వారుణి నిర్ఘాంతపోయి వింటోంది. ఆమెకి యిలాంటి విషయాలు వినటం క్రొత్త.
"కానీ అన్నయ్య నిన్ను ప్రేమించి,సివిల్ మేరేజ్ చేసుకుని ఆమె ఆశల్ని వమ్ము చేశాడు. బోల్డెంత కట్నం, కానుకలు వస్తాయనీ, దాన్లో సగం ఖర్చుచేసి నా పెళ్ళి ముగించెయ్యాలనీ ఆమె ఆలోచించేది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడన్నట్టు జరిగిపోయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ నా పెళ్లి విషయం ప్రస్తావన కొచ్చింది."
"నువ్వు మైనర్ వనీ, నీకు పెళ్ళి చేస్తే మైనర్ కి పెళ్ళి చేయటం చట్ట విరుద్ధమనీ, నేరమనీ వాళ్ళకి తెలీదా? అయినా యీ చట్టాలు, న్యాయ సూత్రాలు మనకి ఒక పట్టాన బోధపడవు. ఏది న్యాయమో_ చట్టసమ్మతమో జడ్జీలకే తెలుసు" నిరాశగా అంది వారుణి.
ఆ మాటలకి నిట్టూర్చింది పద్మ.
"వదినా! మగవాళ్ళు_ మనవాళ్లు అనుకుని మనం భ్రమించి ప్రేమించే యీ మగవాళ్ళు మనకి ఎన్నో అన్యాయాలు చేస్తారు. అవి రిపోర్టు చెయ్యబడవు. పోలీసుల పరిధిలోకి రావు. రిపోర్టు అందితే తప్ప "కేసు" పుట్టదు. ఇక శిక్షించే దెవ్వరు? వదినా ! నీకు తెలీని దేవుంది? సాంప్రదాయిక కుటుంబంలో తల్లిదండ్రుల దృష్టి ఎప్పుడూ కూతురికి ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసి అత్తారింటికి పంపించెయ్యాలా అనే వుంటుంది. అది కుదిరే దాకానే ఆడపిల్లలకి చదువు, సంగీతం, నాట్యం. మన చదువులకి ధ్యేయం లేదు. అవి గాప్ ఫిల్లర్స్ అంతే. కాలక్షేపం కోసమే అవన్నీను" అంది ఆవేశంగా.
పద్మలో కూడా శమీగతవహ్ని రగులుతోందనుకుంది వారుణి. "కానీ యీ దేశంలో ఎంతమంది అమ్మాయిలు నోరు విప్పగలుగుతున్నారు? నోరు తెరిచి అడిగినా మొండికెత్తినా, ఎదిరించినా ఫలితం ఏముంటుంది? తల్లి తండ్రీ బెదిరించో, తిట్టో, కొట్టో, ఆ "పిల్ల" నోరు నొక్కి, మెడ వంచి, తాళికట్టి పంపిస్తారు. అదో గురుతర బాధ్యతగా భావిస్తారు. అక్కడితో సమస్య తీరుతుందా? నిజానికి జీవితంలో సమస్యలు అక్కడి నుంచే కదా మొదలయ్యేది? కానీ అలా ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఆలోచించి పెళ్ళికి తగినంత ప్రాముఖ్యత యిస్తున్నారు?
"వదినా!"
ఉలికిపాటుతో ఆలోచనల నుంచి బయటపడింది.
"నాన్నగారు తనకి తెలిసిన సంబంధం ఏదో చూస్తున్నారట. ఆ అబ్బాయి బి.ఏ. తప్పి వూళ్ళోనే వుంటున్నాడట. వాళ్ళకి అనువంశికంగా గ్రామపెత్తనం, గ్రామాధికారం వుందట. వాళ్ళలో వాళ్ళ దాయాదులలోనే గ్రామాధికారులూ, సర్పంచీ వున్నారట. ఉమ్మడి కుటుంబం_అతనే పెద్దవాడు. ఉద్యోగం చెయ్యవలసిన "అగత్యం" లేదట. చెయ్యరట. బోలెడంత ఆస్తి, నగదు, పరపతి, బంగారం వున్నాయట. కట్నం బేరం కుదిరితే సంబంధం ఖాయం చేస్తారట. అన్నట్టు జాతకాలు కూడా సరిపోయాయట." పద్మ గబగబా పద్యం వల్లించినట్లుగా చెప్పింది.
"పద్మా ! ఇవన్నీ నీకెలా తెలిశాయి?"
"అమ్మ పెద్దన్నయ్యతో_వదినతో చెబుతూ వుంటే విన్నాను" కళ్ళు తళతళ మెరిపిస్తూ చెప్పింది పద్మ.
"ఎప్పుడు?"
"ఉదయం_బ్రేక్ ఫాస్ట్ అయ్యాక."
వారుణి మాటాళ్ళేదు.
"నువ్వొక్కదానివే నా మాట నెగ్గిస్తావని నమ్ముకున్నాను." అంతా ఆమెపైనే భారం మోపుతున్నట్టుగా అంది.
"ఎందుకు?"
"వదినా! నీలో పట్టుదల వుంది. ముందుచూపు వుంది. ఆలోచన వుంది. నీ మాటలని యితర్లకి చెప్పి వాళ్ళతో ఒప్పించగల కన్విన్సింగ్ శక్తి వుంది"
ఫక్కున నవ్వేసింది వారుణి.
"ఇది పొగడ్త కాదొదినా!" బేలగా అంది పద్మ. ఒకవేళ దీన్ని ముఖస్తుతిగా భావించి, తనని అపార్థం చేసుకుంటుందేమోనని భయపడింది పద్మ.
"ఛ!ఛ! అందుక్కాదు నేను నవ్వింది. నన్ను నువ్వు అర్థం చేసుకున్న మాత్రమైనా మీ "అన్న" నన్ను తెలుసుకుని వుంటే "మనం" యీ యింట్లో "సంస్కరణ" ప్రవేశపెట్టేవాళ్ళం కదా?" అంది వారుణి. ఆమె మాటల్లో నిరాశ ధ్వనించింది.
పద్మ నాలుక చివరిదాకా వచ్చిన మాటలని బలవంతంగా నిగ్రహించుకుంది. అన్నయ్య గురించి ఏం చెప్పినా వదిన రియాక్ట్ అవుతుందని తెలుసుకుంది.
