"నవ్వుతారేం స్వామీజీ !"
"సర్వసంగ పరిత్యాగులం మాకేం బాధ. బెయిలు కెళ్ళినా చింతలేదు. అది చిన్న బందిఖానా. ఇది పెద్ద ఖైదు. ఇది విడి ఖైదు. అది కఠినశిక్ష. అంతే తేడా. ఇక్కడా శిష్యులున్నారు. అక్కడా భక్తులున్నారు. మా కెక్కడైనా ఒక్కటే!"
"అహఁ ఆహాఁ ఏం శలవిచ్చారు! ఆణిముత్యాల్లాంటి మాట చెప్పారు. మీ మేలు మరువలేం. మమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించండి" అన్నాడు శేఖర్.
"అద్గదీ_అలా కాళ్లు పడితే కాని గురు కటాక్షం కల్గదు. ఇప్పుడే చెప్తున్నా. గజదొంగ అడవిరాముడు మా పూర్వాశ్రమం నామధేయం. పేరుకు ఇవి రంగుబట్టలు. అవసరమయితే శరీరంలో అడుగడుగునా అంగుళ మంగుళానికి మారణాయుధాలున్నాయి. మీ శతృసంహారం చేస్తా. నన్ను పూర్తిగా నమ్మండి గంభీరంగా అన్నాడు."
అందరూ పాదాలపై పడ్డారు. "స్వామీ ఆ యిద్దర్నే తొలగించండి. అంతే చాలు."
తల పంకించాడు స్వామీజీ.
* * *
నోటికెంత మాటవస్తే అంత మాట తిట్టాడు చౌదరి. అయితే కిక్కురు మానలేదు జనార్దన్. అతనా నేరం యింత త్వరగా బయట పడుతుందనుకోలేదు. నూటికి అయిదువంతులంటే ఆశపడి తెచ్చాడు. వ్యాపారం బాగా సాగితే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే తెచ్చాడు. డబ్బు ధారాళంగా ఖర్చు చేసినా ఎవరూ అనుమానించకపోవటంతో తెచ్చాడు. ఊళ్ళో మహమ్మారి లాంటి మట్కా జూదాన్ని ప్రవేశపెడితే అన్న పెద్ద మనుషులు అంగీకరిస్తే అంతా డబ్బు వ్యాప్తం చేయటానికి తెచ్చాడు. తెచ్చిందాంట్లో వందో వంతు వాడాడు.
కానీ విధి వక్రించింది.
అన్న చెడ తిట్టాడు. అవును మరి అవమానం జరిగింది కదా, ఆ మాత్రం తిట్టద్దూ అనుకున్నాడు.
"నన్ను క్షమించన్నయ్యా" అంతకు మించి అన్లేదు జనార్ధన్.
చౌదరి నిశ్శబ్దం అయ్యాడు.
"నీ ప్రతిష్ట నిలిచేట్టు చేస్తాను అన్నయ్యా. ఆ సోము గాడిని, జయన్నను, ఆ భార్గవిని లొంగదీస్తాను."
"ఎలాగా?"
"భార్గవి యింట్లో దొంగతనం చేయిస్తాను."
"ఊ"
"అత్యాచారం చేయిస్తాను !"
"ఎవరితో ?"
"నీతోనే? దానికదే శిక్ష."
జంకేడు. మనస్సులో గొంకేడు. మానసికంగా కుంకేడు.
"ఆ తప్పులు రెండూ వాళ్ళమీద బనాయిస్తాం!"
"మరి రిపోర్టు ?"
"దొంగతనానికి వాళ్ళే యిస్తారు. చోరీ సొమ్ము ఆ యింట్లో పెట్టిద్దాం. దాంతో వాడే దొంగవుతాడు."
చౌదరి ముఖం విప్పారింది. అతని ముఖం నిండా చిరునవ్వు పులుముకుంది. మెచ్చుకోలుగా తమ్ముడిని చూశాడు.
"ఇది సాధిస్తేనే నా ముఖం చూడు. పెళ్లి చెయ్. పెత్తనం యివ్వు. లేదా దేశాల వెంట పోతా."
"జనా" బాధగా పిలిచాడు చౌదరి. "ఇదంతా ఎందుకయ్యా. ఎవరికోసమయ్యా! అంతలేసి మాటలెందుకు. జరిగింది మర్చిపో. జరగబోయేదాన్ని ఆలోచన చెయ్. అంతే!"
జనార్ధన్ మాట్లాడలేదు.
చౌదరి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.
ఈ సంభాషణ జరిగిన వారం రోజుల తర్వాత ఓ సాయంకాలం అన్నను కలిసి "అన్నయ్యా! ఈ రాత్రికే దొంగతనం. నువ్వూ సిద్ధంగా వుండు" అన్నాడు జనార్ధన్.
"ఈ విషయం నలుగురికీ చెబుదాం!"
ముక్కుపై వేలేసుకున్నాడు జనార్ధన్. "ఇది వాళ్ళకి తెలియనక్కర్లేదు." దురుసుగా అన్నాడు.
"నీకు భార్గవిపై మనసుంది. అది అందరికీ తెలుసు. క్షమించు. తమ్ముడినై ఆ విషయం ఎక్కువగా మాటాడకూడదు. భార్గవిపై శేఖర్ కి మనసుంది. నాయుడికి మోజుంది. ధర్మారెడ్డికి ఆశుంది. అయినా బయటపడరు మనమెందుకు? వెల్తిపడాలి?"
