ్మ పెట్టుకున్న నమ్మకాలకి నిజరూపం ఇవ్వాలి.
తన జీవితంలో ప్రతిదీ అనుకున్నది అనుకుంటున్నట్టుగానే జరిగిపోతోంది.
ఇకపై కూడా అలాగే జరగాలి - జరిగితీరాలి.
ఇంత వయస్సు వచ్చిన నాయనమ్మ అంటే నాయకికి చిరు భయం... అనంతమైన గౌరవం...
ఆరాధనతో కూడిన గగుర్పాటు... ఎందుకో ఇప్పటికీ ఆమెకే అర్థం కాదు.
మగదిక్కులేని సంసారాన్ని, కోట్లాది ఆస్తుల్ని ఒక్క చేతిమీదుగా మగరాయుడిలా మేనేజ్ చేసుకు రాగలగటమా...?
ఊహూ... అదొక్కటే కాదు-
అన్నీ సవ్యంగా, సక్రమంగా, అనుకున్నది అనుకున్నట్టు జరిపించ గలగటమా... ఇదీ కాకపోవచ్చు.
తనకు తెలిసిన లోకంలోని స్త్రీలలో ఎవరిలో కనిపించని మేధాసంపత్తి ఆమెకుండటమా...? బహుశా కావచ్చు.
తనంటే నాయనమ్మకు పంచ ప్రాణాలు.
అసలు తనకోసమే బ్రతుకుతున్నట్టు వుంటుంది.
తనను మరో నాయకురాలు నాగమ్మను చేయాలని విశ్వప్రయత్నం చేస్తుంది. అందుకే తను తన జీవితంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయాల్ని ధైర్యంగా నాయనమ్మకే వదిలేస్తుంది.
తన జీవితాన్ని మలుపు తిప్పే సమయాల్ని, నిర్ణయాల్ని కావాలని తనే నాయనమ్మకు ధారాదత్తం చేసింది.
అందులో కొండంత ఆనందం వుంటుంది.
తిరుగులేని భరోసా వుంటుంది.
చూడాలి... ఇప్పుడు ఎలాంటి వ్యక్తిని తనకోసం ఎంపిక చేసిందో...!
అందుకోసం, అతనికోసం ఎంత ప్రయాస పడిందో, ఎందర్ని ఆ పనికి వినియోగించిందో.
ఆమె ఆలోచనలు అలా సాగిపోతూనే వున్నాయ్.
పానమ్ ఫ్లయిట్ సముద్రానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఢిల్లీకేసి దూసుకుపోతూనే వుంది.
మరోపక్క ఆమె జీవితాన్ని అధఃపాతాళానికి అణగద్రొక్కే పథకమొకటి ఢిల్లీ, సెంటౌర్ హోటల్, సూట్ నెంబర్ 801లో సిద్ధమవుతోంది.
* * * *
రాక్షసత్వమా! నీ బలీయమైన కోరల్ని నాలోకి దింపి నన్ను విషపూరితం చేయకు.
లేదంటే నేనే రాక్షసుడ్ని అవుతాను.
నిరంకుశ న్యాయవేత్తనవుతాను.
శిక్ష నేనే విధిస్తాను.
చట్టాన్ని, న్యాయాన్ని - రెంటిని నా చేతుల్లోకే తీసుకుంటాను.
ఆ తరువాత మనిషినని చెప్పుకొనే అర్హతను కోల్పోతాను. మానవత్వాన్ని మర్చిపోతాను. మనిషి రూపంలో వున్న మృగాన్నే అవుతాను.
అప్పుడు నన్నీ సభ్య ప్రపంచం తరిమి తరిమి కొడుతుంది.
అప్పుడు నేను ఓటమి అంచుల్లో ఒంటరిగా మిగిలి రోధిస్తుంటాను.
అందుకే అంటాను - రాక్షసత్వానికి హేతువు నువ్వు - రాక్షసుడివి నువ్వు అని. రాక్షస నిలయాలు నీ జన్మస్థలాలని.
లోకంలో చెడుని ముందు సృష్టించి మంచిని ఆ తరువాత పంపావు. రాక్షసత్వాన్ని ముందు సృష్టించిన మానవత్వాన్ని తరువాత పంపావు. దుఃఖాన్ని ముందు సృష్టించి సుఖాన్ని తరువాత రుచి చూసావు. అన్నీ అంతే... కాని మేం నీవు రెండవ గుణాన్ని పంపేలోపే అప్పటికే బట్వాడా అయిన దుర్గుణాల్ని వంటబట్టించుకున్నాం.
విస్తట్లో ముందు కనిపించేదాన్నే ముందుగా భుజిస్తాం-
అందుకే అంటాను- నేనేదైనా, ఏం చేసినా శపించకు. ఎందుకంటే ఆ శాపం నీకే తగులుతుంది.
మరో సృష్టి చేసేప్పుడు మంచి గురించి ముందు ఆలోచించు. అప్పటి వరకు నేను రాక్షసుడిగానే మిగిలిపోతాను.
* * * *
ఉషోదయపు నిశ్శబ్ధం క్రమంగా పల్చబడుతోంది.
బ్రతుకు పోరాటపు బరిలోకి దిగేందుకు ఒక్కొక్కరే నిద్ర నుంచి లేచి కళ్ళు నులుముకుంటున్నారు.
అప్పుడు సమయం అయిదున్నర గంటలు.
సరిగ్గా అప్పుడే ఓ మనిషిని- మానవత్వమున్న మనిషిని రాక్షసుడిగా చేసే యజ్ఞానికి శ్రీకారం చుట్టారోచోట.
అంతే... ఆ మరుక్షణం కొన్ని జతల బూట్లు శబ్ధం చేసుకుంటూ బయలుదేరాయి.
దారి పొడవునా పాదాచారుల గగుర్పాటుతో ఎగిరి ప్రక్కకు దూకినంత పని చేస్తున్నారు.
అందరి ముఖాల్లోనూ ఆశ్చర్యంతోపాటు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
డబ్బున్న వాడికేదో అన్యాయం జరిగింది.దాన్ని సరిదిద్దేందుకు ఠంచనుగా బయటకొచ్చాయా బూట్లు.
నేలను తాకుతున్న ఆ ఇనుప నాడాల బూట్లు చేస్తున్న శబ్ధం యుద్ధంలో నేలకొరిగిన సైనికుల మీద విజయంతో శత్రురాజు సైన్యం నడుస్తున్నప్పుడు ఉద్భవించే శబ్ధంలా వుంది. కాని ఇందులో అపశృతి వుంది. ఎందుకంటే ఎవరైతే తమని పోషిస్తారో - ఎవరికోసమైతే తాము నియమింపబడ్డారో వారి మీదకే యుద్ధానికి వెళ్తున్నారు గదా... అందుకని.
పొగరుగా, నిర్లక్ష్యంగా, ధీమాగా నడవగలిగేది ఈ ప్రపంచంలో ఒక్కరే - అధికారం చేతిలో వున్న వాళ్ళు.
కోట్లాది ధనరాశుల్ని కూడా దానికి సంబంధించిన ఫైల్ లోని చిన్న సంతకం శాసించగలదు. కోటీశ్వరుడి జాతకాన్ని కూడా అధికారపుటంచుల్లో వేలాడే చిరు ప్రభుత్వోద్యోగి మార్చగలడు.
అధికారం చట్రంలో ఆకులా మారిన బ్యూరోక్రాట్ ప్రపంచమిది.
అందుకే ఆ కాలనీలో ప్రజలు కొన్ని వేలమందున్నా అధికారానికి పట్టిన ఆఖరి తుప్పుకి భయపడి పక్కకు తప్పుకుంటున్నారు.
ఏ పోరాటానికైనా చివర లభించే విజయం తమదే అన్నట్టు విజయగర్వంతో తల లెగరేస్తూ "చూశారా మా ఖాకీ బట్టల ప్రివిలేజ్" అన్నట్టు పోలీసులు వేగంగా దూసుకుపోతున్నారు.
పోలీసు డిపార్ట్ మెంట్ లో పనిచెయ్యని ప్రతి వ్యక్తీ నేరస్తుడే అన్న భావంతో చూసే ఆ వ్యవస్థపై సవాల్ విసిరే ఓ వ్యక్తి వాళ్ళకిప్పుడు తారసపడబోతున్నాడు.
తలలపై ఎర్రటి టోపీలు...
చేతుల్లో బలమైన లాఠీలు...
గుండెల మీద వారి అరాచకాల్ని సర్టిఫై చేసే అశోక చక్రాలు.
కొవ్వుతో మందం పెంచుకున్న నడుములపై బెత్తెడంత వెడల్పుతో బెల్టులు.
వాళ్ళు రక్షకభటులు.
