అయినా అతడు కుటుంబంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే అలా మాటాడక తప్పదనుకున్నాడు.
23
ఆ రోజు శిరీషకి ఉత్తరం రాయాలనుకుంది వారుణి. అప్పటి జాబుకి జవాబు కూడా రాయలేదిన్నాళ్ళూ. ఆ రాత్రి భార్యా భర్తల మధ్య ఆ సంభాషణ జరిగాక యీ పదిహేను రోజుల్లో ఏ సంఘటనా జరగలేదు. అంతా ముభావంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడెక్కడి వాళ్ళు ఓ శత్రు శిబిరంలో కలసి, ఒకర్నొకరు నమ్మలేకుండా వుండేట్టుగా వుంటున్నారు.
కలకీ, యిలలో జరిగే దానికీ అంత వ్యత్యాసం వుంటుంది అనుకుంది వారుణి. గైడ్ నవల మళ్ళీ ఒకసారి చదివింది. యీ మధ్య కాలంలో అప్పుడెప్పుడో ఇంటర్ లో వుండగా చదివింది పిక్చర్ చూసొచ్చాక, మళ్ళీ యీ పదిహేను రోజుల్లో "షెల్ఫ్"లో పుస్తకాలు తిరిగేస్తోంటే ఆ పుస్తకం కనిపించింది. మళ్ళీ చదవాలని కుతూహలంతో చదివింది. చదివాక "మగవారి మనస్తత్వం" అనుకుంది. ఆలోచనలన్నీ ఆ "పాత్ర" పైనే తిరుగుతున్నాయి.
"వదినా !"
పద్మ పిలుపుకి ఉలిక్కిపడ్డట్టయి "రా పద్మా!" అంటూ పిలిచింది. మంచంపై పడుకుని ఆలోచిస్తున్నదల్లా లేచి వాలుగా కూర్చుని తన పక్కనే కూర్చోమని ఆహ్వానించింది.
కానీ పద్మ కూర్చోలేదు.
దగ్గరలోనే వున్న కేన్ కుర్చీని లాక్కుని కూర్చుంది. వదిన్ని చూసి చిరునవ్వు నవ్వింది. పద్మ ఎటికసీని గుర్తించిన వారుణి ఆమె మనస్తత్వాన్ని మెచ్చుకుంది. ఆ మెప్పు ఆమె చూపుల్లో ప్రతిఫలించింది.
"నిన్ను డిస్టర్బ్ చేశానా?" పక్కనే వున్న ప్యాడ్ పెన్, కవర్ లని చూసి అడిగింది పద్మ.
"అదేం లేదు. మా చెల్లెలు శిరీషకి ఉత్తరం రాద్దామనుకుని, ఏదో ఆలోచనలో పడిపోయా" అంది.
పద్మ వారుణి వైపు చూసింది.
చెప్పనా వద్దా అన్నట్టు ధ్వనించాయి ఆ చూపులు. ప్రారంభించటానికి ముందు సందిగ్ధావస్థ అది.
"ఏమిటి? నవ్వుతో అడిగింది వారుణి.
"వదినా! పద్మ కంఠంలో ఉద్విగ్నత ఒక విధమైన వ్యధ వినిపించాయి. నాకు అమ్మకంటే, అన్నయ్యలకంటే, పెద్ద వదిన కన్నా నువ్వే ఎక్కువ అనికాదు కానీ ఎందుకో నువ్వు నాకు ఆత్మీయురాలివనిపించావు. నువ్వయితేనే నా సమస్యని అర్థం చేసుకుంటావనీ, తగిన సలహా యిస్తావనీ అనుకుంటున్నాను."
"థాంక్స్ ఫస్ట్!" ఆ మాటలకి నవ్వింది వారుణి. పద్మా! కొందరిని చూస్తే వూరకే ఎలర్జీగా ఫీలవుతాం. మరికొందరిని చూడగానే ప్రేమ పుడుతుంది. రెంటికీ ఆలోచిస్తే అర్థంలేదు. కారణమూ లేదు.జ్యోతిశాస్త్రజ్ఞులు గ్రహాలనీ, లగ్నాలనీ, స్నేహ బిందువులనీ ఏవో కారణాలు చెప్పొచ్చు. కానీ మనవ మేధకి అందని కారణమే అది. అది ఊహకి అందదు. ఆలోచనకీ అర్థమవదు. కానీ మనస్సుకి తెలుస్తుంది."
"వదినా నాకు నువ్వో సాయం చేయాలి!
"ఏమిటి? కాపర్సా? కాయిన్సా? నోట్సా? నవ్వింది వారుణి.
"డబ్బేం అక్కర్లేదు వదినా! నా పాకెట్ మనీకి, సినిమాలకి నాన్నగారు యిచ్చేస్తారు. ఫ్రెండ్స్ తో ఖర్చు చేసుకునేందుకు అన్నయ్యలిస్తారు. ఇప్పుడు నా ప్రాబ్లం డబ్బు కాదు."
"మరింకేమిటి?" కుతూహలంగా అడిగింది వారుణి. ఆమెకి పద్మ మాటాడే తీరు వింతగా వుంది. గుండెల్లో ఏదో గుబులు, మరేదో తీయని బాధ రగులుతూ వుంటే ముఖం మీద ఆ భావాలు ప్రకటితమవుతూ వుంటే పద్మ ముఖం వింతగా వుంది.
"వదినా! ప్రాబ్లమ్స్ ఎప్పుడూ డబ్బుతోనే ముడిపడి వుండవు" అని పద్మ...ఆమె ముఖం క్రమంగా ఎరుపెక్కుతోంది. తూర్పు సంధ్యలో సూర్యోదయానికి ముందుగా రాగ రంజితమయ్యే తరుణారుణ వర్ణంలా వుంది పద్మముఖం.
"దెన్ లవ్ ఎఫెయిర్! చిరునవ్వుతో అంది వారుణి. మనిషికి జీవితంలో సమస్యగా ఎదురయ్యేవి రెండే! ప్రేమ_జీవితం. జీవితంలో సమస్యలెప్పుడూ, ఎటు చూసినా ఎటు తిరిగినా అవి డబ్బుతోనే ముడిపడి వుంటాయి అన్నది యిప్పటి వారుణి అనుభవం. అందుకే ఆమె అలా అంది.
