Previous Page Next Page 
నేను పేజి 51


    విసురుగా వెళ్ళిపోతున్నాడు.


    "ఇంత పనికిమాలిన ఛాలెంజిలతో జీవితాన్ని వేస్ట్ చేసుకోకు."


    "అలాగే. అలాగే" అంటూ వెళ్ళిపోయాడు.


                               *    *    *


    స్త్రీలో సహజసిద్ధమైన గుట్టు ఉంటుంది. ఆ గుట్టును ప్రపంచం రకరకాల వ్యాఖ్యలతో కలుషితం చేస్తూ ఉంటుంది. అది సరికాదు. జీవితం మీదికి అపస్వరాలు విరుచుకుపడకుండా, జాగ్రత్త కోసం ఏర్పరచుకున్న గౌరవనీయమైన గుట్టు.  


    జరిగిందేమీ సుకుమార్ కు నేను చెప్పలేను. చెప్పటం వల్ల ప్రయోజనం ఉండకపోగా అనర్థకమె ఎక్కువగా ఉంటుందని తెలుసు.


    ఆ ఇంట్లోంచి మారి కూడా ఫలితం లేదు. నాలాంటి స్త్రీకి ఎక్కడకెళ్ళినా ఏదో సంఘటన వెన్నాడుతూ ఉంటుంది. ఆ సంగతి ముందే అర్థమైపోయింది. అక్కడే ఉండి అటో ఇటో తేల్చుకోవాలనుకున్నాను.


    పురుషుడికి ధన్యత ఎలా వస్తుంది? చేసే ఉద్యోగం వల్లనా? సంపాదించే డబ్బు వల్లనా? పెంచుకుంటూన్న పరపతి వల్లనా? కాదు. తనని తాను సంపూర్ణంగా సమర్పించుకున్న స్త్రీ వల్ల.     


    ఇక్కడ నేను ప్రేమ గురించి చెప్పటం లేదు. దాన్ని గురించి అర్థం కావటం చాలా కష్టం. సమర్పణ గురించి, శారీరకంగా కాదు మానసికంగా. పూర్తిగా.


    ఆ అదృష్టం సుకుమార్ కిచ్చాను. అందులో, ఆ వొరవడిలో ఆ, ప్రవాహంలో అతను రసానందంలో ఓలలాడుతున్నాడు.      


    అయితే కొంతమందే ఆ అదృష్టాన్ని నిలబెట్టుకుంటారు. కొంతమంది....


    ఓ రాత్రి.... పన్నెండు గంటల దాకా సురేంద్ర ఇంట్లో పార్టీ జరిగింది. సాధారణంగా సుకుమార్ అలాంటి సమయాల్లో అక్కడే గడుపుతాడు.


    సురేంద్ర ఇంట్లో సద్దుమణిగింది.


    నిద్ర వొస్తోంటే తలుపులు తీసే పడుకున్నాను.


    ఇంకా పూర్తిగా నిద్ర ఆవహించలేదు.


    తలుపులు తీసుకుని సుకుమార్ తూలుకుంటూ రావడం ఆ చీకట్లో కనిపించింది.


    అర్థమైంది. సుకుమార్ డ్రింక్ చేసి వచ్చాడు. నాకేం ఆశ్చర్యమూ, అసహజమూ అనిపించలేదు. అదేం గొప్ప విషయమా బ్రహ్మాండం బ్రద్ధలయేటంత అపరాధమూ కాదు. కాని సురేంద్ర కావాలంటే ఇతన్ని 'చెడ' గొట్టటానికి ప్రయత్నిస్తున్నాడన్న నిజం నా కర్థమైనంతగా అతనికి కాదు.


    కళ్ళు మూసుకుని పడుకున్నాను.


    దగ్గర కొచ్చి 'సతీ'! అని పిలిచాడు.


    నేను పలకలేదు.


    ఓ నిమిషం మౌనంగా నిలబడి తర్వాత మెల్లగా ప్రక్కనచేరి పడుకున్నాడు. కొంచంసేపు తనలో తాను ఆలోచించుకుంటూన్నట్లు కదలకుండా ఉన్నాడు. తర్వాత కొంత పిరికిగానే అతని చేతులు నా శరీరాన్ని స్పర్శించి.... తర్వాత పూర్తిగా నా ప్రక్కకు తిరిగి చెంపల మీద, పెదిమల మీదా ముద్దులు పెట్టుకోసాగాడు.


    అప్పటికి నేను కదలకుండా అలాగే పడుకున్నాను. నాలో ఏ స్పందనా కలగకపోగా, చాలా విముఖంగా ఉంది. అయినా నా విముఖత్వాన్ని ప్రదర్శించకుండా నిగ్రహించుకుంటున్నాను.     


    ముద్దులు పెట్టుకుంటూ 'సతీ! సతీ!' అని పిలుస్తున్నాడు.


    నేను పలకటం లేదు.


    అస్పష్టంగా ఉన్న అతని కోరిక తెలుస్తోంది. ఈ కోరిక ఎంత చిత్రమైంది! కొన్నిసార్లు బలీయంగా, కొన్నిసార్లు చాలా స్పష్టంగా, కొన్నిసార్లు అస్పష్టంగా ఉంటుంది. అయినా తీర్చుకోబడుతూ ఉంటుంది.       


    మెల్లగా నాపైకి జరిగి క్రమంగా ఆక్రమించుకుంటున్నాడు.    


    అప్పటికీ నేనేమీ వ్యతిరేకత చూపలేదు. శిలా విగ్రహంలా పడుకున్నాను. బహుశా భార్యాభర్తల మధ్య ఇలాంటి సన్నివేశాలెన్నో నిండి ఉంటాయి. నిస్సహాయంగా కాకపోవచ్చుగాని, నిస్తేజంగా.


    ఎన్నో పనుల్లో యాంత్రికత్వం తప్పనట్లే 'సంసారం'లో కూడా ఈ యాంత్రికత్వం తప్పలేదు.


    నా కళ్ళ నుంచి నీళ్లు కారలేదు.


                                                            20


    మర్నాడు నేను మామూలుగానే ఉన్నాను. అతనే తప్పు చేసినట్లు తడబడుతూ తిరిగాడు.


    నేనెంతకీ బయటపడకపోయేసరికి "సారీ సతి రాత్రి జరిగిందానికి" అన్నాడు.


    "ఏముంది అందులో సారీ చెప్పటానికి" అన్నాను.


    ఒక మనిషి గాడి తప్పాలేకాని, అందులోంచి తేలిగ్గా బయటపడలేడు. సుకుమార్ సురేంద్ర ఇంట్లో పార్టీలకు తరుచు వెళుతూనే ఉన్నాడు. త్రాగి వస్తూనే ఉన్నాడు. శమంతకమణి దగ్గర ఎన్నాళ్ళు పని చేసినా ఏ అలవాటుకి లోనుగాని అతను సురేంద్ర దగ్గరే లొంగిపోతున్నాడు. నా మీద కసితో సురేంద్ర అతన్నెక్కడికో లాక్కెడుతూన్నట్లు అర్థమయింది.   


    ఒక్కొక్కరోజు గడుస్తూన్న కొద్దీ నాలో అసహన మెక్కువవుతోంది. నా జీవితం ఈ దార్న నడవటం సరికాదేమో నన్న అనుమానం మొదలయింది. ఒకవేళ శమంతకమణి చెప్పింది నిజమేమో. నా జీవితం నిరర్థకం చేసుకుంటున్నానేమో. ఈ సంసారాన్ని అందులోని పవిత్రతనూ ప్రేమించటానికి ప్రయత్నించాను. అయినా విఫలురాల్నవుతున్నాను.     


    నాకెన్నో కుటుంబాలు పరిచయమవుతున్నాయి. సహజంగా పరిశీలనా శక్తి ఎక్కువవటం చేత చాలా నిశితంగా గమనిస్తున్నాను.                      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS