Previous Page Next Page 
రాగోదయం పేజి 53


    "అందరూ వస్తే ఏం చేస్తావ్?"
    "నలుగుర్నీ నిలేస్తే తప్పుకోలేరు ఎవ్వరూ. ఇప్పటిదాకా వాడి మీద వీడు, వీడిమీద వాడు చెప్పుకుంటా వచ్చారు కదా? ఇప్పుడిక ఏంచేస్తారు."
    "చూద్దాం"
    "చూడటం కాదు. ఒక్కొక్కడ్ని అడ్డంగా నరికేస్తా."
    "నాయుడూ ఆరంకెలు ఆపుచెయ్యి. ఇప్పుడు తగాదాలు వద్దు. మనకి పని జరగాల అది ముఖ్యం."
    "చౌదరీ!"
    "అవును. చౌదరి చెప్పింది నిజం. మనకు పనులు జరగాలి. ఆ తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం" అన్నాడు శేషయ్య.
    "అవునవును, ఇప్పుడు పేచీ పెట్టుకుంటే పనులు జరగవ్" అన్నాడు శేఖర్ కూడా.
    అంతలో ఒక్కొక్కరే రాసాగారు. జుట్టు పెద్దల్ని రమ్మంటే మొత్తం జట్టు వస్తున్నారు. ఆడవాళ్ళు తప్ప కూలీకి వెళ్ళే మొత్తం మొగవాళ్ళ చిన్నా పెద్దా అనకుండా వచ్చారు కొద్దిసేపట్లో.
    అసలు రారేమో అనుకున్న చౌదరికి అదొక విజయంగానే అనిపించింది. కానీ ఎన్నాళ్లు ముఖం చాటెయ్యటం. తాడో పేడో తేల్చుకుందామని వచ్చారు అందరూ.
    "ఏరా, మీ పనులన్నీ అయినాయా? ఇంకా మా పొలాల్లోకి వస్తారా?" చౌదరి అడిగాడు.
    అందరికంటే సోము ముందుకి వచ్చాడు "వస్తాం."
    "ఎప్పుడొస్తారు?"
    "రేపట్నుంచే వస్తాం రమ్మంటే."
    "సరే తలొక గుంపు రండి. అందరికీ పనులు జరగాల కద."
    "అట్లాగే !"
    వాళ్ళ మాట తీరు, ఆ సౌమ్యత వెంటనే ఒప్పేసుకోవటం అందరికీ ఆశ్చర్యంగానే వుంది. ఊరు వూరంతా తమకి భయపడిపోయిందనుకున్నారు, సంతోషించారు.
    "కూలి రేటు చెప్పండి."
    "చెప్పేదేవుందిరా? మామూలే కదా!" అన్నాడు నాయుడు.
    "ఉహు ఆ రెట్లు మాకు గిట్టవు. తిండి గింజలు, అన్ని ధరలు పెరిగినాయ్. అవసరాలు పెరిగినాయ్. మాకు రేటు పెంచాలి."
    "ఉహుఁ పెంచటానికి కాదు. అన్ని పెరిగినా ధాన్యం రేటు పెరిగిందా? మేం ఎరువులు రెట్లు పెరిగినాయని, ట్రాక్టర్లు బాడుగ పెరిగిందనీ ఛస్తంటే యింకా కూలి రేటు పెంచాల్నా. దానికంటే వ్యవసాయం మానుకుంటే మంచిది!" అరిచాడు చౌదరి.
    "అయితే మానుకోండి. అది మీ యిష్టం." నిర్లక్ష్యంగా అన్నాడు సోము.
    పుండుపై కారం చల్లినట్లయింది ఆ సమాధానం. అయినా వాడిని ఎవరూ తిట్టలేదు.
    "మేం వస్తాం మరి." జయన్న, సోము లేవగానే అంతా పొలోమన్నట్టుగా లేచారు.
    "కూర్చోండిరా! మేం పనులు మానుకుంటే మీకు గడిచేదెట్లా?" అడిగాడు రెడ్డి.
    "మాకోడి కుంపటి లేకపోతే తెల్లార్తదా? అనుకుందట ఓ ముసలమ్మ, అట్లుంది మీ మాట. ఏవో పనులు జేసుకు బతుకుతాం."
    "ఊరంతా మానేస్తేనో !"
    "ఎందుకు మానుకుంటారు. శానామంది నాట్లేస్తన్నారు కదా."
    "అయితే మావి మాత్రం వెయ్యరన్నమాట!"
    "ఎందుకెయ్యం? వాళ్ళిచ్చినట్టు కూలి యిస్తే ఎయ్యమన్నామా?"
    "ఎట్లిస్తన్నరు ?"
    చెప్పాడు సోము.
    "మామూలు కంటే రెండింతలా? అన్యాయం. దొంగలం_కొడుకుల్లారా ? అందరూ గుంపుకట్టి మమ్మల్ని ఆడిస్తారా? వద్దు పొండి. వేరే వూరు నుంచి కూలీలని పిలిపించి మీ ఆట కట్టిస్తాం! గంజినీళ్ళకు రాకుండా సస్తారు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS