Previous Page Next Page 
రాగోదయం పేజి 52


    నీతోబోధ విన్న జనార్ధన్ బుద్ధిగా తలూపేడు.


                                 *    *    *    


    రావణుడు మరణరహస్యం విభీషణుడు చెప్పకపోయినా రాముడు జయించి వుండేవాడు అనటం వైదికంగా రూఢి కావచ్చేమో, శల్యసారథ్యం లేకున్నా కర్ణుడు చచ్చేవాడే అనటం దైవవిధిగా నిజమే కావచ్చేమో కాని విభీషణుడు, శల్యుడు లాంటివాళ్ళు పనుల్ని సులువు చేస్తారనటంలో అబద్ధం లేదు. అలాంటి వాళ్ళు పురాణాల్లో, జానపదాల్లో, చారిత్రకాల్లోనే కాదు మామూలు నిత్యజీవితంలోనూ వుంటారు!
    కూలీలంతా ఎంత కట్టుబాటుగా వుండాలని నిర్ణయించుకున్నా వాళ్ళల్లో, ఆడవాళ్ళలోనో మగవాళ్ళలోనో ఎవరో రహస్యం బైట పెట్టేశారు.
    దాంతో నాయకుల కళ్ళు భగ్గుమన్నాయి. కడుపు మండింది. నలుగురూ ఒకటిగా అయి చర్చించుకోకముందే ఎవరి ప్రయత్నాలు వారే ప్రారంభించారు అవును. అది వాళ్ల వ్యక్తిగత విషయం కూడా కదా! పొలం పనులు సకాలంలో జరిగి, పైరు ఎదిగి చేతికొచ్చి పంట బాగా పండిన రోజుననే గదా వాళ్ళ ఆటలు సాగేది?
    అందుకే ఎవరంతకి వాళ్ళుగా కూలీ జట్టుని పిలిపించారు. అయితే ఆ జట్టు నాయకులు నలుగురూ గట్టిగా నిలబడ్డారు. తాము ఒప్పుకున్న పొలాలు వున్నాయని, తీరిక లేదని ఆపని పూర్తికాందే చెప్పలేమనీ అన్నారు. పని పూర్తయాక రమ్మంటే అంతదాకా ఆగితే నాట్లు వెనకవుతాయి. మరో జట్టుని అడగమని తప్పించుకున్నారు.
    నలుగురికీ నాలుగు జట్లు నాలుగేసి విధాలుగా సమాధానం చెప్పారు. ఇహ యిది సులువుగా అయ్యేట్టు లేదని నలుగురూ సమావేశమయ్యారు.
    చౌదరికి చాలా కసిగా వుంది. అతనికి అందరికంటే పొలం ఎక్కువ. అతని పొలం గ్రామానికి అన్ని దిశల్లో వుంది. తన ముళ్ళని ఆనుకున్న ఎకరం అరెకరం వాళ్లంతా నాట్లు వేస్తోంటే అతనికి కన్నెర్రగా వుంది.
    తర్వాత బాధ సర్పంచ్ ది. అతను మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడాలి. చౌదరికి వడ్డీ వ్యాపారం, కరణానికి కరిణీకం, రెడ్డికి మునసబుగిరీ వున్నాయి. అతనికీ ఆదాయం వస్తుంది. అయితే అది సకృత్తు ఎప్పుడో అదీ ఎన్ని నైవేద్యాల తర్వాతో!
    "చూస్తే వూళ్ళో అంతా గుంపైనట్టున్నారు. ఎవరూ మన మాట వినేట్టు లేరు."
    "ఎందుకంటావ్ చౌదరీ! మనమేం జేసినాం!"
    "నాయుడూ! మనవూరు మారిపోతోందోయ్! అందరూ తెలివి మీర్తన్నారు."
    శేషయ్య మాటలు అందర్నీ కదిలించాయ్!
    "తెలివిమీర్తే అణుస్తాం. ఒక్కొక్కడ్ని చింత బరికెలతో బాదుదాం."
    "ఎందర్ని బాత్తావ్?"
    "వరసబెట్టి తంతా! ఇంకా నీల్గితే తుపాకి పెట్టి కాలుస్తా!"
    "చౌదరీ! తగ్గు! తగ్గు! శేఖర్ వస్తున్నాడు. వాడిని కూడా అడుగుదాం."
    అంతలో శేఖర్ వచ్చాడు. దేవాలయం భూములు అన్నీ యితరులకి కౌలుకి యిచ్చినట్టుగా దాఖలు వున్నా ఎవరికీ యివ్వటం లేదు. వాళ్ళే తలాయింతని పంచుకుని అనుభవిస్తున్నారు.
    "నాటేస్తున్నావా?"
    "ఏమిటి మామా? ఎగతాళా? మొన్నటి నుంచి కూలీల కోసం తిరిగిన యిల్లు తిరక్కుండా తిరుగుతున్నా దొరకడం లేదు. ఏం చెయ్యాలో తెలియక తన్నక ఛస్తున్నా. దీనికి తోడు మా అన్న ఆరాటం."
    "మరేం! చేస్తాం వాళ్ళ రోజులొచ్చినాయ్?"
    "నువ్వూరుకో మామా! నేను సరిచేస్తా! రేయ్!" కేకేశాడు మునసబు ధర్మారెడ్డి.
    తలారి ఆ పిలుపుకి పరిగెత్తుకొచ్చినాడు.
    "నువ్వెళ్ళి నాట్లకు గుంపు కట్టినోళ్లుండ్లా వాళ్ళందర్నీ పిలచకరా! ఏ గుంపునూ యిడవొద్దు. అర్జంటని చెప్పు."
    పరుగు పరుగున వెళ్ళాడు వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS