కుర్చీలో కూర్చుని భార్యని గమనిస్తోన్న సారధికి వారుణి "వింతగా" ప్రవర్తిస్తోన్నట్టు అనిపించింది.
"చిన్నా_"
చప్పున కళ్ళు తెరిచింది సంగీతం విన్న తాచులా.
"ఒక చిన్న కోరిక కోరతాను. మళ్ళీ జీవితంలో యింకెప్పుడూ కోరను. నా కోరిక తీర్చమని బలవంతమూ చేయను. ఈ ఒక్కసారి నా మాటని అంగీకరించు. వారుణీ! మనది ఉమ్మడి కుటుంబం_ఈ ఇంటి సమస్యలు, చిక్కులు యీ యింటిలో ఒకడిగా నేను పంచుకోవాలి తప్పదు. నువ్వెంత కాదన్నా_ కాదనుకున్నా_ అవి తప్పవు. దయచేసి నా మాట విను."
నవ్వొచ్చింది వారుణికి "డబ్బు ఎంతలేసి మాటలనిపిస్తుంది. ఎంతగా దిగజార్చుతుంది! మనిషి ఎంత తగ్గుస్థాయికి వెళతాడు?"
"చిన్నా! జవాబు చెప్పవేం ?"
"మీ కోరిక ఆ పదివేల కోసమేనా?" సూటిగా శత్రుసైనికుడిలా ప్రశ్నించింది. ఆ కంఠంలో జాలి లేదు, దయ లేదు, సానుభూతి లేదు. పైగా వెక్కసం వుంది.
నివ్వెరపోయాడు సారధి. అతను ఆమె అంత ముక్కుసూటిగా ప్రశ్నిస్తుందనుకోలేదు. ఇహ దాగుడుమూతలతో లాభం లేదు అనుకున్నాడు. "అవును చిన్నా! ఆ రోజు రావుగారి కేసుకోసం_ఫణి ఉద్యోగం_ మన యింటి పరువు నిలుపుకోవటం కోసం_ పదివేలు ఖర్చయ్యాయి. అమ్మ నిన్ను నిందిస్తూ వుంటే ఆ డబ్బు నేనిస్తానన్నాను. చిన్నా! నువ్వు మీ నాన్నగారికి టెలిగ్రాం యివ్వు. యం. టి ద్వారా డబ్బు పంపమను. డబ్బు ఆపదకి అక్కరకి కాకపోతే యింకెందుకు. చిన్నా! ఆ డబ్బు నీకక్కర్లేదు. నా కక్కర్లేదు. మన సంతానానికి అక్కర్లేదు. ఇప్పుడూ యీ యిబ్బందిని దాటేద్దాం. తర్వాత కావాలంటే నెలకింత మీ నాన్నగారికే సర్దేద్దాం. ప్లీజ్_ యిప్పుడు మాత్రం ఆ డబ్బు తెప్పించు."
వారుణి మాటాళ్లేదు. పక్కనే వున్న వీక్లీ చేతికి తీసుకుంది. తన ముఖంలో ఆ క్షణాన కనిపించే ఏహ్యభావం అతను చూట్టం ఆమెకిష్టం లేదు.
ఆమె ప్రవర్తన అతన్ని దారుణంగా హింసించినంతగా బాధించింది. "థాంక్స్! ఇప్పటికయినా నీవు అర్థమయ్యావు. కుటుంబం ఏమైనా ఫర్లేదు. భర్తకి ఎన్ని యిబ్బందులొచ్చినా ఫర్వాలేదు. అతని పరువు మర్యాదా ఏమైపోయినా ఫర్లేదు. కానీ కానీ నీకు మీ నాన్న సుఖంగా వుండాలి. నీవు ఆయన్ని అడక్కూడదు. వారుణీ! అంతగా తండ్రిని ప్రేమించేదానివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావ్? ఆయన్ని చూసుకుంటూ_ యోగక్షేమాలు విచారిస్తూ ఆయన ఆర్ధిక బాధలు తీరుస్తూ తల్లిదండ్రుల సేవచేస్తూ జీవితాన్ని గడిపేసి వుండరాదూ?
"ఊహూఁ లా కాదు. వాళ్ళకి బరువు కాకూడదు. వాళ్ళు ఏ బాధ్యతా వహించకూడదు. పెళ్ళి కావాలి. ప్రేమించాలి. దానిలో మగాడు కావాలి. వాడిని బొమ్మలా ఆడించాలి! ఎంత నాటకం! నీలాంటి స్త్రీ ఎక్కడా వుండదు."
ఉంటే యింకే పరుష వాక్యాలు విసరవలసి వస్తుందో అన్నట్టుగా సారధి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు.
నివ్వెరపోయి చూడసాగింది వారుణి.
27
భర్త అలా వెళ్ళిపోగానే వారుణికి మనస్సంతా అదోలా అయిపోయింది. ఏమిటి భార్యాభర్తల సంబంధం. ఆత్మీయుల్లాగా స్నేహితుల్లాగా మెలగవలసిన భార్యాభర్తలు పరస్పరం శత్రుకూటమికి చెందినవారిలా పోట్లాడుకుంటారెందుకు? స్త్రీకి కూడా మనస్సుంటుందనీ, ఆమెకీ ఆలోచనలుంటాయనీ, ఆమెకీ స్వతంత్ర భావాలుంటాయనీ గుర్తించరేం యీ మగవాళ్ళు!
ఎప్పుడూ పురుషాధిక్యత! తను మగడివనీ, మగవాడిననీ రుజూచేసుకోటానికా అన్నట్టు అధికారం చెలాయిస్తారు, ఆజ్ఞాపిస్తారు. ఆంక్షలు విధిస్తారు. నడకమీద, కట్టుమీద, బొట్టుమీద, తిండిమీద కూడ ఆంక్షలు విధిస్తారని విన్నది. థాంక్ గాడ్ సారధీ యింకా ఆ స్థాయికి దిగజారలేదు.
అయినా అతనికా పట్టుదలేమిటి?
అప్పుడూ అంతే సావిత్రి కాళ్ళట్టుకుని క్షమాపణ వేడుకోమని నిర్దేశించాడు. క్లాసులో టీచర్_విద్యార్ధిని నిర్దేశించినట్టు ఏమిట్రా దుడుకుతనం.
తను చదువుకున్నది. నలుగురికి నీతి నియమాలు బోధించే విద్యాశాఖలో వున్నది. తనకి ఉచ్ఛనీచాలు తెలియవా! ఈ మగవాళ్ళంతా యింతేనేమో! పడగ్గదిలో బానిసలు_పదిమందిలో మగధీరులు. తండ్రి ముందు, అన్న ముందు, తల్లి, వదిన, చెల్లి సమక్షంలో తనతో సమానంగా చదువుకుని, తనతో సమానంగా ఉద్యోగం చేస్తోన్న తన భార్య తను చెప్పినట్టు అక్షరాలా పాటిస్తుంది అని ఋజువుచేసుకోవాలా!
