ఒకటి రెండు మూడు రోజులు గడిస్తే అంతా కాళ్ళ బేరానికి వస్తారు. పొరుగూళ్ళలో వరి నూర్పిళ్ళు ముమ్మరంగా వున్నాయి. వాళ్ళెవరూ రారు. పైగా యీ నలుగురూ వెళ్ళి వాళ్ళ గుంపు పెద్దలతో చెప్పి వస్తారు.
మనం బాధకి ఓర్చుకోవాలి. ఒకటి రెండు రోజులు తిండికి జరక్కపోయినా దిగజారకూడదు. ముందుగా భార్గవమ్మ గారి పొలాలు, చిన్న చిన్న రైతుల పొలాలు నాట్లు వేద్దాం. ఆమె మనని ఆదుకుంటుంది."
ఉపన్యాసం లాగా విన్నా అంతా ప్రతిజ్ఞలు చేశారు. కట్టుబాటుగా వుంటామని చెప్పారు.
"కార్మిక విజయం తప్పదు."
జయన్న నినాదం అందరికీ ఉత్సాహాన్ని యిచ్చింది.
24
"అన్నయ్యా ! ఇదిగో డబ్బు."
మదరాసు నుంచి తిరిగొచ్చిన యిన్ని రోజులకి చౌదరికి ఎదురై డబ్బు యిచ్చాడు జనార్ధన్.
ఆ రోజు షేర్ కాపిటల్ తీసుకుని చెక్కేసింది లగాయితు తిరిగొచ్చి యిన్ని రోజులైనా చౌదరి తమ్ముడిని పలుకరించలేదు. అతని ఉనికినే విస్మరించినట్టుగా వుంటున్నాడు.
జనార్ధన్ కూడా తప్పుకుని తప్పుకునే తిరుగుతున్నాడు.
ఊళ్ళో జరిగిన సంఘటనలు కానీ, సోము వ్యవహారంలో కానీ జనార్ధన్ జోక్యం చేసుకోలేదు. రికామీగా కాకుండా పొలం అజమాయిషీలో పడ్డాడు.
పైగా లక్ష్మి ధర్మమా అంటూ జనార్ధన్ కి ఓ తోడు కూడా దొరికింది. క్లబ్బులో డాన్సు చేసే ఇరాని పిల్ల ఒకతె ఆ వూరుకి వచ్చింది. యీ మధ్య దాని చూపుల్లో చిక్కాడు జనార్ధన్.
ఇప్పుడిక వున్న వూళ్ళోనే వాడికి స్వర్గం కనిపిస్తోంది.
పైగా మాటి మాటికి పట్నం పారిపోవటం అంత సులువుగా వుండటంలేదు. దాంతో దొరికిందే రంభ. వున్న వూరే చెన్నపట్నం అనుకున్నాడు.
అన్నకి అనుకూలత, వదినకి ఆప్యాయత లేకపోతే తన పని ఖాళీ అనీ తెల్సు. బాగా వుంటే ఆస్థి అంతా తనదేననీ తెల్సు.
అందుకే యిప్పుడు పనుల సీజన్. కాబట్టి అన్నకి ఎర వేయాలని వచ్చాడు.
జనార్ధన్ యిచ్చిన డబ్బు అందుకుని లెక్కెట్టి ఆశ్చర్యంగా చూశాడు చౌదరి. దాదాపు ఆరువేల సొమ్ము అది.
"ఎక్కడిదిరా ఇది?"
తలొంచుకుని అన్నాడు. "అప్పుడు నే తీసికెళ్ళిన దాంతో డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. అందులో లాభించింది."
తలెగరేశాడు చౌదరి.
నిజానికి అది వాడికి ఆ వారంలో మట్కాలో వచ్చింది. ఉన్న వ్యసనాలకి తోడుగా వాడికి అది కూడా వుంది. మదరాసులో వున్నదంతా క్షారం చేసుకుని వచ్చాక ఖర్చులకని వదిన అచ్చమాంబ యిచ్చిన సొమ్ముతో టౌనుకు వెళ్ళి అలవాటు ప్రకారం ఓ నంబరుకు రాస్తే గుడ్డివాడి చేతిరాయి తగిలినట్టుగా వాటికి డబ్బొచ్చింది.
రెండు మూడు రోజులు జల్సా చేసి తిరిగొచ్చి అన్నయ్యకి ఎరగా యిచ్చాడది.
"ఊ! ఉద్ధరించావులే మనకు అవీ యివీ ఎందుకు? శుబ్బరంగా ఎగసాయం వుంది. వడ్డీ యాపారం వుంది. వాటిని చూసుకుంటే చాలు. పాడి పశువుల్లాగా నిత్య పంట యిస్తాయి. ఇక తిరుగుళ్ళు చాలించి యింటి పట్టున వుండు."
తలూపేడు జనార్ధన్. "నేనూ అదే అనుకుంటున్నాన్నయ్యా! ఇగెక్కడికి వెళ్ళను. మీరు చెప్పినట్టే వింటా. ఇంటి పట్టున వుంటా" నిగమశర్మ కంటే నీతిగా అన్నాడు.
"అలాగే! అంతకంటే సంతోషించేదేముంది? మంచి సంబంధం చూసి ముడిపెట్టేస్తాం!"
"నీ యిష్టం!"
"బయట నా మాటిను బాగుపడతావు. ఇంట్లో మీ వదిన మాటిను వృద్ధిలో కొస్తావు. మాదే వుంది. ఇదంతా నీదే. పాలు పితుక్కు తాగితే కడుపు రోజూ నిండుతుంది. పొదుగు కోసుకుంటే ఏముంది? రగతం, కడుపు కాల్తది."
