ఆ పూట భోజనాల సమయంలో ఎవరిమట్టుకి వాళ్ళు బిగదీసినట్టుగా వుండిపోయారు. కబుర్లు చెప్పే నారాయణ కూడా మౌనంగా భోజనం చేశాడు.
నిజానికి వారుణికి ఆ పూట భోజనం అసలు సహించలేదు. అత్త, భర్తల సంభాషణ ఆమె మనస్సుని యింకా పాడుచేసింది. అందుకే ఎలాగో భోజనం అయిందనిపించింది.
22
దాదాపు ఒంటిగంట !
రాత్రి పదిగంటలనించీ సారధి కోసం తమగదిలో వేచి కాచుక్కూర్చుంది వారుణి. భోజనం కాగానే నాన్నగారితో నాలుగు కబుర్లు చెప్పి, ఆ రోజు డెయిలీలో రాజకీయాలపై కామెంట్ చేసివస్తాడు సారధి.
ఈ రోజు కూడా అతనలాగే వస్తాడని ఎదురుచూసింది వారుణి. కానీ ఆమెకి నిరాశే ఎదురయింది.
అతని రాక ఆలస్యం అయ్యేకొద్దీ ఆమెలో ఆరాటం పెరుగుతోంది. హైప్రెషర్ వున్న వ్యక్తికి ఆవేశంలో బి.పి. పెరిగినట్టుగా ఆమెలో టెన్షన్ పెరిగిపోతోంది.
ఆమె ఎంతగా ఎదురుచూసినా దాదాపు రెండింటికి కానీ సారధి రాలేదు.
రాగానే చొక్కా విప్పి హేంగర్ కి తగిలించి, లుంగీ చుట్టుకుని పడుకున్నాడు. అతని ముఖంలో నరాలు బిగుసుకున్నట్టుగా వుంది. ఏం మాటాళ్ళేదు అతను. గుండెలో ఎంతో దిగులు, ఎంతో కోపం, ఆవేశం వున్నట్టుగా వున్నాడు.
వారుణి మనస్సు లావాలా కుతకుత ఉడికిపోతున్నది. అతని తీరు, ఆ నిర్లక్ష్యం ఆమె కోపాగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. అతన్నే నిశితంగా చూడసాగిందామె. చివరికి నిగ్రహించుకోలేకపోయి అడిగింది.
"రధీ! ఇంతదాకా ఎక్కడికి వెళ్ళావు ?"
"సినిమాకి వెళ్ళాను."
"సినిమాకా? నన్ను పిలవలేదేం?"
"లేదు." ముక్తసరిగా అన్నాడు.
"ఎందుకు వెళ్ళేవు ?"
"అదేమిటి? సినిమాకెందుకు వెళతారు? చూట్టానికి, ఆనందించటానికి. ఆమాత్రం తెలీదా?" ఎద్దేవగా అన్నాడు సారధి.
"తెలుసు" తనూ వ్యంగ్యంగానే అంది. "కానీ నన్నూ తోడు తీసుకెళితే ఏమయ్యేది" అని అడిగింది మళ్ళీ.
అతను జవాబివ్వలేదు.
"నువ్వు మారిపోతున్నావు రధీ-"
"వరూ!" గొంతులో కాఠిన్యం తొంగి చూడకుండా జాగ్రత్తపడుతూ పిలిచాడు.
ఆ పిలుపుకి ఆమె ఆశ్చర్యపోయింది.
ఆ పిలుపులోని కొత్తదనం ఆమె గుండెల్లో చేమంతులని పూయించింది.
అతనదేం పట్టనట్టుగా వారుణి పొందిన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని గుర్తించనట్టుగా అన్నాడు. వరూ! ఈ దేశంలో ప్రతి భార్యా సామాన్యంగా అనే మాటే అది. దానికో అర్థం లేదు. ప్రయోజనం లేదు. ఊరకే ఎందుకలా సాధిస్తావు?
మీ పరిచయ పరిధి వేరు.
మా జీవిత పరిధి వేరు.
మేం మీలాగా జీవించలేం. మీరూ మాలా బ్రతకలేరు. సృష్టిలో స్త్రీ పురుష మనస్తత్వాలలోనే యీ తేడాలున్నాయి. అది గమనించుకోలేదు మీరు. ప్రతి ఆడదీ మగాడిని తన పరిధిలోకే లాక్కోవాలని చూస్తుంది.
తన మాట వినాలనీ, తనతోనే జీవించాలనీ తన భర్త జీవితమంతా తనకే పరిమితం కావాలనీ అనుకుంటుంది. అఫ్ కోర్స్. అదంతా ప్రేమతోటే కావచ్చు. కాదనను. కానీ తను మాత్రమే అతని లైఫ్ కాదని గుర్తుంచుకోరు_తెలుసుకోరు. ట్రాటజీ_ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నమూ చెయ్యరు"
వారుణి శాంతంగా వింది. ఒక్కక్షణమాగి "క్లాప్స్ కొట్టమంటారా?" అంది. మళ్ళీ వెంటనే "ఈ రోజు కొత్తగా పిలిచారేమిటి?" అని అడిగింది.
"ఏమో! ఆ పిలుపు నాకు చాలా నచ్చింది. నిన్నెవరూ అలా పిలవరా? నీకిష్టం లేదా?" అన్నాడు కామ్ గా.
