Previous Page Next Page 
నేను పేజి 50


    "అవును. ఊహిస్తున్నావు. నువ్వు చాలా తెలివైనదానివి. నీకన్నీ ముందుగా తెలుస్తూ ఉంటాయి." ఆవేశంతో అరుస్తూన్నట్టు అని కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు!    


    "చూడూ! ఊర్మిళను నేను ప్రేమించాను. ఆమె కోసం సర్వప్రపంచాన్నీ త్యజించాను. తనే.... తనే.... తనే.... నా సర్వస్వమనుకున్నాను. కాని ఆమె నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది."


    "మోసం అని మీరనుకుంటూన్నది ఓ కాన్సెప్ట్ కావచ్చు."


    "కావచ్చు. కాని నేనలా అనుకుంటూ ఉండవచ్చు. కాని ఈ ఒంటరితనం నేను భరించలేకుండా ఉన్నాను అది పోగొట్టుకోటానికి ఎన్నోదార్లు వెదికాను. ప్రయోజనం లేకపోయింది. మొదటిసారి సుకుమార్ తో వచ్చినపుడు నిన్ను చూసి స్టన్ అయిపోయాను. అసలు నీలాంటి స్త్రీ భూమ్మీద ఉంటుందని నాకు తెలీదు. వందమంది ఊర్మిళలు కలసి నువ్వు ఆవిర్భవించావా అనిపించింది. కాని ఆ సుకుమార్ నా ప్రాణస్నేహితుడు. లేకపోతే ఆ రోజే నిన్నెగరేసుకుని వెళ్ళిపోయేవాడ్ని.         


    "నీతో ఎగిరి రావటానికి నేను సిద్ధంగా ఉన్నట్లు."


    "బలవంతంగానైనా ఆ పని చేసేవాడ్ని."


    "దానివల్ల నువ్వు సాధించేదేమిటి?"


    "చాలా ఉంది. ఏమీ ఉండకపోవచ్చు కూడా. ఓ రాక్షసుడిలా అడ్డుతగుల్దామనుకున్నాను. కాని నీకు నేను అర్థం కాకుండానే మామూలుగానే ప్రవర్తించాను. అంతా అయిపోయింది."


    "అంతా అయిపోయిందనుకున్నాక దాన్ని గురించి ఆలోచన దేనికి?"


    "నిన్ను పోగొట్టుకున్నాక రోజురోజుకీ నా మనోవ్యధ పెరిగిపోతోంది. నీ ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోతున్నాను."    


    "ఇంతకూ నీకేం కావాలి?"


    "నువ్వు కావాలి"


    "ఒక ప్రక్క సుకుమార్ నీ ప్రాణ స్నేహితుడని చెప్పుకుంటూ నాతో ఇంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు వెయ్యటం లేదూ?"    


    "లేదు. ప్రాణస్నేహితుని భార్యను ప్రేమించటంలో గొప్ప ఆనందముందని తెలుసుకుంటున్నాను."     


    "అబ్బ! మనిషి, మనస్తత్వం ఎంత భయంకరం! ఏ మేధావీ, ఏ సైకియాట్రిస్టూ దాన్ని సంపూర్ణంగా మధించలేక పోతున్నాడేం?"      


    ఒక స్త్రీ, పురుషుడూ వారి తాలూకు భర్త గాని భార్య గానీ దగ్గర లేకుండా మాట్లాడుకుంటూన్నప్పుడు ఇలాంటి సంభాషణ చోటు చేసుకుంటూ ఉంటుంది. కాని చాలావరకూ పరోక్షంగా, డొంకతిరుగుడుగా, రంగులు పులుముకుని ఎప్పుడో సమయం, సందర్భం చూసుకుని హఠాత్తుగా బయటపడుతుంది. వీలు కుదరకపోతే రోజుల తరబడి, అలా శాశ్వతంగా ఉండిపోతుంది.    


    ఉపోద్ఘాతం లేకుండా నిరంకుశంగా ఇలా విరుచుకుపడటం అవతలి వ్యక్తిలోని పాశవికత్వాన్ని, అహంకారాన్ని, మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తాయి.     


    "చిత్రమేమంటే జీవితంలో అసాధారణమైన మనుషులు సామాన్యులకే తారసపడుతూ ఉంటారు."    


    "ఏజ్ యిఫ్ సుకుమార్ సామాన్యుడూ, నువ్వు అసమాన్యుడూ అయినట్లు."


    దానికతను సూటిగా జవాబు చెప్పలేదు. అటూ ఇటూ పచార్లు చెయ్యటం నా దగ్గరకొచ్చి.... ముఖంలోకి చూస్తూ "నువ్వు నాకు కావాలి. తెలిసిందా?" అన్నాడు.


    "ఏం చేసుకుంటావు నన్ను"


    "జుర్రుకుంటాను"


    "అంటే నీతో అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న మాట!"


    "పెట్టుకో. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం అక్రమసంబంధాలతోనే అట్టుడికిపోతోంది. ఎందుకు? ఉన్న సంబంధంతో వాళ్ళకు న్యాయం జరక్కపోవటం వల్ల. తమకు కావాల్సిన జీవితాన్ని వెదుక్కోవాలన్న పిపాస. ఆ సహజమైన అందాల మందిరంలో ఇరుక్కున్న వారికది హేతుబద్ధంగా కనపడుతుంది. బయటివారికి రంకుగా కనబడుతుంది. ఈ గొడవంతా ఎందుకంటావా? రా. ఇక్కణ్ణుంచి వెళ్ళిపోదాం. ఓ అద్భుత ప్రపంచంలోకి నిన్ను తీసికెళ్ళిపోతాను. మళ్ళీ ఈ ఛాయల క్కూడా రావొద్దు."       


    అతని చొరవకు ఆశ్చర్యపడుతూ మౌనంగా ఉండిపోయాను.


    "ఏమిటాలోచిస్తున్నావు?"


    "నువ్వు తీసుకెడతానన్న అద్భుత, మనోహర ప్రపంచమెలా ఉంటుందా అని."


    "అదీ.... అది.... అనుభవంలోనే తెలుస్తుంది. మాటలతో వర్ణించలేం."


    అనుకోని దీర్ఘాలోచనలలో మునిగి, ఉన్నానేమో, అతని చేతులు నా భుజాల మీద పడటాన్ని గమనించలేదు. "సతీ! ఐ లవ్ యూ" ఈ మాటలు చెవులకు దగ్గరగా వినిపించి పెదాల మీద స్పర్శ తెలిసేసరికి ఉలికిపడి ఓ త్రోపు తోశాను. బ్యాలెన్సు తప్పినట్లయి వెనక్కి తూలి క్రింద పడబోయి నిలద్రొక్కుకున్నాడు.      


    "సురేంద్రా! ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఈ చెత్త కబుర్లతో విసిగించకు."


    "నువ్వు నన్నవమానిస్తున్నావు."


    "అవమానమనేది నీ ఒక్కడికే సొంతమైనట్లు, ఫర్వాలేదులే. అరిచి గీపెట్టి కేకలు వెయ్యటం, చెంప దెబ్బలు కొట్టటం నా దృష్టిలో సంస్కారం కాదు. అందుకే కామ్ గా వెళ్ళిపోమంటున్నాను."


    "అబ్బో! అంత పతివ్రతవా నువ్వు?"


    "పతివ్రతనని చెప్పుకోవటం లేదు. అసలామాట కర్థం కూడా నాకు తెలీదు. ఒకవేళ నాకిష్టమైతే ఏ మగాడితోనైనా గడుపుతానేమో, ఇంత పెద్ద విశాలమైన జీవితంలో అలాంటి సంఘటనలు జరగకుండా ఉండవని అనుకోవటం లేదు."


    "నువ్వు చాలా అహంకారివి."


    "కావొచ్చు. ఆ మాత్రం అహంకారం ఉండటం అవసరమే."


    "ఏ మన్నావు ఇందాక? ఇష్టమైతే ఏమన్నా చేస్తావా? నీ ఇష్టానికి వ్యతిరేకంగా నిన్నెలా వాడుకుంటానో చూడు."                           


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS