చౌదరి మాటాళ్లేదు.
"ఈ రాత్రికే !" క్లుప్తంగా అని వెళ్లాడు జనార్ధన్.
ముఠా రాజకీయాల్లో, పల్లెటూరి తగాదాల్లో అప్పుడే తనంతవాడయి, తనను మించిపోయిన తమ్ముడిని చూసి సంబరపడ్డాడు చౌదరి.
27
వెంకటేశ్వర స్వామి ఆలయం.
రాత్రి సుమారు పది గంటల వేళ.
కరణం శేషయ్య, వేంకటేశ్వరుని పూజారి శఠగోపాలాచారి ఇద్దరూ కలిసి కోవెల తలుపులు తీశారు. ముఖద్వారం దాటి మహా ద్వారాన్ని బంధించారు. కోవెలలో ఒంటరివాడైన స్వామి తోడు దొంగలయిన కరణం, పూజారి మిగిలారు. ఇద్దరూ ఒక్కో తలుపు తీసుకుంటూ, లైటార్పుతూ గర్భగుడి చేరారు.
బంగారు నగలతో, పూలతో స్వామి దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఒక్కక్షణం స్వామిని చూసి సాష్టాంగ పడ్డాడు శేషయ్య. "స్వామీ! ఇది నీ సొమ్ము! నేను నీ భక్తుడిని. భక్తుడు స్వామిని ఆశ్రయిస్తాడు. నేనూ నిన్ను ఆశ్రయించాను. కుచేలుడికి అష్ట ఐశ్వర్యాలు యిచ్చిన శ్రీ కృష్ణుడివి నువ్వే. వామనుడివై బలికి ముల్లోకాలు దానం యిచ్చే పుణ్యం కల్పించింది నువ్వే. నువ్వు లేంది ఈ కలియుగం లేదు. నేను నీ వాడినే అని నమ్ము. నీ సొమ్ము తీసుకుంటున్నాను."
ఒక్కో నగే వలిచారు. గిల్టు నగలు అలంకరించారు. పూజా సామాగ్రి, వెండి బిందెలు, గిన్నెలు, పళ్ళేలు, కంబురాలు అన్నీ దొంగిలించారు. పూజారి చూస్తూ వుండిపోయాడు. శేషయ్య ఒక్క వస్తువూ అతనికి యివ్వలేదు. దేవుడికి వదల్లేదు. అన్నీ గోతాంలో వేసి కట్టాడు.
ఇద్దరూ తిరిగి అన్ని లైట్లు వెలిగిస్తూ ఆర్పుతూ వచ్చి ముఖద్వారం వద్ద ఆగి మహాద్వారాన్ని బంధించారు.
రాత్రి అర్దరాత్రి అవుతోంది. ఊరు వూరంతా గాఢ నిద్రలో వుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి సివంగిలా వుందది. ధ్వజస్తంభం మీది నుంచి ఒక్క దూకు దూకింది.
కెవ్వుమన్నాడు శేషయ్య.
దూకిన కోతి వూరకే వదల్లేదు. ఎక్కడెక్కడో రక్కింది. ముఖాన అంగుళం స్థలం లేకుండా రక్కింది. కట్టుకున్న గుడ్డలు పీలికలయ్యాయి. చప్పున పూజారి వైపు దూకింది. గుడ్లు పీకింది. లభో దిభోమన్నాడు శఠగోపం. కోతి ఓ తోపు తోసింది. ఆ తోపుకి ధ్వజస్థంభాన్ని ఢీకొన్నాడు. స్పృతి పోయింది. అటు కరణానికి తెలివి తప్పిపోయింది. గోతం నిండా వున్న నగలు, పాత్ర సామాగ్రి అంతా ధ్వజస్థంభం వద్ద పడిపోయింది. ధ్వజస్థంభంపై కిచకిచ మంటూ మహా వానరమూర్తి.
28
రాత్రి బాగా ప్రొద్దుపోయింది. జార, చొర శిఖామణులకు తప్ప యితర్లకు అనుకూలంగా లేదు వాతావరణం. జనార్ధన్, చవుదరి మరో నమ్మిన బంటు బయల్దేరారు. వాడు లోగడ తోటలో ఇంజన్ దొంగతనం చేసి చౌదరి యింటికి చేర్చిన వాడు.
ఆ యింటిగేటు ముందుకి రాగానే కుక్క మొరిగింది. జనార్ధన్ బ్రెడ్, బిస్కట్ ముక్కలు విసిరేశాడు. అది కిక్కురుమనలేదు.
ముగ్గురూ లోపలికి దూరారు.
ఇంటి వెనుక భాగానికి వెళ్ళి పెరటి తలుపులు విరగ బొడిచాడు.
ముగ్గురూ లోపలికి వెళ్ళేరు. వీళ్ళు వెళ్ళిన రెండు నిమిషాలకి మరో మనిషి కూడా లోపలికి వచ్చాడు. అతడు శేఖర్. అతడికి వీళ్ళు లోపలికి ప్రవేశించింది తెలియదు.
మధ్య హాలు దాటేరు. ఆ ప్రక్క గదిలోనే ఒక్కతి పడుకుంటుంది భార్గవి. ఆ గది ప్రక్కగదే బీరువా వుండే గది. భాగావి గదిలోకి చౌదరి, ప్రక్క గదిలోకి జనార్ధన్, తిమ్మన్న వెళ్ళేరు. హాయిగా ప్రశాంతంగా నిదురపోతోంది భార్గవి. ఆమె నిద్రాముద్రిత సౌందర్యం చౌదరికి నిషా ఎక్కించింది. అందంగా నిద్రపోతున్న జెర్రిపోతులా వుంది భార్గవి. అతని కళ్ళకి అప్సరసలా కనిపించసాగింది.
