Previous Page Next Page 
వారుణి పేజి 57


    "ఈ రోజుల్లో డబ్బుతో కానిపనేంవుంది?" అంటూ కొడుక్కి రిజిగ్నేషన్ లెటర్ యిచ్చేశాడు.అది శంకర రామారావుగారు పంపింది. ఫణి రిజిష్టరు పోస్టు ద్వారా ఆ రోజు పంపిన లెటర్ పోస్టాఫీసులోనే తీసేయబడింది. ఆ స్థానంలో అతని మెడికల్ లీవ్ ఎప్లికేషన్ పంపించాడు.
    సుబ్బరత్నమ్మ అగ్గిమీద గుగ్గిలంలాగా పేలింది.
    "ఒక్కమాట_ ఒక్క మాటంటే ఒక్క మాట చెబితే తన "అబ్బ" సొమ్ము పోతుందా? ఈ ఖర్చు మిగిలేది కాదా? వాడేం చండశాసనుడా! తనంటే ఎంతో అభిమానం కదా! బాబాయ్, బాబాయ్ అంటూ వగలుపోయిందే ఆ రోజు_ సున్నుండలు తినెళ్ళిన కృతజ్ఞత కూడా లేదు వాడికి. ఒట్టి కృతఘ్నపు ముండా కొడుకు. పదివేలు_ అమ్మో పదివేలంటే మాటలా!
    "ఎలా వస్తాయి. వెళ్ళమను. వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగి తెమ్మను. కట్నం తెచ్చిందా? కానుకలు తెచ్చిందా? ఈ రోజు తను ఒక మాట చెబితే అంత సొమ్ము మిగిలిపోయేది కదా! ఏం డబ్బు చేదా?"
    ధోరణిగా తిడుతోంది ఆమె.
    నారాయణ వింటున్నాడు. సారధీ అక్కడే వున్నాడు. గదిలో వున్న వారుణికి మనస్సు కుతకుత లాడిపోతోంది. ఆమెకి అత్తగారి ధోరణి అలవాటై పోయింది మొదటిరోజే. కాని సారధి అక్కడే వుండి కిమ్మనకుండా వుండటమే బాధాకరంగా వుంది.
    "నువ్వేం వాజమ్మవిరా! అన్నకి అంత ఆపద వస్తే_ అక్కడే వుండి నీ భార్యతో ఒక్కమాట చెప్పించలేకపోయావు! ఛి! ఛీ!"
    "అమ్మా!"
    "అవున్లే_ నీకేం పట్టింది. అది నీ ఆపద కాదు కదా! పుడుతూ అన్నదమ్ములు, పెరుగుతూ దాయాదులు అని వూరకే అన్నారా? ఛ! ఛ! ఏమ్మనుషుల్రా మీరు?" యీసడింపుగా అందామె.
    "అమ్మా! అక్కడ మాకు మాట్టాడానికే అవకాశం యివ్వలేదాయన. అయినా వారుణిని చూశాకే ఆయన కేసు పెట్టకుండా వెళ్ళిపోయారు. డబ్బు ఖర్చయినా యిబ్బంది తీరిపోయింది గదా!"
    "ఆ డబ్బు ఎవరిస్తార్రా? నువ్విస్తావా? నీ భార్య యిస్తుందా? మీ మామ యిస్తాడా?"
    "నేనిస్తాను!" చప్పున మాట జారేడు ఆవేశంలో.
    "ఆహాఁ నువ్విస్తావా? ఇంకేం_తే_"
    "నా జేబులో వుందా? బ్యాంక్ లో వుందా? వారం రోజులు ఆగు తెచ్చిస్తాను." దృఢంగా అన్నాడు. అతని మనస్సులో వారుణి డబ్బు మెదులుతోంది.
    నారాయణ విస్మయంతో వింటున్నాడు. "ఏమిటి వీడి ధైర్యం! మొదటినుంచీ యింతే. మాట పట్టింపు ఎక్కువ. ఎలా తెస్తాడు?
    "వారం రోజుల్లో తేకపోయావో_నువ్వూ నీ భార్యా యింట్లోంచి వెళ్ళిపోవాలి. లేదా నీ భార్యని పంపెయ్."
    "రత్నం" గద్దింపుగా అన్నాడు నారాయణ.
    "మీకు తెలియదు వూరుకోండి" భర్తని కసురుకుందామె.
    అలాగే అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడతను.


                                             26


    విసురుగా గదిలోకి వచ్చిన భర్తని అదోలా చూసిందామె. భార్యవైపు నిశితంగా చూశాడు సారధి. మంచంపై పడుకుని అలాగే చూస్తూ వుండిపోయింది వారుణి.
    నిమ్మకు నీరెత్తినట్లుగా వుండిపోయిన ఆమెని చూడగానే అతన్లో "కసి" బయలుదేరింది!
    కుర్చీలో కూర్చున్నాడు.
    నిప్పుల మీద వున్నట్టుగా వున్న భర్తని చూడగానే ఆమెకి నవ్వొచ్చింది. "ఎందుకంత ఉక్రోషం! కేవలం మగవాడిగా పుడితే_మగబుద్ధి పెరిగితే_మొగుడవుతూనే యీ దురహంకారం వచ్చేస్తుందా? ఆలోచించే గుణమే నశిస్తుందా? భార్య అనగానే ఒక కట్టు బానిసగా అనిపిస్తుందా? ఛీ! ఛీ! ఏం మగవాళ్ళు" అనుకుంది. ఆ ధోరణిలో అతన్ని పలుకరించాలనిపించలేదామెకి. తన్నుకొస్తోన్న కోపాన్నీ ఉక్రోషాన్ని బలవంతంగా నిగ్రహించుకోటానికి కళ్ళు మూసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS