Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 5


    అంతదాకా మామగారిచ్చి వెళ్ళిన కాంపొజిషన్ పుస్తకాలు ముందేసుకూర్చున్న స్వాతి లేచివచ్చింది. ఆమె శాస్త్రిగారు ఎంత వారించినా వినకుండా కాంపొజిషన్ లో యూనిట్ టెస్ట్ పేపర్సు ఎసైన్ మెంట్స్ దిద్దుతూ వుంటుంది.

    ముందుగా ఆయన కాదన్నా తర్వాత తర్వాత ఆమె అప్పు డేట్ గా రికార్డు మెయింటెయిన్ చేయటంతో ఇతర్ల ముందు తను గొప్పగా ఫీలవడంతో అభ్యంతరం పెట్టలేదు.

    ఇద్దరికీ కంచాల్లో వడ్డించింది పార్వతి.

    పచ్చడి కలుపుకుని ముద్ద కళ్ళకద్దుకుని "హే! రామచంద్రా!" అని నోట్లో పెట్టుకోబోయేంతలో "జై సీతారాం!" అంటూ వచ్చాడు సీతారామశాస్త్రి.

    కొడుకుని చూడగానే ఆమె ముఖం వికసించింది.

    "రా! రా! యిన్నాళ్ళూ ఎక్కడి కెళ్ళావు?" అంది ఆప్యాయంగా.

    "అమ్మా! ఇది నాటకాల సీజన్! రోజు మార్చి రోజు నాటకాలు. ఒకవూరా? ఒక వాడా? తిరిగిన వూరు తిరక్కుండా తిరుక్కొస్తున్నాం. అబ్బ! ఏం కలెక్షనులు! ఏం కలెక్షనులు! అమ్మా! అదంతా తర్వాత తీరిగ్గా చెబుతా గానీ రెండుముద్దలిలా పెట్టు కడుపునిండా అమ్మ చేతి ముద్ద తిని ఎన్నాళ్ళయిందో?" అన్నాడు.

    పార్వతి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

    "ఒరేయ్! సీతా ఏమిట్రా యిది? అందర్లా శుభ్రంగా చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకోక ఈ వేషాలేవిట్రా? మీ నాన్నగారు నిన్ను తలుచుకుని బాధపడని రోజు లేదు." అంది నోట్లో పెట్టుకోబోయిన ముద్ద కొడుకు చేతిలో పెడుతూ.

    "అమ్మా! నాన్నగారు నాపేరు పెట్టడంలోనే అన్యాయం చేశారు."

    "అదేమిట్రా! ఆయనేం చేశారు మధ్యలో. నిన్ను నాటకాల రాయుడివై పొమ్మని చెప్పలేదే?"

    "సీతారాం అనిపిలిచినరోజే నన్ను బైరాగిని చేశారు. ఆడవేషాలు వేసుకుని బతకరా అని సీతమ్మ పేరు కలిపిపెట్టారు."

    "నీది మరీ చోద్యంరా! ఆ పేరు పెట్టిన వాళ్ళందరూ నీలాగా తయారవుతున్నారా?"

    "అక్కడే ఉంది కిటికు అందరూ అలా తయారుకారు. అలా అయితే మన గొప్పదనమేముంది? ఆయన పండితులు. అన్నయ్యలూ, తమ్ముడు అందరూ విద్వాంసులు, ఆఖరికి చెల్లాయ్ కూడా ఇంకా మూడేళ్ళు గడిస్తే బి.ఏ. అవుతుంది, చదివిస్తే ఎమ్.ఎ. అవుతుంది. నా విషయమే యిలాగయింది. నేను హైస్కూలు చదవుదాటలేక పోయాను. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్క వరం యిచ్చాడు.

    "ఇప్పుడా సోదంతా ఎందుగ్గానీ ముందు అన్నం తిను" హెచ్చరించింది పార్వతి.

    "సోది కాదమ్మా! జీవితం. నాకు కమ్మని కంఠం ఇచ్చాడు. చక్కని రూపం ఇచ్చాడు. ఇంత నటనకూడా ప్రసాదించాడు. ఇదే వృత్తిగా చేసుకుని బతకరా అన్నాడు. ఇక విషయం ఇంతేనమ్మా_"

    ఖచ్చితంగా చెబుతున్న కొడుకు వంక ఆశ్చర్యంగా చూసింది.

    స్వాతి మెల్లిగా భోంచేస్తోంది.

    "హల్లో వదినగారూ! బావున్నారా? వంచిన తల ఎత్తరా ఏవిటి? ఎప్పుడొచ్చావు? ఎక్కడికెళ్ళావు? అడక్కూడదా? నోటి ముత్యాలు రాలిపోతాయా?" నాటక ఫక్కీలో అన్నాడు.

    స్వాతి తడబడి పోయింది. "అబ్బే అదేంలేదు. భోంచేశాక మాట్లాడదామని" మెల్లిగా అంది.

    "అమ్మా! వదిన ఇంక మారదు_"

    "అబ్బ దాని సంగతెందుకు నీకు? ఇంతకీ ఇంటిపట్టున సక్రమంగా ఉంటావా లేదా?" ప్రేమగా కసిరింది తల్లి. స్వాతి మితభాషి. సీతారాం వాగుడుకాయ. వచ్చినప్పుడల్లా వదినగారిని కవ్వించి మాట్లాడించాలని చూస్తాడు. ఆమె మౌనమే సమాధానం. అయినా యితగాడు వూరుకోడు. ఆమెలోని నిస్తబ్దతని పారద్రోలాలని యితని ఆరాటం. యోగినిలా జీవితం గడుపుతున్న స్వాతి యివేవీ పట్టించుకోదు.

    "ఈ నాటకాల సీజన్ అయిపోగానే వచ్చేస్తానమ్మా! అయినా నాకు వేరే వూళ్ళో వుద్యోగం వచ్చేదనుకో. అప్పుడేం చేసేదానివి? ఏ సంవత్సరానికో ఆర్నెల్లకో, దసరాకో, వుగాదికో వచ్చేవాడిని కదా!"

    "నిన్ను కదిలిస్తే చాలు. అసలు విషయం దాటేసి వెధవ సోదంతా చెబుతావు."

    "ఎప్పుడో నెలకోసారి గదా! తృప్తిగా మాట్లాడనియ్యే! అమ్మా నాకు రోజుకి ఎంత ఇస్తారో తెలుసా. చార్జీలు ఖర్చులు ఇచ్చి నూటపదహార్లు యిస్తారు. నెలకి పదిహేను నాటకాలకి తక్కువ లేకుండా ఆడుతున్నాం."

    "ఇది స్థిరమైన జీవితమా?"

    "ఎందుక్కాదు. నువ్వలా చూస్తుండు. ఒకానొకరోజుకి నీ కొడుకు స్థానం నరసింహారావు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కొండపేట కమాల్ వరుసలో నిలబడతాడు. ఇది నాట్య సరస్వతి వుపాసన అమ్మా. ఇందులో తప్పేంలేదు. సినిమా వాళ్ళని చూడు దేవతల్లా చూస్తున్నామా లేదా? నాటకాల వాళ్ళం మమ్మల్నీ అంతే!"

    పార్వతమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులో వీడిక మారడన్న బాధ ధ్వనించింది.

    "అలా నిట్టూర్చకమ్మా! నీ కొడుకుని నువ్వు సత్యభామగా, చింతామణిగా, చంద్రమతిగా చూస్తే అదిరిపోతావు తెలుసా? చూస్తూ వుండు నాకూ కనకాభిషేకాలూ, ఘన సన్మానాలు జరిగేరోజు వస్తుంది" కళ్ళు పెద్దవిచేసి యాక్షన్ చేసి చెపుతున్న కొడుకుని చూసి ఫక్కుమని నవ్వేసింది.

    స్వాతి కూడా మెల్లగా నవ్వింది.

    "బాబోయ్! మా వదినగారు కూడా నవ్వేస్తున్నారు" హాస్యమాడాడు సీతారాం.

    భోజనం ముగించి లేస్తూ "నీ పళ్ళెంలో అన్నం తిన్నాను. నీ కడుపుచించుకు పుట్టినరోజే నీ తిండికి పుష్టం. నీ రక్తమాంసాలు తిని పెరిగాం. తల్లి ఋణం తీర్చుకోలేమమ్మా" అన్నాడు ఆవేశంగా.

    "చాల్లేరా! మాటలు నేర్చావ్! నాటకాల్లో వేషాలు వేసి, వేసి నీకూ ఆ భాషే అలవాటైపోయింది." అందామె నిష్ఠూరంగా.

    "ఇదిగోనమ్మా! నీ కొడుకు సంపాదన. ఈ వెయ్యి వుంచు. శ్రీవిద్య పెళ్ళికి పనికొస్తాయి. బ్యాంకులో వెయ్యమను. ఇంకా చాలా సంపాదించాననుకో. కానీ నా చీరల అలంకరణలకీ, నగలకీ ఖర్చయిపోయింది. దాని పెళ్ళినాటికి ఎంతలేదన్నా పదితులాల బంగారం పెడతాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS