Previous Page Next Page 
వారుణి పేజి 56


    తల పగిలిపోతున్నట్టుగా వుందతనికి.
    ఆఫీసరు రికార్డు తయారు చేస్తున్నాడు. నోట్ల నంబర్లు నోట్ చేసుకున్నాడు. పేషెంట్ "హిస్టరీ" అంతా స్టేట్ మెంట్ గా రాసుకుంటున్నాడు. ఏం జరుగుతోందో, మరేం జరగబోతోందో తెలీని స్థితిలో వున్నాడు అతను.
    అప్పుడు వచ్చారు సారధి, వారుణి.
    ఇద్దరి ముఖాల్లోనూ ఆతృత, ఆందోళన.
    వాళ్ళని చూడగానే నారాయణ ముఖం వికసించింది. "వారుణీ! మీ బావ తప్పు చేశాడు నిజమే! అది నేరమే! కానీ ఘోరం కాదు. ఈ రోజుల్లో అంతా మామూళ్లు తీసుకోవటం మామూలై పోయింది. ఎక్కడ లేదు యీ అలవాటు! చూడు! ఈయన పట్టేశాడు వీడిని. ఇప్పుడు కేసు పెడితే అవమానం. ఉద్యోగం పోతుంది. సర్టిఫికెట్ కాన్సిల్ చేస్తారేమో. జైల్లో పెడతారేమో. ఏం జరుగుతుందో తల్లీ? నువ్వే యిప్పుడు చక్రం అడ్డు వెయ్యాలి! అడుగో శంకర రామారావు! ఆయనే ఆఫీసరు_ఆయన యిప్పుడు చూసీచూడనట్టు వదిలేస్తే_ యిహ చస్తే జన్మలో మళ్ళీ యిలా చెయ్యడు.
    "నువ్వు చెప్పమ్మా. నువ్వు చెబితే ఆయన వింటారు. ఇది వాడి ఒక్కడి సమస్యే కాదు. మన కుటుంబం మొత్తం సమస్య. మన పరువు ప్రతిష్ఠలు, మాన మర్యాదలు అన్నీ మంటగలిసిపోతాయి. నువ్వే ఎలాగైనా కాపాడాలి."
    చప్పున అటు చూసింది వారుణి.
    శంకర రామారావుగారి ముఖం కోపంతో జేవురించి వుంది. విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చటంలో సత్యహరిశ్చంద్రుడంతటి వ్యక్తి ఆయన.
    వారుణికీవిషయం అర్థమైపోయింది. కానీ నోటమాట రాలేదు.
    ఫణి ముందుకొచ్చాడు. సర్! ఈ ఒక్కసారీ నా తప్పుని మన్నించండి! నేనెప్పుడూ యిలా తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో చిక్కుకోలేదు. ఇక ముందు ఎప్పుడూ యిలా చెయ్యను. ఐ ప్రామిస్ ఫర్ యిట్. గాడ్ ప్రామిస్. ప్రొఫెషన్ మీద ఒట్టేసి చెబుతున్నాను."
    "స్టాపిట్_ నన్ను రికమెండేషన్ తో లొంగదీయాలనుకుంటున్నారా? నో! నెవ్వర్! వారుణి కాదు సాక్షాత్తు పి.యం. వచ్చిన నేను యిలా వినను. మిస్టర్ మర్యాదగా సంతకం చేస్తావా? పోలీసులకి ఫోన్ చెయ్యనా?"
    ఆ మాటలు విన్న వారుణి మనస్సు తేలికపడ్డది. ఆయన ఎవరి మాటా వినరు. తను చెప్పలేదు. చెప్పినా వ్యర్థమే! చెప్పలేదన్న నింద తనమీద పడకుండా ఆయన తనని కాపాడారు అనుకుంది.
    నారాయణ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి.
    సారధికి అయోమయంగా వుంది. ఫణి ముఖం కత్తి వేటుకి నెత్తురు చుక్క రాలనట్టు అయిపోయింది.
    "ఒక మార్గం చెబుతాను వింటావా?"
    ఆయన ఆ మాట అనగానే ఫణి ముఖాన రక్తం ప్రవహించింది చెప్పండి సార్!"
    "నువ్వు జాబ్ కి రిజయిన్ చెయ్యి_ కేసు పెట్టను."
    క్షణకాలం_ఆపదకి అటా యిటా అన్నట్టుగా వుంది స్థితి. కేసు పెట్టుకోమని కోర్టులో వాదించటమా_ లౌక్యంగా రిజైన్ చేసి తప్పుకోవటమా? ఏది సమంజసం.
    "ఫణీ_ రిజైన్ చెయ్యి" నారాయణ చెప్పారు. రిజిగ్నేషన్ లెటర్ యిలా పంపేసి_ మళ్ళీ అలా మెడికల్ డైరక్టర్ వద్దకి వెళ్ళి లెటర్ తెచ్చుకుంటే సరి_" అనుకున్నారాయన.
    చకచక రిజిగ్నేషన్ రాసేసి సంతకం చేశాడు ఫణి.
    "ఇంకో కాపీ రాయి" చెప్పారు రావుగారు. అలాగే రాసి ఆయనకిచ్చాడు ఫణి.
    ఆ లెటర్ తీసుకుని వెళ్ళిపోయారు రావుగారు. వారుణి వైపు కన్నెత్తయినా చూళ్ళేదు. మరో నిమిషం తర్వాత అంతా యింటి ముఖం పట్టారు.
    నారాయణ "డైరక్టరు" గారి వద్దకి బయల్దేరాడు.


                                                                            25


    ఆ రోజు అంటుకున్న బాంబు వారం రోజుల తర్వాత పేలింది. నారాయణ పదివేల ఖర్చుతో పని జరిపించుకుని వచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS