Previous Page Next Page 
నేను పేజి 56


    దీన్ని గురించే నేను రెండు మూడు రోజులుగా ఆలోచిస్తున్నాను. నిజంగానే నేను చాలా అసహ్యంగా ప్రవర్తించాను. జరిగిందానికి పశ్చాత్తాపపడుతున్నాను. ఇప్పుడు నేను చాలా మారాను."    


    "మనిషెప్పటికైనా మారతాడా? నమ్మశక్యంగాని విషయం."


    "ప్లీజ్. నన్ను నమ్మండి. మీ మీద కోరికతో, మీరు నాకు దక్కలేదన్న కసితో చాలా భీభత్సంగా ప్రవర్తించాను. స్త్రీ విషయంలో మగాడు మృగంలా బిహేవ్ చేస్తాడు. అర్థం లేకుండా, అనవసరంగా దూసుకు వస్తుంటాడు. ఇవన్నీ నిజాలే. కాని.... సహజంగా నేను దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణీ కాను. మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడల్లా ఆత్మ విమర్శ చేసుకుంటూ మానసికంగా చిత్రవధ ననుభవిస్తున్నాను. ఎందుకిలా చేస్తున్నాను? నా మీద నాకే రోత పుట్టింది. చివరకు మిమ్మల్ని క్షమించమని అడక్కుండా ఉండలేని స్థితికొచ్చాను."  


    అతని ముఖంలోకి చూశాను.


    కళ్ళూ కళ్ళూ కలుసుకున్నాయి.


    ఆ కళ్ళలోని భావం అర్థం కావటం లేదు.


    మనిషి ఎప్పుడూ నిజం చెప్పలేడు. ఎందుకంటే తనలోని నిజాన్ని చేరుకునే స్థితికి అతను చేరుకోలేడు కాబట్టి నిజమనే దానికి రూపం లేదు.


    అతన్నన్ను ట్రాప్ చేస్తున్నాడా? నేను బోల్తా పడుతున్నానా? తెలీటం లేదు. ఈ తెలీక పోవటమనే అనిశ్చిత స్థితే మనిషి నెక్కడికో ఈడ్చుకుపోతుంది.   


    "మాట్లాడరేం? చెప్పండి కోపం లేదని."


    ఏమనాలో తోచక "కోపం లేదులెండి" అన్నాను.


    "అలా కాదు. క్షమించానని స్పష్టంగా చెప్పాలి."


    "మిమ్మల్ని క్షమించేటంతటి గొప్పదాన్ని కాదండీ."


    అంటే నేను కొంత మెత్తబడినట్లే లెక్క.


    తర్వాత కొన్ని రోజులు సురేంద్ర మా కుటుంబంలో ఓ సభ్యునిలా ఎంతో అంతరంగికంగా మెలిగాడు. సుకుమార్ కూడా తన ప్రవర్తన పట్ల చాలా పశ్చాత్తాపం ప్రకటించాడు. రెండు మూడుసార్లు నా కాళ్ళమీద పడి ఏడ్చాడు. జీవితంలో మగాడు ఇలా ఆడదాని కాళ్ళమీద పడి ఏడ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి.


    "ఛీ ఇదేమిటి? లే" అనేదాన్ని.


    "ఇంతగా నిన్ను ప్రేమించి.... చాలా అసహ్యంగా అనుమానించాను."  


    "భార్యాభర్తల మధ్య ఇలాంటివి సహజమేలే."


    "సురేంద్ర కూడా చాలా సిగ్గుపడుతున్నాడు." నేనేమీ మాట్లాడలేదు.


    ఒక్క సంగతి నాకు స్పష్టంగా అర్థమవుతుంది. సుకుమార్ ప్రవర్తనలో చాలా నిజాయితీ ఉంది. నా పట్ల ఇదివరకటి కంటే మమకారం పెరిగింది. నన్ను విడిచి క్షణమైనా ఉండలేకపోతున్నాడు. కాని ఉద్యోగరీత్యా అప్పుడప్పుడూ ఎడబాటు తప్పటం లేదు.


    "నీతో అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించానో తెలుసా? నువ్వు ఇంకొకరితో క్లోజ్ గా ఉండటం భరించలేకనే. ఆ క్లోజ్ నెస్ పెరిగితే....


    "ఏం చేసేవాడివి?" అన్నాను నవ్వుతూ.


    "చచ్చిపోయేవాడిని."


    "అంటే ఆత్మహత్య చేసుకునా? గుండె ఆగిపోయా?"


    "బహుశా రెండోదే జరగవచ్చు. ఒకవేళ ఆగిపోకపోతే ఉరేసుకొని చచ్చిపోతాను.


    "ఒకసారి చచ్చిపో చూస్తాను."


    "చచ్చిపోయి తిరిగి ఎలా బతుకుతాను?"


    "సుకుమార్ నాకో చిత్రమైన కోరికుంది."


    "ఏమిటది?"


    "చచ్చిపోతే ఎలా ఉంటుందో చూసికొని మళ్ళీ బ్రతకాలని ఉంది."


    "ఇది చాలా అందమైన కోరిక."


    "సుకుమార్ ప్రపంచంలో అన్నిటికన్నా సుఖమైన దేమిటో తెలుసా?"


    "ఏమిటన్నట్లు చూశాడు." ఆ చూపుల్లో చాలా అమాయకత్వముంది.


    "చావు"


    నన్ను గట్టిగా కౌగిలించుకొని చెంపకు చెంప చేర్చి మౌనంగా ఉండిపోయాడు. అతన్లో దుఃఖం తెలుస్తోంది.


    "సుకుమార్! సుకుమార్" అంటూ నా హృదయం ఆర్తిగా రోదిస్తోంది.


    అతను డ్రింక్స్ మానేశాడు. చిత్రమేమిటంటే సురేంద్ర కూడా మానేశాడు.


    ముగ్గురం కలిసి అప్పుడప్పుడు డిన్నర్లకు వెళ్లేవాళ్లం. సురేంద్ర ప్రవర్తన చాలా హుందాగా, సభ్యతగా ఉండేది.


    ఈ నాగరికతలో ఓ చిత్రముంది. సాయంత్రాలు కాగానే కలుసుకోవటాలు, ఎక్కడెక్కడికో వెళ్ళటాలు, డిన్నర్లు, ఒకసారి మొదలయినాక మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూంటాయి.   


    ఫార్మాలిటీస్ ను ఈసడించుకునే నాగరికులు కూడా మరో రకం ఫార్మాలిటీస్ కు లొంగిపోతూంటారు.


    మదన్ ని కలుసుకోవటం కొంచం తగ్గింది. ఇష్టం లేక కాదు ఇద్దరం ఎవరిదార్లో వారు బిజీ అయ్యాననిపిస్తోంది.     


    ఒకరోజు ఉదయం సుకుమార్ నాతో అన్నాడు. "ఇవేళ సాయంత్రం సురేంద్ర ఇంట్లో చిన్న పార్టీ ఉంది. మన ముగ్గురికే. ఈ రోజు సురేంద్ర మనకో ముఖ్య సమాచారం వినిపించబోతున్నాడు.  


    "ఏమిటది?"


    "నాకూ తెలీదు. బహుశా అతను పెళ్ళి చేసుకోటానికి నిర్ణయం తీసుకున్నట్లున్నాడు.


    "మంచిదే"


    "సాయంత్రం ఆఫీస్ నుంచి రావటానికి కొంత ఆలశ్యం కావచ్చు. సురేంద్రతో చెప్పాను. ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదన్నాడు.                                             


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS