Previous Page Next Page 
రాగోదయం పేజి 56


    "నాకే దొంగనోట్లు యిస్తారా? ఎంత ధైర్యం ముందు మిమ్మల్ని అరెస్టు చేస్తాను" చిందులేశాడు అతను.
    తెల్లబోయాడు చౌదరి.
    మిగతా యిద్దరికీ కూడా ఆశ్చర్యంగా వుంది.
    చవుదరి తమ్ముడు మాత్రం మెల్లిగా లోపలికి తప్పుకున్నాడు.
    నోట్లకట్ట చౌదరి వైపు విసిరేసి మీతో కుమ్మక్కవుతున్నానని మరీ యింత చులకనా? పోలీసు జులుం చూపిస్తాను. లాఠీ గట్టితనం రుచి చూపిస్తాను. ఎర్రటోపీ అంటే ఏమనుకున్నావ్? కాకీ చొక్కాకి కంగారు పడుతుందే జనం. ఎర్రటోపీ చూసే బెదిరిపోతుందే లోకం? అలాంటి మమ్మల్నే మోసం చేస్తావా? ఆయ్." అన్నాడు యస్.ఐ. కోపంగా చిందులు తొక్కుతూ.
    చవుదరి కంతా అయోమయంగా వుంది. నోట మాట రావటంలేదు. అది చూసి ధర్మారెడ్డి చొరవ చేసుకున్నాడు.
    "అదేమిటి సార్." మనం మనం ఒకటి. మనలో మనకి మోసాలుంటాయా. ఇందులో ఏదో పొరపాటు జరిగినట్టుంది. చౌదరీ ఇంకో కట్ట చూడు అన్నాడు.
    చౌదరి కిక్కురు మనలేదు. అది జేబులో పెట్టుకుని లోపలికి వెళ్ళి బీరువా తెరిచి మరో కట్ట తెచ్చాడు. అందించాడు.
    అప్పుడన్నాడు నాయుడు. "సార్! మీరన్నట్టుగా స్వామీజీ హంతకుడయినా అతని విషయం మర్చిపోండి. ఈ నోట్ల సంగతి మర్చిపోండి. దసరాకి మళ్లీ పంపండి. మామూలు పంపిస్తాం! మేం మిమ్మల్ని కాదని పోతామా!"
    తలూపాడు యస్.ఐ.
    ధర్మారెడ్డి చకచకా స్టేట్ మెంట్ తయారుచేసి సంతకం పెట్టాడు. యస్.ఐ. అది అందుకుని మిగతా వారికి చదివి వినిపించి సంతకాలు చేయించుకుని జీప్ ఎక్కి వెళ్ళిపోయాడు.
    "ఆ నోట్లెక్కడివి ?"
    నాయుడి ప్రశ్నకు చౌదరి సమాధానం యివ్వలేదు.
    "సరే! మనకు యస్.ఐ. మేలే చేశాడు. స్వామీజీ ఎక్కడ దాక్కున్నాడో చూద్దాం, పదండి. అవసరం వస్తే బెదిరించి అయినా ఖూనీ చేద్దాం. మనకు రెండు రకాలుగా మేలు." అన్నాడు మునసబు.
    ఎవరూ ఏం మాట్లాళ్ళేదు. నిశ్శబ్దం భయంకరంగా చీలుస్తోంది వాతావరణాన్ని.


                                          26


    అలాగా యిలాగా వెతికి ఆఖరికి కరణం యింట్లో హాయిగా నిద్రపోతున్న స్వామీజీని కనుక్కున్నారు. అయితే టప్పున అతని ముఖాన్నే అడిగెయ్యటానికి జంకేరు.
    "అనుకోకుండా కరణాన్ని దయ చూడాలనిపించి వెళ్ళాం. మీరు కంగారుపడ్డారా!"
    "ఉహు భయపడ్డాం."
    "ఎందుకు ?" కనుబొమ్మలు ముడిపడ్డాయి.
    "పోలీసులు ఓ హంతకుడిని వెతుక్కుంటూ వచ్చారు!"
    "దొరికాడా ?" కుతూహలంగా అడిగాడు స్వామీజీ.
    "ఉహు ఆచూకీ దొరికిందట. చేయి తడిపేసి పంపించాం! అంతే!"
    "మీకు చహరా యిచ్చాడా ?"
    "ఆ ఫోటో యిచ్చాడు."
    "కనుక్కున్నారా ?"
    "స్వామీ! ఇన్ని దొంగ తిరుగుళ్ళు ఎందుకు. ఆ బొమ్మకి మీకు పోలికలున్నాయి. ఆయనగారికి మీ ఆచూకీ తెలిసే వచ్చాడట. మీరు కనిపించకుండా పోయారు. అందుకే డబ్బు యిచ్చి పంపేం!"
    స్వామీజీ గంభీరంగా అయిపోయారు.
    "బాబాజీ! మీరు హంతకులైనా, దొంగలైనా మాకు అక్కరలేదు. మాకు ఆలోచనలు చెప్పే బుర్ర కావాలి. అంతే. మా వూళ్ళో మాలా మాదిగ ముండాకొడుకులు చదువుకుని వచ్చి మా గొళ్లూడ గొడుతున్నారు. వాటినో చూపు చూడాలి. మీ దయ కావాలి!"
    పక పకా నవ్వేరు స్వామీజీ !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS