"చలం గారు...."
"చలంలో అద్భుతమైన భాషా విన్యాసముంది, శైలీ ప్రవాహముంది. కాని సమంజసమైన యితి వృత్తమేది? మనది కాని ఏ ప్రపంచంలోనో విహరిస్తూ, ఆ ఒరవడిలో కొట్టుకుపోతున్నట్లుంది. పాత్రలెక్కడ మనల్ని వెంటాడతాయి? సెక్సునీ, ప్రేమనూ విభజించలేకపోయాడు. అదో ఉప్పెన. ఆ వేగంలో కొట్టుకుపోవటం మినహాయించి నిజాన్ని బయటకు తీయలేం? అదలా ఉంచండి. మీపేరేమిటి?"
"సతి"
"ఆహా! ఎంత చక్కటి పేరు? ఆత్మీయతతో ఓదార్చే పేరు. ప్రియబాంధవితో ఆమెకు సుఖలత, శ్రీమతి అని పేర్లున్నట్లు గుర్తు. వాటికీ, మీ పేరుకూ ఏదో సామీప్యత ఉన్నట్లనిపిస్తోంది. ఇంకో చిత్రమేమంటే శ్రీమతి పాత్రకు ఇంతవరకూ నాకు సరైన రూపమందలేదు. మిమ్మల్ని చూశాక ఆ పాత్ర రూపురేఖలు నాలో ఆవిర్భవించాయి."
అతనంత సూటిగా మాట్లాడినందుకు నాకు కోపం రాలేదు. పొగిడినందుకు పొంగిపోనులేదు నవ్వి ఊరుకున్నాను.
"శ్రీమతి! ఆహా! అలాంటి స్త్రీని వెతుక్కోవటంలో జీవితమంతా గడిపెయ్యాలని ఉంటుంది. ఏమి పాత్ర అది! జహార్, సుఖలతల పట్ల మధ్య సన్నివేశాలు ఎంత హాయిగా మలిచాడు రచయిత. ఆమె కవసరమైనంతవరకూ కాపాడి, రక్షణ లభించిందన్న నమ్మకం దొరికాక, కనుమరుగైపోతూంటే, ఆరాటంతో వెదుకుతూ చివరకు అతన్ని కనుగొని చేయి పట్టుకుని ఆపినప్పుడు వగర్పునాపుకోటానికి ఆమె చేసే ప్రయత్నం కళ్ళలో కనిపించీ కనిపించకుండా చిమ్మిన నీరు.... ఆహా! ఎంత మనోహరం!"
నవల్లోని సన్నివేశం కళ్ళముందు మెదుల్తోంది.
నవలల్లో ఎన్నో పాత్రలుంటాయి. కాని వాటిని పాఠకుల కళ్ళముందు యధాతధంగా సాక్షాత్కరింప చేయటం అపూర్వమైన అనుభవం.
"స్త్రీని మన రచయితలు ఎందుకు సందర్శించలేకపోయి ఉంటారు?" అనడిగాను కుతూహలంగా.
"స్త్రీని వాళ్ళు కూడా మామూలు మనుషుల్లాగా అర్థం చేసుకోవటం వల్లనే. మన రచయితల్లో చాలామందికి రాసే శక్తి చేతులకు ఉంది కాని, మెదళ్ళలో సంకుచితత్వం పోలేదు. బహుశా మామూలు మనుషులకంటే కూడా ఎక్కువ బలహీనతలు ఈ రచయితల్లో ఉంటాయేమో. అన్ని బలహీనతలు వాళ్ళలో ఉంచుకుని స్త్రీని ఏ విధంగా సందర్శించగలరు? లేకపోతే మనలో పార్వతులు లేరా? సావిత్రులు లేరా? కిరణ్మయిలు లేరా? కమలలు లేరా? ఉన్నారు. కాని వెతికి పట్టుకోవటం చేతకావటం లేదు. సామాజిక స్పృహ అనే నిషాలో, ఉన్మాదంలో, ఆవేశంలో మనం చాలా నిజాలు పోగొట్టుకుంటున్నాం."
అతను చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తున్నాను.
కారు నెమ్మదిగా హాయిగా పోతూనే ఉంది. మనిషెంత మృదువుగా కనిపిస్తున్నాడో అతని డ్రైవింగ్ కూడా అంత మృదువుగా ఉంది.
"ఇంకో విశేషం చెప్పనా?" అన్నాడు.
ముఖం ప్రక్కకి త్రిప్పి అతనివంక ప్రశ్నార్థకంగా చూశాను. "ఈ నిజం చెబితే మన తెలుగు వాళ్ళు భరించలేక ఆవేశంతో భగ్గుమంటారు కాని.... మనం.... అంటే తెలుగువాళ్ళం చాలామంది కంటే.... సాహిత్యంలోనే కాదు, అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నాం. క్రీడలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్ధిక సంపత్తి.... ఎంతసేపు రుచులు, తినటం, చాడికోరుతనం, గతవైభవాన్ని గురించి ప్రగల్భాలు, ఆఫ్ కోర్స్ నిజం చెప్పాలంటే గత వైభవం కూడా అంత ఘనంగా ఏమీ లేదనుకోండి. టైమ్ అర్థం పర్థం లేకుండా వేస్ట్ చెయ్యటం, పనికిమాలిన ఎన్ జాయ్ మెంట్లూ, వాళ్ళంతా మిగతా, ఎవరితో ఎడ్జస్ట్ కాకపోవటం.... ఇవీ మన లక్షణాలు. మన తెలుగుతనం ప్రపంచానికి చాటిచెప్పిన ఒకే ఒక మొనగాడున్నాడు.... కొన్ని కొన్ని లోపాలున్నా...."
"ఎవరు?"
"పేరెందుకు లెండి?" అన్నారు నవ్వి.
ఇలా మాట్లాడుకుంటూ ఇంటి దగ్గర కొచ్చేశాం.
"ఆపండి" అన్నాను.
ఇంటిముందు కారాగింది.
బాల్కనిలో పేము కుర్చీలలో కూర్చుని సుకుమార్, సురేంద్ర మాట్లాడుకుంటూ ఉండటం కళ్ళబడింది. కారులోంచి బయటకు దిగాను.
"థ్యాంక్స్" అన్నాను.
"ఆహా! ఏమి సౌందర్యం!" అతని పెదవుల మధ్య నుంచి వినిపించీ వినిపించనట్లు వెలువడింది.
కారు వెళ్ళిపోయాక ఇంట్లోకి నడిచి, వాళ్ళవైపు చూడకుండా మా పోర్షన్ వైపు వెళ్ళిపోయాను.
అరగంట దాకా సుకుమార్ లోపలకు రాలేదు. అతని ముఖంలో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
"మదన్ మోహన్ నీకెలా పరిచయం?" అన్నాడు.
"రచయితగా ఎప్పట్నుంచో తెలుసు. వ్యక్తిగా ఇప్పుడే పరిచయమయింది."
"అతని రచనలంటే నీకిష్టమని తెలుసు."
"కొంచెం కాదు. చాలా ఇష్టం."
"కాని అతను వ్యక్తిగా చాలా అసహ్యమైన వాడు. అన్ని వ్యసనాలూ ఉన్నాయి. ఆడవాళ్ళ నాకర్షించటానికి అమాయకమైన కళ్ళు పెట్టి, మృదువుగా ప్రవర్తిస్తూ.... వెధవ్వేషాలు చాలా వేస్తుంటాడు."
"అలా అని సురేంద్ర చెప్పాడా?"
"అవును చెప్పాడు. సురేంద్రకు అతని గురించి చాలా తెలుసు."
"తెలిస్తే తెలిసి ఉండవచ్చు. అంత అర్జంటుగా నీకెందుకు చెప్పాల్సి వచ్చింది?"
"అతను నా శ్రేయోభిలాషి కాబట్టి."
శ్రేయోభిలాషి. బ్లాక్ మెయిలర్స్ ఉపయోగించే మాట.
"శ్రేయోభిలాషులెవరూ ఇలాంటి మాటలు చెప్పరు. ఇది ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్. ఈ బ్లాక్ మెయిలింగ్ తో మనదేశం దారుణంగా మ్రాగ్గిపోతూన్నది. సుకుమార్! చూడూ! భార్యాభర్తల మధ్య సంబంధం పవిత్రంగా ఉండాలి. ఒప్పుకుంటాను. ఈ పాయింటును సమర్థిస్తూ నీకు గంటల కొద్దీ ఉపన్యాసమివ్వగలను. కాని భార్యకూ భర్తకూ వ్యక్తిగతంగా వారి వారి అభిరుచులూ, ఆసక్తులూ ఉంటాయి. వాళ్ళిద్దరూ మొదట మనుషులు. తర్వాత భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యం అనే పేరుతో అసహ్యకరమైన స్వార్థం, భయంకరమైన అసూయ, ఒకరిమీద ఒకరికి అర్థం లేని డామినేషన్.... ఇది వివాహ బంధం అనిపించుకోదు. ఒకరినొకరు ఆరాధించుకోవటం మంచిదేగాని ఒకరి మనసుల్నొకరు దారుణంగా నలిపేసి, చంపెయ్యకూడదు. వారి స్వతంత్ర జీవితం ఆరోగ్యకరంగా ఉన్నంత వరకూ రెండోదారి ఇంటర్ ఫియరెన్సి దూకుడుగా ఉండకూడదు. అయితే ఇందులో అపశ్రృతులు దొర్లవా, శృతి మించితే ప్రమాదకరంగా పరిణమించవా అని నీ ప్రశ్న. తమకు ఇష్టంలేని పని రెండోవారు చేస్తూంటే బాధగా ఉంటుంది. భరించాలి. తప్పదు. జీవితమంటేనే భరించటం. మన చుట్టూ సంసారంలో, సమాజంలో ఎక్కువగా ఇష్టంలేనివే జరుగుతూ ఉంటాయి. అవన్నీ భరిస్తూ ఉండాలి.
