"మీ దయ!" చౌదరి మాటలకు శాంతంగా జవాబిచ్చాడు.
"మామా! చుట్టుపక్కల అన్ని వూళ్ళకు పోయి వచ్చినా! అంతటా అంగామే వుంది. అందరూ పనులు తొక్కిడితో వున్నారు. పైగా వీళ్ళుపోయి చెప్పినట్టుంది. పొరుగూరు కూలి రామంటున్నారు!" మెల్లిగా అన్నాడు శేఖర్.
"సోమూ!" కల్పించుకున్నాడు శేషయ్య.
"అయ్యాగారూ! మీరే చెప్పండి న్యాయం. మాకు గిట్టే కూలి అడిగితే అన్యాయమా? మీ కిష్టమైతే పిలుచుకోండి అంటే తప్పా!"
"సరే! సరే! వాదనలొద్దు. పనులు జరగాల ముందు! మీరడిగిన కూలీ యిస్తాం! రేపే పనులకి వస్తారా?"
సోముకి ఆశ్చర్యమనిపించింది. వాడికి వారు అంత త్వరగా దిగి వస్తారనిపించలేదు. "ఉ" అన్నాడు.
"సరే పొండి !"
కార్మిక విజయంగా భావించారు అందరూ. విప్పారిన ముఖాలతో యిళ్ళకి వెళ్ళారు!
నలుగురూ ముఖాలు గంటు పెట్టుకున్నారు !
"దీన్లో యింతకంటే చేసేదిలేదు. సమయం రానీయండి. పాతాళానికి తొక్కుదాం" అన్నాడు శేషయ్య.
ఎవరూ మాటాళ్ళేదు. అవమానంతో బరువెక్కిన మనస్సులతో యిళ్ళకి బయల్దేరారు.
25
దాదాపు రెండు నెలలు గడిచాయి. ఊరు వూరంతా పనుల తొక్కిడిలో మునిగిపోయింది. అందుకే రాజకీయాలు, కుట్రలు, కుచ్చితాలు కొంత మూలపడ్డాయి. నాయకులు అందరూ స్వంత పనుల్లో మునిగిపోయారు.
ఆ రోజు ఉదయం స్వామీజీగారి మకాంలో శిష్యులు అంతా గుమికూడారు. స్వామీజీ అందరికీ వేదాంత బోధా, ప్రసాదం పంచిపెట్టారు.
"స్వామీజీ! నాకు హఠాత్తుగా సన్యాసంపై మనసు పోతుంది. సన్యసించి మీతోపాటే వుండిపోదామా అనిపిస్తోంది" అన్నాడు చౌదరి.
ఫక్కున నవ్వేడు నాయుడు. "చవుదరీ నీకు సన్యాసంలోనే మజాకనిపిస్తుందా!" ఎదురుగా వున్న స్వామిగారి శిష్యురాలి వైపు చూస్తూ అన్నాడతను.
ఆమె విద్వన్మణి అని స్వామిగారి అంతరంగిక శిష్యురాలు. ఈ మధ్య ఆయనగారిని వెతుక్కుంటూ వచ్చింది. ఇన్నాళ్ళూ ఋషికేశ్ లో వుండి ధ్యానంలో శిక్షణపొంది వచ్చిందట.
చౌదరి మాటాళ్లేదు.
స్వామీజీవారు చిరునవ్వు నవ్వేరు." ఏదో శాస్త్రంలో వుంది. మా గురువుగారు సెలవిచ్చేవారు. సన్యాసంలో వుండి సారిసారికానందం, సంసార ఝుం ఝూటంలో వుండీ సన్యాస సుఖం కొందరను భవిస్తారట. అది మాలాటి యోగులకు, యిదిగో యిలాంటి శిష్యులకూ దక్కుతుంది."
స్వామీగారికి చౌదరి అంటే ప్రత్యేకమైన అభిమానం అని ప్రతి మాటలోనూ వెల్లడవుతూ వుంటుంది. చౌదరి కృతజ్ఞతా పూర్వకంగా చూశాడు.
"చవుదరీ! అంతగా నీ మనస్సు సన్యాసంవైపు మొగ్గుతూ వుంటే చెప్పు, సన్యాసం యిప్పిస్తాను. కాషాయ వస్త్రాలు కట్టుకున్నా అన్నీ మామూలుగా నెరవేర్చుకోవచ్చు. చిత్తం వక్రమార్గం పట్టకుండా, ఋజుమార్గంలో వెళ్ళటానికి ఉపయోగపడుతుంది."
"తమ ఆశీస్సు" క్లుప్తంగా అన్నాడు చౌదరి.
"ఇంకేం! భిక్ష పెట్టండి!" అంది విద్వన్మణి.
"అలా అయితే నీ నుండి సన్యాసం స్వీకరిస్తాడు చవుదరి. అతన్ని మనమార్గంలో పెట్టెయ్" గుంభనంగా అన్నాడు స్వామీజీ.
విద్వన్మణి మాయామేయంగా నవ్వింది. చవుదరి ఆ మాటలకి ఆ నవ్వుకి సిగ్గుపడ్డాడు.
అంతలో బయట పోలీస్ హారన్ వినిపించింది. స్వామీజీ వులిక్కిపడ్డాడు. ఆ విజలెన్స్ విజిలు గుర్తుతెలియని వీళ్ళు "ఏదో జీప్ వచ్చిందే!" అన్నారు.
