Previous Page Next Page 
నేను పేజి 53


    "ప్రియబాంధవి నవల ఉన్నదా" అన్నాను.


    "మద్దిపట్ల సూరిగారి అనువాదం కదూ. ఇంతవరకూ ఒక్క కాపీ ఉండాలమ్మ. ఇప్పుడే మదన్ మోహన్ గారు కొనేశారు."  


    "అయ్యో" అని నొచ్చుకుంటూ "ఏ మదన్ మోహన్ గారు?" అన్నాను.


    "ప్రఖ్యాత రచయిత మదన్ మోహన్ గారు. ఇదిగో ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇటే వస్తున్నారు కూడా."     


    ఆ మాట పూర్తి కాకుండానే ఒక వ్యక్తి మేము నిలబడి ఉన్న చోటుకు వచ్చాడు. ముప్ఫయి అయిదేళ్ళుంటాయి. తెల్లటి పైజామా, లాల్చి వేసుకొని చాలా హుందాగా, అందంగా ఉన్నాడు.       


    "ఏమిటి?" అన్నట్లు చూశాడు మదన్ మోహన్. తన గురించే మాట్లాడుకుంటున్నట్లు అర్థం చేసుకున్నాడు కాబోలు.


    "ఈమెగారు ప్రియబాంధవి పుస్తకం గురించి వచ్చారు. ఒక్కటే కాపీ ఉంటే మీరు తీసుకున్నారని చెబుతున్నాను" అన్నాడు.


    అతని చేతిలో ప్రియబాంధవి పుస్తకం ఉంది. "అరె మీరు ప్రియబాంధవి కోసమొచ్చారా?" అన్నాడు.


    "ఫర్వాలేదులెండి" అన్నాను మొహమాటపడుతూ.    


    "రాత్రి ఎందుకో ఆ నవల గుర్తొచ్చింది. మరోసారి చదువుదామని.... మీకా నవలంటే చాలా ఇష్టమా?"


    అవునన్నట్లు తలూపాను.


    "అయితే మీరిది తీస్కోండి."


    "ఒద్దండి మీరు కావాలని వచ్చి కొనుక్కున్నారు"


    "అయితే ఏమయింది? మీరూ కావాలనే వచ్చారుగా. నా ఇష్టానికన్నా ఇతరుల ఇష్టాన్నే గౌరవిస్తాను. ఆహా"      


    "ఆహా" అని అన్న సందర్భమేమిటో అర్థం కాలేదు గాని అతనలా అంటూంటే ఎంతో హాయనిపించింది.      


    నేను తటపటాయిస్తూ ఉండగానే చేతిలోని పుస్తకం నా చేతిలో పెట్టేశాడు.


    "దీని ఖరీదు" అని హ్యాండ్ బ్యాగ్ తెరవబోతున్నాను.


    నవ్వి "ఉంచండి. అంత గొప్ప నవలని ఓ గొప్ప స్త్రీకి బహుకరించటం కంటే ఆనందమేముంటుంది?" అంటూ బయటికెళ్ళి పోయాడు.    


    ఆ క్షణం....


    ఎంతో సంతోషం కలిగించింది.


    "థాంక్యూ" అంటూ కళ్ళలోకి చూశాను.


    కళ్ళూ కళ్ళూ కలుసుకున్నాయి.


    జవాబుగా హాయిగా నవ్వాను.


    ఏ వ్యక్తిని కలుసుకున్నప్పుడూ మనసులో అంత అలజడి కలగలేదు. ఎందుకో నిర్మలమైన సంతోషం పొంగి పొర్లుతోంది.


    బయటకొచ్చాక కొంతదూరం నడిచి, ఆటో కోసమెదురుచూస్తూ ఆగి, నిలబడ్డాను.


    రెండు నిమిషాలు గడిచాక ఫుట్ పాత్ ప్రక్కకు బిస్కెట్ కలర్ మారుతీకారు సుతారంగా వచ్చి ఆగింది. తలత్రిప్పి చూసేసరికి స్టీరింగ్ దగ్గర మదన్ మోహన్ కూర్చుని ఉన్నాడు.   


    "రండి మీ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు.


    "వొద్దండి. ఆటోలో వెళ్ళిపోతాను" అన్నాను మొహమాటంగా.    


    "ఫర్వాలేదు రండి."


    కాదనలేక చుట్టూ తిరిగి అటుకేసి వెళ్ళాను. ఈలోగా డోర్ తెరిచి ఒక చేతిని దానిమీద వేసి ఉంచాడు.


    లోపలకెక్కి కూచున్నాక, కారు కదిలింది.


    "చెప్పండి. ఎటు పోనివ్వమంటారు?"  


    చెప్పాను.


    "మీకు ప్రియబాంధవి అంటే అంత ఇష్టమా?"


    తల ఊపాను.


    "ఆహా. బావుంది."


    అతను ఆహా అనడం నాకెంతగానో నచ్చింది.


    "ఎందుకని?" అన్నాడు మళ్ళీ.


    "స్త్రీని బెంగాలీ రచయితలు సృష్టించినంత సుందరంగా ఏ ఇతర భాషలవాళ్ళు సృష్టించలేదు. బెంగాలీ స్త్రీ అంత గొప్పది కాబట్టి అలా జరిగిందా లేక ఆ రచయితలోని మహాదృష్టి అలా దర్శించగలిగిందా లేక అత్యుక్తా తెలీటం లేదు."    


    "అత్యుక్తి మాత్రమే ఉండదు. ఆ రచయితలు స్త్రీలోని ఔన్నత్యాన్ని అలా దర్శించగలిగి ఉంటారు."


    "మన రచయితలు ఎందుకు దర్శించలేకపోయి ఉంటారు? పోనీ ఈనాటి స్త్రీ సంగతి వొదిలెయ్యండి. మేమంతా మామూలు వాళ్ళమై ఉంటాం. కనీసం ఆనాటి రచయితలు, అప్పటి స్త్రీని"


    "నిజం చెబితే చాలామందికి, ముఖ్యంగా రచయితలకి కోపమొస్తుంది."


    "చెప్పండి."


    "మన రచయితలు.... నేను కవుల గురించి మాట్లాడటం లేదు. మన కవిత్వం చాలా అంశాల్లో ముందుకెళ్ళింది లెండి. కథలు కొంతవరకూ వెళ్ళి ఆగిపోయాయి. ఇప్పుడున్న కథారచయితలంతా పూర్వ వైభవాన్ని చాటుకుని భుజాలెగరేసే వాళ్ళే. లేకపోతే వెధవ కాంప్లెక్సితో మ్రగ్గిపోవటం."


    "మరి ఇంకెవరి గురించి చెబుతున్నారు?"


    "మన నవలా రచయితల గురించి, నవలా సాహిత్యం గురించి ఎంతసేపూ మాలపల్లి అనో, అసమర్థుని జీవనయాత్ర అనో పది పదిహేను పేర్లు చెప్పి భుజాలెగరెయ్యటం తప్పితే జీవితపు లోతుల్లోకి వెళ్ళలేక పోతున్నాం. కొంతమంది ఏదో ఒక ప్రాంతపు భాష నాశ్రయించి, ఆ యాసని ఆయుధంగా ప్రయోగించి, అదో సహజత్వంగా వెన్ను విరుచుకుంటున్నారు. మనం స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడక్కడా కొన్ని జీవిత సత్యాలను దర్పణం పట్టటం తప్పిస్తే. స్త్రీని, ఆ మాధుర్యపు విశాలత్వాన్ని సందర్శించలేకపోతున్నారు."  


    "స్త్రీ అంటే మాధుర్యమే అని ఎందుకనుకుంటారు? వ్యతిరేకత, అభావుకత్వం, కఠినత్వం.... ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి కదా."


    "అవన్నీ సరిగ్గా చూపాలి కదా"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS