Previous Page Next Page 
వారుణి పేజి 50


    చప్పున అతని ఎదపై చేయి వేసింది. తాత్కాలికంగా తన కోపాన్ని మరిచిపోయి అంది "రధీ_నాకు నువ్వెలా పిలిచినా సంతోషమే. నా గుండె నీ పలుకు వింటేనే స్పందిస్తుంది తెలుసా?" అంది ప్రేమగా.
    అతనేం స్పందించలేదు.
    "రధీ! నా మనస్తత్వం నీకు బాగా తెలుసు."
    "అవును బాగా తెలుసు" అన్నాడు వెక్కిరింపుగా.
    కానీ ఆమె ఆ వెక్కిరింతని లెక్కించలేదు. నిజంగా చెప్పాలంటే గుర్తించనట్టే ప్రవర్తించింది. అందుకే లాలనగా అంది. "రధీ! పోట్టాడ్డం నాకిష్టం లేదు. నేను నా సంసార జీవితం గురించి కొన్ని కళలు కన్నాను. కొన్ని ఆలోచనలు ఏర్పరచుకొన్నాను. కొన్ని నిర్ధారించుకున్నాను. మనం మనంగా వుండాలి. మన మధ్య ఎవరి ప్రసక్తీ రాకూడదు. మనమధ్య ఎవరూ రాకూడదు."
    ఆమె మాటలకి అట్టే ప్రాధాన్యత యివ్వనట్టుగా అన్నాడు. "వరూ, నాకు నిద్రొస్తోంది"
    "పడుకోండి! కానీ నేను నాలుగు గంటలుగా ఎంత టెన్షన్ లో వున్నానో తెలుసా? ఎక్కడికెళ్ళారో_ఏమో. ఎంత ఆలోచన పడ్డానో తెలుసా? దాని గురించి_"
    "ఎక్కడికి వెళితే ఏం? చెప్పి వెళ్ళాలా? పర్మిషన్ కావాలా? వరూ! మరీ అలా ఆలోచించకు! అలా నన్ను కట్టివెయ్యాలనుకుంటే_" అర్ధోక్తిలోనే ఆగేడు.
    ఆ మాటలకి ఆమె మనస్సు బాగా గాయపడింది. "చెప్పివెళితే తప్పా?" అని మెల్లిగా ప్రశ్నించింది. అతనంత మరీ నిర్ముఖమాటంగా అనటం ఆమెని వ్యధకు లోనుచేసింది.
    "ఆ అవసరం వుందా వరూ! నేను మగాడిని! నాకెన్నో పనులుంటాయి. ఇప్పుడే కాదు, ముందు ముందు కూడా యీ విధమైన గ్యారంటీ నా నుంచి ఆశించకు! అలా నన్ను బంధించాలని అనుకోకు_" అన్నాడు స్థిరంగా.
    మనస్సులో కోపం రగులుతోంది. పెదాలు కంపిస్తున్నాయి. కోపానలజ్వాలా మాల కీలలు శరీరాన్ని దహిస్తున్నాయి. అయినా వివేకం మనస్సుని ఆపుతోంది. "మగతనానికి అదో గుర్తా!" అంది.
    "అవును! ఎప్పుడూ సంజాయిషీ యిచ్చుకునే అవసరం రాకూడదు. నేను తప్పు చెయ్యను. అయాం కాన్ఫిడెంట్. ఇక నీకు వివరణ చెప్పుకునే అవసరం లేదు. నువ్వూ వూరకే యాగీ చెయ్యక, మనది ఉమ్మడి కుటుంబం మన కుటుంబాలకి కొన్ని నియమాలుంటాయి. కొన్ని హద్దులుంటాయి. కొన్ని ఆచారాలుంటాయి. వాటికి నువ్వు "ఎడ్జస్ట్ కావాలి." అన్నాడు.
    "ఇలా చెప్పటమూ మీ పతి హోదాకి గుర్తా?" మనస్సులోంచి తన్నుకొస్తోన్న కోపాన్ని, అభిమానాగ్నిని సాధ్యమైనంత అణుచుకుంటూ ఎదురుప్రశ్న వేసింది.
    ఒక్కక్షణం ఆగేడతను.
    "వరూ! నువ్వు ప్రతిదానికీ యిలా పెడర్ధాలు తియ్యొద్దు. మామూలు ఆడవాళ్ళు చేసినట్టుగా నువ్వూ యాగీ చెయ్యొద్దు. నువ్వు ఎమ్మే చదివావు. లెక్చరర్ వి. కాస్త ఆలోచించుకో. సుఖాలతోపాటే కొన్ని యిబ్బందులూ వస్తాయి. వాటికి మనం అలవాటు పడాలి. వాటిని మనం సీరియస్ గా తీసుకోకూడదు."
    వారుణి మాటాళ్ళేదు.
    "పైగా మనం ఆలోచించినట్టే అవతల వ్యక్తులూ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, కుటుంబ విషయాలని గురించి ఆలోచిస్తారు. అంతేకాదు. వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు. అనుభవజ్ఞులు. కొందరు నీకంటే ముందుగా యీ యింటికి వచ్చి నీలాగే ఆలోచించినవారు."
    ఆమెకి అతని మాటలు వింటుంటే కన్నీళ్ళొస్తున్నాయి. "ఈ చెప్పటం సున్నితంగా లాలించి చెప్పొచ్చు కదా! ఎలిమెంటరీ క్లాసులో మాష్టారు నీతిబోధలు చేసి చెప్పినట్టుగా చెప్పాలా. భార్యా భర్తల మధ్య యిలా ఒప్పందాలు కుదుర్చుకోవాలా? హే భగవాన్!" ఏమిటీ పరీక్ష?" ఆమె ఆలోచనలు వేగంగా పరిగెడుతున్నాయి. అతన్ని గురించి ఆలోచించటానికి మనస్సు వేగిరి పడుతున్నది.
    సారధి వారుణి వైపు చూళ్ళేదు.
    అతను కావాలనే అలా మాటాడేడు.
    తన మనస్సుని మభ్యపెట్టుకుని అలా మాటాడేడు. అతనికి తన మాటలు ఆమె మనస్సుని ఎంతగా గాయపరుస్తాయో, ఆమె ఎంతగా బాధపడుతుందో బాగా తెలుసు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS