అసలు జీవిత సత్యమంతా ఈ భరించటంలోనే ఇమిడి ఉంది. శృతులు మించటం, అపస్వరాలూ.... ఇవన్నీ ఏ పద్ధతిలో ఉన్నా వెంటాడుతూనే ఉంటాయి. వాటినుంచి తప్పించుకోటానికి మనల్ని మనం పోగొట్టుకోలేం.
"ఏమైనా అతను చాలా చెడ్డవాడని విన్నాను. నువ్వతన్తో క్లోజ్ గా ఉండటం నాకిష్టం లేదు."
నేనేం జవాబు చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాను.
ఇక్కడో సంగతి స్పష్టంగా చెప్పాలి. 'తప్పు' అనే దాన్ని గురించి ఇంతవరకూ చాలాసార్లు సందర్భానుసారం నిర్వచిస్తూ వచ్చాను. అది ఓ కాన్ స్వెప్ట్ అని కూడా చెప్పాను. ఇప్పుడా లోతుపాతుల్లోకి పోకుండా ప్రస్తుత మా పదాన్ని మామూలుగా వాడుతున్నాను.
మదన్ ని నేను తరచు కలుసుకుంటూనే ఉన్నాను. మా ఇద్దరి మధ్యా ఎక్కువగా సాహిత్యపరమైన సంభాషణే జరిగేది. అతని మాటల్లోగాని, ప్రవర్తనలోగాని అనౌచిత్యం నాకేం కనబడలేదు. అతన్తో అలా మసులుతూ ఉండటం "తప్పు" అని నాకనిపించలేదు. సుకుమార్ చాలా సంఘర్షణకు గురవుతున్నాడని తెలిసినా. బాధపడుతున్నాడని తెలిసినా, అసూయతో సతమతమవుతున్నాడని తెలిసినా నాకేం పశ్చాత్తాపం కలగటం లేదు. ఎందుకంటే నా ప్రవర్తన 'తప్పు' అని అనిపించటం లేదు. నాలో కూడా ద్వంద ప్రవృత్తి ఉందని తెలుస్తూనే ఉంది. అయినా నన్ను నేను సమర్థించుకుంటూనే ఉన్నాను.
మదన్ కి పెళ్ళి కాలేదని తెలుసు. దాన్ని గురించి మా మధ్య ప్రస్తావన కూడా రాలేదు. ఒకసారి మాత్రం లీలగా "ఆ ఝంఝాటంలో ఇరుక్కోవటమిష్టంలేక పెళ్ళి చేసుకోలేదు" అన్నాడు. నేను వినీ విననట్లు ఊరుకున్నాను.
సుకుమార్ జెలసికి కారణం సురేంద్రే అని తెలిసిపోతోంది. వాళ్లిద్దరూ రోజూ డ్రింక్ చేస్తున్నారు. నామీద నూరిపొయ్యటం ద్వారా సురేంద్ర కక్ష తీర్చుకుంటున్నాడు.
ఇంచుమించు రోజూ మా ఇద్దరి మధ్యా రభస జరుగుతూనే ఉంది.
ఓ రాత్రి బాగా డ్రింక్ చేసి వచ్చాడు. మంచి నిద్రలో ఉన్నదాన్ని తట్టి లేపి "నువ్వు మారతావా మారవా?" అన్నాడు గట్టిగా కుదుపుతూ.
మంచి నిద్రనుండి లేచానేమో, నాకు కోపమొచ్చి "మారను" అన్నాను పెంకెగా.
"మారవూ? మారవూ?" అంటూ చెంపమీద పెడీమని కొట్టాడు.
ఇలా జరుగుతుందని ఊహించలేదేమో, దిమ్మెరపోయినట్లయి కళ్ళు తిరుగుతుంటే నిగ్రహించుకుంటున్నాను.
అతన్ని ఒక్కమాట అనలేదు.
తర్వాత రెండు రోజుల్లోనే నా జీవితం మరో భయంకరమైన మలుపు తిరిగింది.
* * *
మనిషి.... సిద్ధాంత ప్రవృత్తుల నుంచి బయటపడి ప్రాక్టికల్ గా జీవించాలన్న తాపత్రయం తాపత్రయంగానే మిగిలిపోతోంది. చివరకు ఆ థియరీ ఒరవడిలోనే కొట్టుకు పోక తప్పటం లేదు.
ఒక మనిషి ఇంకో మనిషికి అంకితమయ్యాననుకోవటం కేవలం భ్రమేమో. సుకుమార్ వైపు ఎంత జరగాలని ఉన్నా పూర్తిగా సఫలీకృతురాల్ని కాలేకపోతున్నాను.
అసలు సంసారాలన్నీ ఇంతేనేమో. ప్రేమకు నిర్వచనం తెలుసుకునే ప్రయత్నంలో తప్పటడుగులే ఎక్కువగా దారి తీస్తూంటాయి.
చాలా అసహనంగా ఉంది.
ఓ మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా కూర్చుని మదన్ రాసిన కొత్త నవల చదువుతున్నాను.
ఆ నవల్లో ఇతివృత్తంగానీ, పాత్రల చిత్రీకరణగానీ ఎంత గొప్పగా ఉన్నాయంటే.... పరిసరాల్ని కూడా మరిచిపోయి అందులో లీనమైపోయాను. మదన్ రచనల్లో నాకు కనిపించే విశేషమేమిటంటే నవలంతా వెదికినా ఒక్క వృధా వాక్యం కూడా కనబడలేదు. రాసిన ప్రతి అక్షరమూ ఆ కథా కథనంలో బిగువుగా ఇమిడి పోయినట్లు అమరి ఉంటుంది. కొంతమంది రచయితలు చాలాకాలం బట్టీ రాస్తూ ఉండి కూడా.... ఊ .... ఊకదంపుడు రాస్తూ ఉంటారు. పదాల పొదుపు ఉండదు. మదన్ రచనల్లో కవిత్వధోరణి, ఆ సొగసులూ ఉండవు. కాని అతను చిత్రించిన సన్నివేశాలు, పాత్రల సంభాషణలూ మామూలుగా ఉన్నట్లు కనిపిస్తూ, గుండెల్ని తట్టిలేపుతూ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అతను స్త్రీనెక్కడా వర్ణించడు. బహుశా వర్ణించటం చేతకాదేమో కూడా, కాని ఆ పాత్ర ప్రవర్తనా, సంభాషణలూ ఆమె రూపాన్ని కళ్ళముందు నిలబడేలా చేస్తాయి. ఇది ఏ కొద్దిమందికి మాత్రమే సాధ్యమయే టెక్నిక్.
ఎప్పుడొచ్చాడో తెలీదు. నవల పేజీ త్రిప్పుతూ ఏదో అనుమానం తోచి తలెత్తి చూసేసరికి సురేంద్ర నిలబడి ఉన్నాడు.
ఉలికిపాటుని అణుచుకుంటూ "మీరా?" అన్నాను మర్యాదగానే.
సురేంద్ర ముఖం ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉంది. "మీతో కొంచం మాట్లాడాలనొచ్చాను" అన్నాడు.
"మీరు నా సొంత విషయాల్లో జోక్యం చేసుకుని చాలా బ్లాక్ మెయిల్ చేశారు. నా హజ్బెండ్ కు అసహ్యకరమైన విషయాలన్నీ నూరిపోశారు. మీతో మాట్లాడాలని నా కనిపించటం లేదు."
