Previous Page Next Page 
నేను పేజి 52


    రాను రానూ ఈ కుటుంబ వ్యవస్థ నాకు చిత్రంగా కనిపించసాగింది. ఒకరంటే ఒకరికి భయం ఉండవచ్చుగానీ మనసారా ఇచ్చే గౌరవం కనుమరుగయిపోయింది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అవసరానికే అగ్రతాంబూలం లభిస్తోంది. ఎవరి మనసు వారిది. ఎవరి అలవాట్లు వారివి. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి వ్యక్తిత్వాలు వారివి. ఒకరంటే ఒకరికి అభిమానం కన్న ద్వేషం ఆవరించి ఉంటుంది. వారిలో వారు ఒకర్నొకరు ఎందుకు ద్వేషించుకుంటారో నాకు చచ్చినా అర్థమయేది కాదు. ఒకరిమాట ఒకరు వినరు. ఒకర్నొకరు అర్థం చేసుకోటానికి ప్రయత్నించరు. వ్యతిరేకత ప్రదర్శించటంలో ఆనందం పొందుతారు. పెద్దలూ అంతే. వాళ్ళ అహాల్లో వారు మునిగి తేలుతూ ఉంటారు. వయసులో ఉన్నప్పటిలాగే వయసుడిగాక వాళ్ళమాట చెల్లాలని పట్టుదల, చెల్లకపోతే వాళ్ళకి అన్యాయం జరిగిపోతూందన్న తపన. మొత్తం ఎవరిలోనూ బ్యాలెన్స్   తో కూడిన ప్రవర్తన కనిపించదు. అహం. అహం మనిషిని కుదిపేస్తోంది. టీనేజ్ బాయస్, టీనేజ్ గరల్స్.... వాళ్ళ ధోరణి మరీ విడ్డూరంగా ఉంటుంది. అన్నీ వాళ్ళకే తెలుసుననుకుంటారు. ఇతరుల భావాలకు వ్యతిరేకత చూపటం వాళ్ళకు థ్రిల్. ఇదిలా ఉందా? మళ్ళీ సమాజం వరకూ వచ్చేసరికి పక్కవాళ్ళ బాధలు, కష్టాలు.... వాటిని గురించి అసలు పట్టించుకోరు. ఇతరుల బాధలు వాళ్లకు చీమ కుట్టినట్లు కూడా గుచ్చుకోవు. వీటిని గురించి ఇది వరకు చెప్పి ఉంటాను. అయినా మనసుని పదే పదే కుదిపేస్తోంది కాబట్టి అవకాశం మొచ్చినప్పుడల్లా చెప్పాల్సివస్తోంది. ఇంకా వాళ్ళలో వాళ్ళు ద్వేషించుకున్నా అవకాశమొస్తే నా పెళ్ళాం, నా పిల్లలు. వాళ్లకు నగలు చేయించటం, ఆస్తులు సమకూర్చటం, నాణ్యాలు సమకూర్చటం పిల్లలు కోతి వెధవలైనా వాళ్లకోసం అలమటించటం.... ఈ ద్వంద ప్రవృత్తితో మనుషులు మగ్గిపోతున్నారు. యిగో, స్వార్థం వ్యతిరేకం.... వీటితో, ఈ విపరీత భావాలతో కుటుంబ వ్యవస్థ మగ్గిపోతోంది.


    ప్రేమ.... ప్రేమ ఎక్కడుంది. మనషులు ఒకరినొకరు ఎక్కడ ప్రేమించుకుంటున్నారు.


    ఈ సంఘర్షణలో మనసు మంటలు విరజిమ్ముతుంది. ఒకరోజు ఉన్నట్లుండి నా భావాలు కాగితం మీద పెట్టాలనిపించింది. అలా ఎందుకు జరిగిందో తెలీదు. ఒంటరిగా కూర్చుని రాయటం మొదలు పెట్టాను.  


    రచయితలలో రకరకాల వాళ్లుంటారు. వాళ్ల తల్లిదండ్రులలోనో, ఇంకా ఇతర సన్నిహితులలోనో సాహిత్యాభిరుచి, ప్రవేశం ఉండి ఆ వాతావరణం వల్ల సాహిత్య పిపాస పెంపొంది రచయితలుగా మారినవాళ్ళు, జీవితంలో అనేక బాధలుపడి. చుట్టూ ఉన్న జీవితాన్ని చూసి పరితపించి ఆవేదనతో అలమటించి రచయితలుగా మారినవాళ్ళు, మొదటి ముప్ఫయి నలభయి ఏళ్లూ అసలు రాయాలన్న థ్యాసే లేకుండా, సహజాన్వేషణ శక్తివల్ల విపరీతంగా చదివి, జీవితంపట్ల ఓ అవగాహన ఏర్పరచుకుని, కొన్ని సిద్ధాంతాలకు లోబడి రచయితలుగా మారినవాళ్ళు, అమాయకమైన మనస్సుతో చిన్నతనం నుంచే కొన్ని ప్రకంపనలకు లోనై సహజసిద్ధంగా రచయితలుగా రూపొందినవాళ్ళు, విపరీతమైన మేదావులై ఉండి, పేరు పొందాలన్న కాంక్షతో రకరకాల ప్రక్రియలను సొంతం చేసుకుని రచయితలుగా తయారు చెయ్యబడ్డవారు....


    రాయటం మొదలు పెట్టాను. ఇది ఓ చిత్రమైన అనుభవం. నాలో ఉన్న మామూలు మనిషి కన్న ఎంతో ఎదుగుతూన్నట్లు అనిపించింది. ఈ ఎదుగుదల ఎక్కణ్ణుంచి వస్తోంది? మనిషి సహజంగా ఉన్నదాని కన్న ఉత్తరాల్లో ఎదుగుతాడు. అది కొంతవరకూ తెలుసు. సాహిత్యంలో ఇంకా ఎదుగుతాడా?


    రాయటంలో ఇంకో చిత్రమైన అనుభవం కూడా అనుభవిస్తున్నాను. మనసులో పొంగే భావాలను అదే వేగంతో కాగితం మీద ప్రవహింపచేస్తే. అందులో ఉద్రేకముంటోంది గాని చిత్తశుద్ధి కనబడటం లేదు. ఆ భావంలోని వేగం తగ్గించి పదును తగ్గకుండా చూసుకుంటూ నిగ్రహ శక్తి ప్రదర్శిస్తూ బాధను గాని, పదాలను కూడా వృధా చెయ్యకుండా అనవసరవాక్యాలు రాయకుండా ఒక్కో అక్షరం చెక్కినట్లుగా రాయాలి. వేగంగా, పరవళ్ళు త్రొక్కినట్లుగా రాసిన సాహిత్యం కన్నా అపారమైన నిగ్రహశక్తిని ప్రదర్శిస్తూ రాసిన సాహిత్యంలో స్థిరత్వ మెక్కువగా ఉంటుంది. ఛార్లెస్ డికెన్స్, అలగ్జాండర్ డ్యూమాన్, టాల్ స్టాయ్, గోర్కి, థామస్ హార్టీ, ఆస్కార్ వైల్డ్ ల సాహిత్యంలో ఈ లక్షణం ప్రస్ఫుటంగా కనబడుతుంది. షేక్ స్పియర్ సాహిత్యంలో కూడా ఈ లక్షణం పుష్కలంగా ఉంది.          


    ఓ పేజి రాయటానికి గంటకుపైగా పట్టింది బాధనిపించలేదు. నాకు నేను అర్థం కానివి అందులో చాలా ఉన్నాయనిపించింది.


    సుకుమార్ వచ్చాడు. "ఏమిటి రాస్తున్నావు?" అనడిగాడు.


    'నవల'


    అతని ముఖంలో రంగులు మారాయి. కొంచమాగి "నీలో చాలా సంఘర్షణ చెలరేగుతున్నదన్నమాట" అన్నాడు.     


    "సంఘర్షణలేని మనిషెలా ఉంటారు?"   


    "కాని నీలోని అశాంతిని నేను భరించలేను."


    "భరించక ఏం చేస్తావు?"


    "ఏడుస్తాను"


    నాకు నవ్వు రాలేదు.


    నా వళ్ళో తల పెట్టుకుని నడుం చుట్టూ చెయ్యేసి పడుకుని నిజంగానే ఏడుస్తున్నాడు. మనసారా ఏడుస్తున్నట్లు తెలుస్తుంది.    


    అతని తలమీద చెయ్యేసి జుట్టు నిమురుతున్నాను.


    "ఏడువు సుకుమార్. మనిషిలో బరువు పోగొట్టి తేలిగ్గా మారటానికి ఏడుపు అప్పుడప్పుడు అవసరం. మనసారా నవ్వటం, మనసారా ఏడవటం అందరికీ చేతకాదు.   


       
                                    21


    సురేంద్ర ఇంట్లో పార్టీలు జరగటం, సుకుమార్ వెళ్ళి డ్రింక్ తీసుకుని వస్తూ ఉండటం జరుగుతూనే ఉంది.      


    ఒకరోజు నా అభిమాన రచయిత మదన్ మోహన్ ని కలుసుకోవడం అనుకోకుండా జరిగింది.     


    ఆ రోజెందుకో ప్రభోద్ కుమార్ సన్యాల్ రాసిన ప్రియ బాంధవి చదవాలనిపించింది. ఇంట్లో ఎంత వెతికినా కనిపించలేదు. కొత్తది కొనుక్కుందామని బజారుకెళ్ళాను. అయిదారు బుక్ షాపులకెళితే దొరకలేదు. అన్నిటికన్నా పెద్ద షాపు ఒకటుంది. అందులో కెళ్లాను.     


    షాపు ఓనర్ కొంత అభిరుచి ఉన్న మనిషి. చాలా శ్రమపడి రకరకాల పుస్తకాలు తెప్పిస్తూ ఉంటారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS