Previous Page Next Page 
రాగోదయం పేజి 49


    "అయినా నాకు తెలీకడుగుతా? ఆ చంద్రమ్మ మీద నీకెందుకంత యామోహం."
    చౌదరి జవాబివ్వలే. అతని ముక్కు పుటాలు విశాలమయ్యాయి. లక్ష్మి రెట్టించనూ లేదు.
    "ఇదో మరో వారం రోజులకి యింటికి వచ్చి ఇంజను మళ్ళీ బిగించమను. కొత్త రంగెయ్యమను తిరిగ యీడ దెచ్చి బిగించమను."
    తలూపింది లక్ష్మి.
    లేచాడు చౌదరి.
    "మళ్లీ దర్శనం ఎప్పుడో."
    "నీ దయ వున్నప్పుడు"
    "చెంగున లేడి పిల్లలా ఎగిరి చౌదరిని మంచం మీదికి లాక్కెళ్ళింది లక్ష్మి. చౌదరికి కామ సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినట్టుగా వుంది."


                                                             23


    సొంత పొలం చౌదరి సొమ్ము కావటంతో సోముకి తీరిక చిక్కినట్లయింది. మెట్ట వ్యవసాయం ఎంత? అదెప్పుడో పూర్తయింది. వర్షాలు పడ్డాయి బాగా. నాట్లు చకచకా కన్నెపిల్లల్లా ఎదిగి వస్తున్నాయి. దృష్టి సోకని పిల్లవాడు ఎదిగొచ్చినట్లుగా రోజు రోజుకి మారాకులు వేస్తున్నాయి.
    మాగాణి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వూర్లో దమ్ము చేయటం దాదాపు పూర్తవుతుంది. రేపో మాపో నాట్లు మొదలవుతాయి! భార్గవి పొలం పనులు పూర్తిగా సోము స్వీకరించాడు. వాడికి పని కల్పించుకోడానికి బాధ తీర్చుకోటానికి ఆమె పొలమే ఆధారమైంది. పైగా ఆమె అవ్యాజమైన ప్రేమ ఆత్మీయత, అరమరికలు లేని ఆప్యాయతా, స్వచ్చమైన ఆదరణా వాడికి మనుషుల్లో నమ్మకాన్ని కల్గిస్తున్నాయి.
    "ఇంత శ్రమిస్తే నేనిచ్చిన వేయీ తీరిపోయి నేనే నీకు బాకీ అవుతాను. ఒక్క వేరు పంటలోనే అంతా తీరిపోతుంది." అంది నవ్వుతూ భార్గవి.
    వాడికి ఆమెని చూస్తే కనకమహాలక్ష్మిని చూసినట్టుగా వుంటుంది. చేతులెత్తి మొక్కుతాడు.
    "అయినా యిలా ఎంత చేస్తే ఆ చౌదరి చేసిన అన్యాయం తీరుతుంది. అబ్బబ్బ! తలచుకుంటే గుండె చెరువవుతుంది. ఈ వూళ్ళో న్యాయం వుందా? ధర్మం వుందా? అంతా ఒకటయ్యారు. వాళ్ళు ఏది చెబితే అది న్యాయం. ఏది మాటాడితే అది ధర్మం."
    పళ్ళు కొరికాడు సోము. "అమ్మగారూ! ఏనాడో ఓనాడు అవకాశం వస్తుంది. ఆనక నన్ను ఉరితీసినా సరే! ఆనాడు నా పగ తీర్చుకుంటా! వాడు మా అమ్మని తిట్టాడు."
    "దుర్మార్గుడు పురుగులు పడిపోతాడు."
    వాడేం మాట్లాడలేదు.
    "సోమూ! ఒక చిన్న పొరపాటు ఎంత నష్టం తెచ్చిందో చూడు. ఈ బ్రతుకు ఒక పద్మవ్యూహం. దీంట్లో ఏమారితే హతం! అంతే!"
    "ఆ రోజు పాడునిద్ర వచ్చిందమ్మా! జయన్న పాఠం చెపుతున్నాడు. వింటూ పడుకున్నా.సుబ్బన్న చెప్పిందీ నేనవునన్నదీ అంతా మర్చిపోయినా! నిద్రపోయినా, తెల్లగా  తెల్లారాక యములాడి బంటులా వచ్చినాడు తలారి."
    నిట్టూర్చింది "చెబితే నీవు వినవు కానీ ఆ రోజు నా వద్దకి వచ్చివుంటే ఆ డబ్బు నేనే యిచ్చేదాన్ని. అంత మునిగేదాకా నాకీ విషయమే తెలియదు. మా తమ్ముడు ఒట్టి బడుద్ధాయి!
    "చిదానందం గారూ! అటు రాలేదమ్మా. చెరుకు తోట వైపు వెళ్ళారు."
    "సోమూ! చౌదరి పాపం పండుతుంది."
    "పడుతుందంటారా అమ్మగారూ!"
    "మీ అయ్యగారు అనేవారు రావణుడు, దుర్యోధనుడు, హిరణ్యకస్యపుడు పాలించినపుడు కష్టపడ్డవాళ్ళు పుట్టబోయే విష్ణువును తలుచుకుని సేదదీరేవారట. మనమూ అంతే."
    "విష్ణుమూర్తి రావద్దటమ్మా!"
    "అట్లా నిరాశపడకూడదు. రాత్రి ఎంత దీర్ఘమయినా తెల్లారక తప్పదు. అమావాశ్య తర్వాత పున్నమి రాకపోదు అనేవారు మీ అయ్యగారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS