"కనీసం యీ సంబంధం తప్పిపోయేట్టు చెయ్యి వదినా! ఆ మాత్రం చేయగలిగితే చాలు. తర్వాత చదువు, ఉద్యోగం విషయాలు ఆలోచించొచ్చు. ముందు యీ గండం గడిస్తే ఆనక వెయ్యి దేముళ్ళకి మొక్కొచ్చు!"
"ఎందుకు ?"
"ఇప్పుడీ ఆపద దాటాలి కదా !"
"పద్మా! నేను మీ అన్నయ్యతో చెబుతాను. ఆయన వింటే సరి! లేదా మామగారితో చెబుతాను. ఆయన ఉద్దేశ్యం కనుక్కుని బావగారితో మాటాడతాను. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపేస్తాను. నూరు అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్ళి చెయ్యాలనేది పాత సామెత. అది బూజు పట్టిపోయింది. ఈ రోజుల్లో యిష్టంలేని పెళ్ళిని ఆపుచెయ్యటం పుణ్యకార్యం."
"థాంక్యూ వదినా! థాంక్యూ" పద్మ ముఖంలో కొత్త కాంతులు వెల్లివిరిశాయి. కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది.
తిరిగి వారుణి ఆలోచనల్లో మునిగిపోయింది.
24
హాస్పిటల్లో "బెడ్" కోసం వందరూపాయలు పేషెంట్ నుంచి "ఫీజు"గా "లంచం" తీసుకుంటూ పట్టుబడ్డాడు ఫణి. పేషెంట్ పల్లెటూరివాడు. బొత్తిగా లోకం తెలియదు. డాక్టర్ తనని "ఫీజు"గా డబ్బు అడిగాడనీ, అదిస్తేనే "బెడ్" యిచ్చి యిన్ పేషెంట్ గా చేర్చుకుంటానని చెప్పాడనీ అమాయకంగా జరిగిన యదార్థం చెప్పాడు.
ఫణి ఏమీ చెప్పలేని యిరకాటంలో పడ్డాడు. ఆఫీసరు ముందు దోషిలా తలొంచుకున్నాడు. అతన్ని అక్కడికక్కడే అరెస్ట్ చేయవలసింది. కానీ నారాయణగారి కుమారుడన్న మాట మీద ఆ ఆఫీసరు కాస్త తటపటాయించాడు.
అంతలో అతనికో డాక్టర్ ఫోన్ చేయటం వల్ల నారాయణ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళింకా కన్సల్టింగ్ రూంలోనే వున్నారు.
నారాయణ రాక ఆ ఆఫీసరుకి బొత్తిగా నచ్చలేదు.
"మీరు వెళ్ళండి" అన్నాడు నిర్మొఖమాటంగా.
కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు ఫణి.
అది ఆయనకి మరీ అసహ్యమనిపించింది "చూడు డాక్టర్! నువ్వు మెడిసిన్ లో ప్రవేశించేప్పుడే ఆలోచించుకోవలసింది. పట్టా పుచ్చుకుంటూ నువ్వేం ప్రతిజ్ఞ చేశావో గుర్తుందా? మెడిసిన్ లో చేరుతూ ఏం ప్రతిజ్ఞ చేశావో గుర్తుందా?
"అవన్నీ మరిచిపోయావా నువ్వు? నువ్వు డాక్టరువా? నిన్ను చూస్తే అసహ్యంగా వుంది. ప్రయివేట్ ప్రాక్టీసు పెట్టుకుని వుంటే నిన్నెవ్వరూ ఏమీ ప్రశ్నించేవాళ్ళు కాదు. కానీ ప్రజాసేవకి అంకితమైన యీ పరమ పవిత్రమైన ఉద్యోగాన్ని యిలా రోగుల్ని పీడిస్తూ కలుషితం చెయ్యొద్దు.
"నీకు బాధ్యత తెలియదా? విద్యుక్తధర్మం తెలీదా? నువ్వు ధర్మం తప్పేవు. నన్ను ధర్మం తప్పమంటావా? ఇలా అవినీతిని నిరోధించటమే నా కర్తవ్యం! దాన్ని విస్మరించమంటావా? నో!నో!"
నారాయణకి కాళ్లూ చేతులు ఆళ్ళేదు.
ఆ మనిషిని చూసిన గుర్తుంది. కానీ ఎవరో చప్పున పోల్చుకోలేక పోతున్నాడు. ప్రాణాల మీదికి వచ్చింది కేసు. ఇప్పుడు సరైన చికిత్స జరక్కపోతే ఫణి ఉద్యోగం పోతుంది. సర్టిఫికేట్ కాన్సిల్ కావచ్చు. వెధవది ఉద్యోగం పోయినందుకు బాధలేదు. ప్రయివేటు ప్రాక్టీసు పెట్టుకోవచ్చు. నారాయణ ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి.
"స్టేట్ మెంట్ యివ్వు!"
"సర్!" ప్రాధేయపడ్డాడు ఫణి.
అదోలా చూశారాయన.
అప్పుడే చప్పున ఆయనెవరయిందీ గుర్తుకొచ్చింది నారాయణకి. హడావిడిగా బయటికి వచ్చి నర్స్ తో యింటికి వెళ్ళి వారుణిని, సారధిని ఉన్నవాళ్ళని వున్నట్టుగా బయలుదేరి రమ్మని "తరిమాడు." తిరిగి గదిలోకి వచ్చాడు. పది పదిహేను నిమిషాలు గడిస్తే_ కేసుకి అడ్డం వెయ్యొచ్చు. అదీ యిప్పటి అతని ఆలోచన.
ఫణి వంచిన తల ఎత్తటం లేదు. అతని మనస్సులో వేలాది వేల ఆలోచనలు కందిరీగల్లా రేగుతూ మనస్సుని కుడుతున్నాయి. ఇదమిద్ధం అని నిర్ణయించుకోలేని ఆలోచనలు వస్తున్నాయి. పరారి, ఆత్మహత్య, బెదిరింపూ, బుకాయింపు, కాళ్ళు పట్టుకోవటం_ ఏది? ఏది? ఏది?
