"కాని...."
"సుకుమార్. మనం చేసే పనిని ఎన్ జాయ్ చెయ్యటంలో ఎంత థ్రిల్ ఉందో తెలుసా? పక్కమీద పడుకోటాన్ని, పడుకుని చేసే రకరకాల కార్యకలాపాల్నీ ఎన్ జాయ్ చేస్తాం. కాని పక్క ఎంత గలీజుగా ఉంటుందో పట్టించుకోం. చేసే పనిని ప్రేమించటం మొదలు పెడితే దాన్ని ఎలా ఎన్ జాయ్ చెయ్యగలమో తెలుసా? అన్నం తినటాన్ని మనం ఎన్ జాయ్ చేస్తూన్నప్పుడు అన్నం వండటాన్ని కూడా ఎన్ జాయ్ చెయ్యగలగాలి. "వెధవ చాకిరీ, వెట్టిచాకిరీ, ఈయన గారికి పిండాకూడు వండలేక చస్తున్నా.... ఇలా అనుకుంటూ పని చేస్తూంటే అందులో దరిద్రమే తాండవిస్తుంది. ఆఖరికి ఈ కూరలు తరగటం...."
నా మాట పూర్తి కాకుండానే నన్ను వెనకనుంచి కౌగిలించుకుని ముందుకు వొంగి ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అతనలా హఠాత్తుగా చెయ్యటంతో వేళ్ళు అదుపు తప్పి కత్తి గుచ్చుకుని, చూపుడు వ్రేలులోంచి రక్తం చుక్కలు చుక్కలుగా కారింది.
"అయ్యో.!" అన్నాడు బాధగా. "ఎంత పొరపాటు చేశాను" అంటూ. క్లీన్ చేస్తాను అన్నాడు.
"అఖ్కర్లేదు" అంటూ వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి వాష్ చేసుకొచ్చాను.
కొంతసేపటికి రక్తస్రావమాగిపోయింది.
"నొప్పిగా ఉందా?"
"లేదు"అన్నాను చిరునవ్వుతో.
"కత్తి కోసుకుంటే నొప్పి లేకుండా ఎలా ఉంటుంది?"
"సుకుమార్. ఒక చిత్రం చెప్పనా? ఈ నొప్పిని కూడా శాసించగలిగే శక్తి మనిషికుంది. అది కష్టమైందేం కాదు. కొంచెం అభ్యాసం. నొప్పిని మనం ప్రేమించగలిగితే దాన్ని కూడా ఎన్ జాయ్ చెయ్యగలం.
"నువ్వు చాలా ఆశ్చర్యకరమైన వ్యక్తివి."
"కావచ్చు" అని నవ్వి ఊరుకున్నాను.
"సతీ! నీకో సంగతి చెప్పాలనుకుంటున్నాను."
"చెప్పు."
అతను కొంచెం తటపటాయిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది. చివరకు "సురేంద్ర ఇంట్లో వంటవాడు మానేశాడు. అతను హోటల్నుంచి క్యారియర్ తెప్పించుకోటమో, హోటలుకెళ్ళి తినిరావటమో చేస్తున్నాడు. అతనికి ఇక్కడ్నుంచీ...."
"వొద్దు" అన్నాను.
"ఎందుకని?"
"అతను మనకుపకారం చేశాడు నిజమే. అందుకు కృతఙ్ఞతలు మనసులో ఉంచుకుందాం. నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి."
బాధ పడినట్టున్నారు. "నీ ఇష్టం" అని బయటికెళ్ళిపోయాను.
* * *
రోజులు గడిచిపోతున్నాయి. సురేంద్ర ఇంట్లో వారానికి రెండు మూడు సార్లు పార్టీలూ వగైరాలు జరుగుతూనే ఉండేవి. ఆధునిక మానవుడు నాగరికత ముసుగులో ఈ పార్టీలనే ప్రలోభంతో మునిగి తెల్తున్నాడు. సుకుమార్ కూడా ఎటెండయ్యేవాడు. కాని అతనెప్పుడూ డ్రింక్ చేసినట్లనిపించలేదు. ఒకవేళ చేసినా నేను పట్టించుకునే దాన్ని కాదు.
సురేంద్ర ఏదో విధంగా సందర్భం కల్పించుకుని నాతో మాట్లాడుతూ ఉండేవాడు. సుకుమార్ ఉన్న సమయంలోనూ లేని సమయంలోనూ కూడా ఇంటి కొస్తూండేవాడు. అతని ప్రవర్తన చాలా సభ్యతగానే ఉండేది.
ఓ రోజు మధ్యాహ్నం మంచం మీద పడుకుని నిద్రపోతున్నాను. అలికిడయితే కళ్ళు విప్పి చూశాను. సురేంద్ర లోపలికి వస్తున్నాడు.
'సారీ డిస్టర్బ్ చేశాననుకుంటాను" అన్నాడు.
"నిద్రపోతూంటే లేపటం డిస్టర్ బెన్సే కదా" అన్నాను నవ్వి.
"అయితే వెళ్ళిపోతాను" అన్నాడు.
"ఫర్వాలేదు. కూచోండీ."
మంచానికి కొంచెం దగ్గర్లో ఉన్న కుర్చీలో కూచున్నాడు.
ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి.
ఒక్క క్షణం. అంతలోనే తల ప్రక్కకి త్రిప్పేసుకున్నాను.
"మనం కొంతవరకూ క్లోజ్ గా వచ్చామనుకుంటున్నాను. చాలా చనువిచ్చాను కూడా. కాని నా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ అడగరేం?"
"దగ్గర దగ్గరగా కలిసి ఉంటున్నప్పుడు అనుకోకుండా క్లోజ్ గా వస్తాం. మగాడు స్త్రీ కెప్పుడూ చనువివ్వటానికే ప్రయత్నిస్తాడు. అందులో ఆశ్చర్యం లేదు. కాని.... మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా లేదు."
"ఎందుకని?"
"ఇతరుల సొంత విషయాల్లో, దూరటం నాకు మొదట్నించే అలవాటు లేదు కాబట్టి."
"కాని.... నేనీ వంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నా గోడు వినే తోడు కావాలనిపిస్తోంది."
"వొంటరితనం పోగొట్టుకోటానికి విధి విరామం లేకుండా త్రాగుతూనే ఉన్నారుగా. ఇహ తోడు కావాలంటే చాలామంది స్నేహితులు వస్తూనే ఉన్నారుగా."
"త్రాగుడు వల్ల నా వొంటరితనం పోవటం లేదు. వచ్చే స్నేహితుల్లో ఎవరి దగ్గరా తోడు లభించటం లేదు."
"వెతకండి. కనీసం ఓ స్త్రీ దగ్గరయినా...."
"ఆ స్త్రీవి నువ్వే అయితే."
అతని దగ్గర్నుంచి ఇలాంటి జవాబొస్తుందని తెలుసు. అందుకని ఆశ్చర్యపడలేదు.
"ఏదో ఓ సందర్భంలో మనిద్దరి మధ్యా ఇలాంటి సంభాషణ వస్తుందని ఊహిస్తున్నాను."
