Previous Page Next Page 
వారుణి పేజి 54


    ఎంతయినా అతనామె భర్త_తనెంత చెల్లెలయినా తనకి కొన్ని లిమిట్స్ వున్నాయి_వుంటాయి.
    "పద్మా! నేను మామగారితో చెబుతాను!"
    "ఏం చెబుతావు ?"
    "పద్మకి యిప్పుడే పెళ్ళేంటండీ అంటాను. ఇంకా బాగా చదువుకోనివ్వండి అంటాను. అప్పుడే తగిన సంబంధం చూద్దామండీ అంటాను. ఈ రోజుల్లో ఎంత ఆస్తి వున్నా, ఐశ్వర్యం వున్నా ఉద్యోగం లేంది భద్రత వుండదండీ అంటాను. అయినా బి.ఏ. తప్పిన కుర్రాడేంటండీ అంటాను. డాక్టర్నో, లాయర్నో, ఇంజనీయర్నో వెదకండి అంటాను" తమాషాగా అంది వారుణి.
    "ఊహూఁ అలా కాదొదినా! నాన్నకి చెప్పి లాభం లేదు. ఆయన అమ్మ యిన్ఫూయెన్స్ లో వున్నారు. నువ్వు అన్నయ్యని కోచ్ చెయ్యి చాలు. అన్నయ్య యీ పెళ్ళికి సుముఖం కాకపోతే_ ఒప్పుకోకపోతే_ ఆ మాత్రం అతన్ని కన్విన్స్ చేయగలిగితే_ ఈ పెళ్ళి ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. చిన్నన్నయ్య ఒప్పుకోందే పెళ్ళి జరగదు." వివరణగా తమ కుటుంబం పరిస్థితి చెప్పింది.
    వారుణి కొద్దిసేపు ఆలోచించింది.అలా ఆలోచనలో పడిపోయింది. పద్మ వుద్దేశ్యం ఆమెకి బాగా అవగతమై పోయింది.
    "ఇంతకీ యిప్పుడీ పెళ్ళిని ఆపుచేయించి నువ్వేం చేయాలనుకుంటున్నావ్?" ఆసక్తిగా అడిగింది వారుణి. ఆమెకి పద్మ మనస్సేమిటో పూర్తిగా తెలుసుకోవాలని వుంది.
    "నిజం చెప్పనా వదినా ?"
    "పద్మా! అలా ఎప్పుడూ అడగొద్దు. ఎప్పుడూ నిజమే చెప్పేందుకు ప్రయత్నం చెయ్. ఎప్పుడో ఏదో ప్రాణగండమో మానగండమో వస్తే తప్ప అబద్ధం చెప్పొద్దు. మనకి ప్రాణాంతకమైన సమస్యలంటూ ఎప్పుడూ రావు. అలాంటప్పుడు అబద్ధం చెప్పవలసిన అవసరమేముంది? పద్మా! మనలో చాలామంది వూరకే అబద్ధాలు ఆడిస్తూ వుంటారు. వాటికి ఒక వుద్దేశ్యం వుండదు. ఒక ధ్యేయం అంటూ కూడా వుండదు. ఊరకే చప్పున అబద్ధం ఆడేస్తారు. దానివలన ఎదుటివారి దృష్టిలో మనస్థాయి ఎంతగా దిగజారిపోతుందో ఊహించుకోలేరు."
    "సారీ వదినా! నేనలా అనుకోలేదు. మామూలుగా అనేశానంతే!" నొచ్చుకుంటున్నట్టుగా అంది పద్మ.
    "పోనీలే దాన్దేముంది? చాలామందికి మాట విలువ తెలీదు. ఒక అబద్ధం కానీ ఒక జారుడు మాట కానీ భవిష్యత్తులో ఎంత యిబ్బంది కలిగిస్తుందో వాళ్ళకి తెలియదు."
    నాకు చదువుకోవాలని వుందొదినా?" చప్పున తన మాటల్లోని అంతరార్థాన్ని మనస్సులోని ఊహని చెప్పేసింది.
    "ఎందుకని? డిగ్రీ పూర్తిచేసిన తర్వాతేం చేస్తావు?" పద్మ చదువులోని పరమార్థం ఏమిటో తెలుసుకోవాలన్నట్టుగా అడిగింది.
    "పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచెయ్యాలొదినా! స్త్రీకి యీ నాటి సమాజంలో ఒక డిగ్రీ, ఒక ఉద్యోగం వున్నంత భద్రత మరి దేన్లోనూ లేదు. ఎంత ఆస్తి వున్నా, ఎంత కట్నం తీసుకెళ్ళినా స్త్రీకి అత్తింట్లో కనీసం భర్త దృష్టిలో నయినా గౌరవం వుండదు" ఆవేశంగా అంది పద్మ.
    నిట్టూర్చింది వారుణి.
    పద్మ ఊహలు పదునెక్కుతున్నాయి. ఈ తరం యువతుల్లో వచ్చే యీ చైతన్యం యువకుల్లో రావటం లేదేమిటి? బయట ప్రపంచంలో వాక్పౌరుషాలు, వాగ్దానాలు పలికే మగధీరులు భార్య విషయం వచ్చేసరికి యిలా సంకుచిత భావాలకి లొంగిపోతున్నారేమిటి? అనుకుందామె.
    "నేనై నేను చదువుకుంటానంటే అమ్మ తిడుతుంది. నాన్న ఒప్పుకోరు. అన్నయ్యలూ నాన్నగారి మాటే రైటని వాదిస్తారు. అంగీకరిస్తారు. తను చదువుకుని ఉద్యోగం చేస్తోన్న అమ్మాయిని చేసుకున్న చిన్నన్నయ్య కూడా నా చదువుకి అభ్యంతరం చెప్పొచ్చు. చెబుతాడు కూడా. అందుకని నువ్వు అతన్ని కన్విన్స్ చెయ్యాలి" తన మనసులోని అసలైన ఊహని చెప్పింది పద్మ.
    వారుణి సమాధానం చెప్పలేదు. ఆమెలో ఆలోచన ప్రారంభమైంది. "తన మాట ఎంతవరకూ వింటాడో సారధి అది అనుమానమే. తను కొత్త కోడలు, తన సలహా తీసుకునే పాటి ఆలోచన మామగారికి రాకపోవచ్చు. ఇక అత్తగారికి, తోటి కోడలికి తనంటూ ఒకత్తి యింట్లో వున్నాననే గుర్తే లేదు_వుండదు. ఎలా పరిష్కరించాలి యీ సమస్యని?" ఆలోచించసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS