"నో!నో! నా ముఖానికి లవ్ ఎఫెయిరేమిటి? ఇప్పుడు నా వయసెంత? నేనెంత? నాకు లవ్ ఎఫెయిర్స్ ఏమిటి? ఆ మాటంటే నాన్నగారు కాళ్ళు విరగ్గొడతారు తెలుసా?" సిగ్గుతో తలవంచుకుంది పద్మ.
"విరగ్గొట్టకపోతే ఫర్లేదన్నమాట!" నవ్వుతో చిలిపిగా అడిగింది వారుణి. ఆమె తానిప్పుడున్న టెన్షన్ లో పద్మతో మాటాడటం మానసికంగా వున్న ఆ టెన్షన్ క్రమక్రమంగా రిలీజ్ అవుతోన్నట్టుగా వుంది.
"పొండి వదినా! ప్రాబ్లమ్ అది కాదన్నానా! అసలు నాకు లవ్ కి స్పెల్లింగ్ కూడా తెలీదు. అయినా నా ముఖానికి లవ్వేమిటి?" అంది కనుబొమలు చిట్లిస్తూ. అయినా పెదాలపై చిరునవ్వు కదలాడింది, విషయం అలాంటిది మరి!
"ఏం? నీ ముఖానికేమయింది? లక్షణంగా వుంది. ఏ మగాడికంట పడ్డా వాడి గుండెల్లో గుబులు పుడుతుంది" పెదాలపై చిరునవ్వు కదలాడగా అంది వారుణి.
"నాకింకా పదిహేడేళ్ళే వదినా! నాటీవెన్ మేజర్. ఈ వయస్సుకే ప్రేమలేమిటి?"
"నువ్వీ మధ్య సినిమాలు చూళ్ళేదా? ప్రేమకథలన్నీ పద్దెనిమిదేళ్ళు నిండని వారిమధ్యే పుడుతున్నాయి. ప్రేమకి వయసుతో నిమిత్తం లేదని_మనవాళ్ళు యింకో అయిదేళ్ళకి పదేళ్ళ వయస్సున్న ఆడా మగా మధ్య ప్రేమని చూపించినా చూపిస్తారు. కానే వాళ్ళకి నిజంగా ఏ వయస్సులో ప్రేమ మనస్సులో పుడుతుందో తెలీదు" అంది వారుణి.
"నిజానికి ప్రేమకి వయస్సుతో నిమిత్తం ఏమిటి వదినా? కలసి మెలసి తిరిగితే పరిచయం ప్రేమగా మారుతుందేమో. అయినా ప్రేమ వివాహం చేసుకున్న నువ్వే లవ్ ఎఫైర్స్ ని అంటున్నావా?" సూటిగానే అడిగింది పద్మ.
ఆ మాటలకి వారుణి కొద్దిగా అప్సెట్ అయింది. పద్మ మరీ అంత సూటిగా అంటుందనుకోలేదు. అందుకని చప్పున "సారీ పద్మా" అంది.
"నో! నో! నథింగ్ టు సారీ. నేనూ మామూలుగా అన్నాను" అంది పద్మ. వారుణి అలా సారీ చెప్పేసరికి పద్మకి ఎలాగో అనిపించింది.
"పోన్లే_ ఇంతకీ నీ సమస్య ఏమిటట ?"
వారుణి ప్రశ్నకి పద్మ వెంటనే సమాధానం యివ్వలేదు. ఇద్దరి మధ్యా కొన్ని క్షణాలు నిశ్శబ్దంలో లయించి పోయాయి.
బయట ఆగి ఆగి వచ్చే చిరుగాలులకి కొబ్బరిమట్టలు చిరు చిరు సవ్వడులు చేస్తున్నాయి. గదిలో వుక్కగా వుంటే కిటికీ తలుపులు తీసింది వారుణి. పిలిచిన చుట్టం లాగా సయ్య్ మంటూ లోపలికి వచ్చింది గాలి. కోపంతో వేడెక్కిన మనిషి తర్వాత శాంతించినట్టుగా అంతదాకా బిగిసినట్టుగా వున్న వాతావరణం చల్లబడింది.
"పద్మా! మన బ్రతుకులు ఎప్పుడూ సమస్యల మయమే! మా నానమ్మ అనేది. ఆడపిల్ల పుట్టటమే సమస్యగా పుడుతుందని. మనం రెండు వందల ఏళ్ళు విదేశీ పాలనలో బతికాం. తర్వాత స్వాతంత్ర్యం వచ్చింది. మనల్ని మనం పాలించుకుంటున్నాం. నిజానికి అలా అనుకుంటున్నామనుకో.... అయినా అది రాజకీయంలే! మనకిప్పుడు దాని గొడవెందుకు?
కానీ విదేశీ నాగరికత, అలవాట్లు, అభిమానించి ఆదరించే మన పురుష పుంగవులు మాత్రం స్త్రీ విషయం ముఖ్యంగా భార్య, తల్లి, కూతురు విషయాలు వచ్చేసరికి అమాంతం సనాతనులైపోతారు. వేదాల్ని, ఉపనిషత్తుల్ని, పురాణాలని, చరిత్రని ఉటంకిస్తారు. దే వాంట్ ఎ ఫెయిత్ ఫుల్, ఒబీడియంట్ ఫాలోయర్, అంతే."
ఆ మాటలంటున్నప్పుడు వారుణి గొంతుక ఉద్వేగంతో వణికింది, కళ్ళు మిలమిల లాడేయి.
"వదినా నాన్నగారు నాకు సంబంధాలు చూస్తున్నారు_" అంది పద్మ తలొంచుకుంటూ.
"నీకు సంబంధాలు చూస్తున్నారా?" ఆశ్చర్యపోయి ప్రశ్నించింది వారుణి.
"అవును, సంబంధాలు చూస్తున్నారు. ఆ విషయంలో నాన్నగారి అభీష్టం కంటే అమ్మ పట్టుదలే ఎక్కువనుకో. కానీ యీ పెళ్ళికి అన్నయ్య వాళ్ళు కూడా తలూపుతున్నారు. నిజానికి నా పెళ్ళి సారధన్నయ్య పెళ్ళితోనే ముడిపెట్టాలని చూసింది అమ్మ..."
