"మీ రదృష్టవంతులమ్మా. అయ్యగారి లాంటి దేవుడికి భార్య అయినారు.
నిట్టూర్చింది భార్గవి. "నేను అందుకు అదృష్టవంతురాలిని. అకస్మాత్తుగా ఆయన్ని పోగొట్టుకుని దురదృష్టవంతురాలినీ అయ్యాను" కన్నీరు తుడుచుకుంది.
"మీరే కాదమ్మా. మేమందరం కర్మజీవులం. ఆయనే వుంటే మా బతుకులిట్లా అయ్యేవి కావు."
తలూపింది భార్గవి.
ఆ పొలం పోయినాక మా అమ్మ చిక్కి సగమైంది.
"సోమన్నా, మీ అమ్మను ఓసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమను."
తలూపేడు వాడు.
"బంజరు భూములదేమైంది!"
"ఏమవుతుందమ్మా. మమ్మల్నే తిట్టినారు. అబద్ధమని రాసక పోయినారు. అయితేనేంలే. పట్టాలు వచ్చినట్లు ఒప్పుకున్నారు. పీడ పోయింది. నక్కల్లాగా పీక్కు తినేవాళ్ళు ఏటా."
"గుడ్డిలో మెల్ల. వరదొచ్చినా వండు పేరుకున్నట్టుగా ఆ మాత్రం మేలయినా జరిగిందిక."
లేచాడు సోము. "రేపు సోమవారం నుంచి నాట్లకు వారం చేస్తున్నాం అందరం. ముందుగా మన చేలు నాటుతారు. తర్వాత చిన్న చిన్న రైతులవి."
"మరి ?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది.
"మాకు రెట్టింపు కూలీ యిస్తేనే నాట్లు. లేకుంటే వాళ్ళే వేసుకోవాలి."
"బాగా బుద్ధి చెప్పండి. మీ బలం చూపించండి. దెబ్బకు దెబ్బ తీయండి."
"వదుల్తామా అమ్మగారూ." అతడి కళ్ళల్లో రక్తపు జీర.
"సరే! ఎక్కడా పొక్కకండి. ముందుగా తెలిస్తే వేరే ఏర్పాట్లు చేసుకుంటారు. ట్రాక్టర్లతో దమ్ము చేసుకున్నారు. సరే! నాట్లు వాటితో వెయ్యలేరుగా."
అనాదిగా దోపిడీలకు గురవుతున్న ఆ జాతికి చైతన్యం వచ్చింది. నిటారుగా తలెత్తింది. అది సోము రూపంలో వుంది.
* * *
జానయ్య విషయం ప్రబల ఉదాహరణ అయింది. వూళ్ళో ఎవరికయినా కడుపు తరుక్కుపోయే సంఘటన అది. దానికి కారణం తమ అశక్తత. నిస్సహాయత. ఆర్ధిక దౌర్భాగ్యం. సాంఘిక తేడా మాత్రమే గాక తమ నిరక్షరాస్యత కూడా కారణం అని తెలుసుకున్నారు.
అందరూ రాత్రి బడికి వచ్చేస్తున్నారు. "వూళ్ళో ఒక కట్టుబాటు వచ్చేసింది? ఎవరేం ప్రయత్నించినా కూలీలంతా ఒకటి. ఆసాములు అందరూ ఒకటి అనే భావన వచ్చింది వారిలో."
ఇప్పుడు వారి నాయకుడు సోము. వారి గురువు జయన్న.
ప్రతిదీ పాఠం చెప్పినట్లు, సినిమాలో వెండితెరపై చూపించినట్టు చెపుతాడు జయన్న.
"మనం కట్టుబాటుగా వుండాలి. మనం లేకపోతే వ్యవసాయం లేదు. ఎంతటి రైతు అయినా మనం బంద్ చేస్తే అతని పని ఖాళీ అవుతుంది. అలా అని మనం అన్యాయానికి దిగొద్దు.
న్యాయంగానే పోరాడదాం. కూలీ మన హక్కు. అన్నీ పెరిగిపోయాయి. మన కూలీ పెరగడం లేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళవి. మనం కాదనం. అయినా తనకి మాలిన ధర్మం వుందా.
ఒకడిని పాము కారుస్తూ వుంటే రక్షించాల్సిందేకాని అయ్యో పాపం అని మనం కరిపించుకుంటామా? అట్లా చేస్తే మనది బుద్ధి తక్కువే అవుతుంది.
మరో నాలుగు రోజుల్లో వరి నూర్పిళ్ళు మొదలవుతాయి. మనం మన రేటు అడుగుదాం. మనం అయిదారుగురు గుంపులుగా కట్టినాం. సోమన్న, జార్జి, దానియేలు, లక్ష్మన్న, మనవాళ్ళు.
శివయ్య వూళ్ళో గుంపు కట్టినాడు.
మనం నలుగురం ఒక మాట మీద వుంటే శివయ్య మనతోపాటే వస్తానన్నాడు. యీ యుగంలో గుంపుకి వున్న బలం దేనికీ లేదు, మనం గట్టిగా వుండాలి.
