Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 4

 

    "లేదు వదినా -- నేనలా మాట యివ్వలేను = లేనిపోని ఆశలు మీకు కల్పించటం ఎందుకు? అ తరవాత రుక్మిణి అన్న మాట నిలబెట్టుకోలేక పోయింది అని మీ చేత అనిపించుకోటం ఎందుకు? ఉమని చేసుకోటానికయితే అబ్బాయి కెలాంటి అభ్యంతరమూ లేదు. మీరూ ఆలోచించుకోండి -- అయితే నేను ఒక్కటి మాత్రం చెప్పగలను- సురేఖ పెళ్ళి అయేదాకా ఉమా పెళ్ళి చేసెయ్యమని మిమ్మల్ని తొందర పెట్టను." అందావిడ పెద్ద ఉపకారం చేస్తున్న దానిలా.
    'ఎంత ఔదార్యం కనబరుస్తోంది అత్తయ్య' అనుకుంది సురేఖ కసిగా. అత్తయ్య యిన్నాళ్ళూ తనపై చూపించినదంతా పైపై అభిమానమేననీ, కోడలిగా ఎన్నిక చేసుకోవలసిన సమయం వచ్చేసరికి ఆవిడ మోజు తన మీద కాస్తయినా లేకపోయిందనీ గ్రహించుకొన్న ఆ పిల్ల హృదయం మూగగా ఎంత కన్నీరు ఒడ్చిందో ఆ భగవంతుడికి ఒక్కడితే తెలుసు -- అంతటి బాధలోనూ అశాంతి లోనూ చిన్న ఆశా కిరణం , ఏదో భ్రమ మినుకు మినుకు మంటూ ఆమె అంత రంగంలో ఓ మూల నిలిచిపోయింది. 'అత్తయ్య కి ఆడపిల్లలు లేరు. వాళ్ళ ఆశలూ ఆలోచనలు ఎలా సాగుతాయో , సరదాగా ఆనందంగా సాగిపోతున్న జీవితంలో ఎంత చిన్న దెబ్బ తగిలినా ఆ పసి హృదయాలు ఎంత చిన్న బుచ్చు కుంటాయో ఆవిడకి అర్ధం కాదు-- కాని అమ్మా నాన్నగారూ అలా మాట యివ్వలేరు' అనే ఆశతో చెవులు రిక్కించుకొని కూర్చున్న సురేఖ కి తండ్రి మరేమీ వాద ప్రతివాదాలు చెయ్యకుండా, సంతోషంగా సంతృప్తిగా 'సరేలే-- ఒకటి కలిసి వచ్చినా వచ్చినట్టే -- సురేఖ కి పై సంబంధమే చూస్తాను. రెండు పెళ్ళిళ్ళూ ఒక్కసారే చేస్తే కాస్తా ఖర్చు కలిసి వస్తుంది' అనడం-
    "అదీ నిజమే లెండి' అంటూ తల్లి వంత పాడటంతో సురేఖ మనస్సు పాతాళానికి కృంగి పోయినట్లయింది.
    ఛ, ఎలాగయినా అమ్మా వాళ్ళకి ఉమ అంటేనే అభిమానం ఎక్కువ అనుకుంది ఉడుకు మోత్తనంగా - చిన్నతనం నుండీ తనకి జరిగిన అన్యాయాలూ తల్లీ తండ్రి ఉమని ఎక్కువ చేసి తనని చులకన చేసిన సందర్భాలు గుర్తుకు రావడం మొదలు పెట్టాయి -- అందులోనూ ముఖ్యంగా ఓ సారి తన పుట్టిన రోజు పండగ నాటి సంఘటన తానెప్పుడూ మరిచిపోలేదు --  
    అప్పటికి వర్ధనమ్మ గారికి పూర్వకాలపు చాదస్తం ఇంకా పూర్తిగా వదల్లేదు -- బట్టల షాపుకి వెళ్ళటం కావలసిన చీరలూ అవీ ఏరుకోవటం ఆవిడ కేమిటో చచ్చే మొహమాటం గా వుండేది. అవసరం వచ్చినప్పుడు దుకాణానికి కబురు పంపిస్తే వాళ్ళే ఇన్ని చీరలు జాకెట్టు బట్టలూ అవీ మూట కట్టి కుర్రాడి చేత పంపించేవారు.
    సురేఖ కి ఉమకి వయస్సు లో తేడా మహా వుంటే రెండున్నర సంవత్సరాలు, సురేఖ చీరలు కట్టుకోటం ప్రారంభించే సరికి ఉమా ఓణీలు వేసుకోటం మొదలు పెట్టింది. కాస్త మంచి చీర, కంటికి నదురుగా కనిపించింది సురేఖ ఏరుకునే సరికి ఉమ కూడా అదే కావాలని కూర్చునేది -- అవేళా అల్లాగే జరిగింది.
    "ఇప్పట్నుంచీ చీరలెందుకు నీకు -- నువ్వు కట్టుకునేసరికి ఇంకా మంచి రకాలు వస్తాయి. ఇది నేనే తీసుకుంటాను.' అంటూ చెల్లెలితో తగూకి దిగింది సురేఖ.
    'ఇంతకన్న మంచి చీరలు నాకేం అక్కర్లేదు ఇదే కావాలి- ఎప్పుడైనా సరదా కి కట్టుకుంటాను- నువ్వు మరోటి తీసుకో' అంటూ ఆ కాశ్మీరు సిల్కు చీర ఒడిలో పెట్టుకు కూర్చుంది ఉమ.
    'పని లేకపోతె సరి ఇప్పుడు నీకు చీరెందుకు' అంటూ అప్పుడప్పుడు చిన్న కూతుర్ని మందలించే వర్ధనమ్మ గారు కూడా ఆ వేళ.
    'పోన్లే సరదా పడుతోంది -- తీసుకొని-- నువ్వింకేదయినా -- ఎంచుకో -' అంటూ సురేఖ కే నచ్చ చెప్పబోయింది.
    "అసలు నాకేమీ అక్కర్లేదు ' అంటూ కోపగించుకుని లేచి వెళ్ళిపోయింది సురేఖ.
    'అచ్చంగా అలాంటి ప్రింటుదే మరో చీర షాపులో కూడా లేద' ని ఆ అబ్బాయి చెప్పటం వల్ల ఆవిడ తనకి నచ్చిన చీరేదో తీసుకుని మిగిలినవి షాపుకి పంపించేసింది.
    పుట్టినరోజు నాడు మూతి ముడుచుకుని కూర్చున్న మనవరాలిని బ్రతిమాలి ఎలాగో తలంటి నీళ్ళు పోసుకునేలా చేసింది కామాక్షమ్మ గారు - ఆ తరువాత ఎవరు చెప్పినా సురేఖ తన పట్టు విడవలేదు. తల్లి కొన్న కొత్త చీర కట్టుకోలేదు. ముసిలావిడ ప్రాణం వూసురుమానిపించి.
    'పోనీ, పెద్దది , సరదా పడింది -- దాన్నే తీసుకోనివ్వకపోయావా?" అనటం, దాంతో ఉమ భోరుమని ఏడుస్తూ,
    నాకేం అక్కర్లేదు ఇంతోటి చీర -- దాన్నే తీసుకోమనండి,' అంటూ పెట్టి తెరిచి చీర బైట గిరవాటు పెట్టటం అంతా ఓ గొడవ అయింది- ఆ రాద్దాంతం అంతా విని అసలు సంగతి ఏమిటి అని అడిగి తెలుసుకున్న రమణమూర్తి గారు,
    "నీకు బోలెడు చీరలున్నాయిగా, చెల్లెలు సరదా పడి తీసుకుంటే ఇంత గొడవ చెయ్యాలా -- 'అయినా ఉమ పచ్చగా వుంటుంది కనక ఆ రంగు, ప్రింటు దాని వంటికి బాగుంటుంది -- నీకు అమ్మ తీసిన లేత రంగు చీరే బాగుటుంది.' అంటూ తననే మందలించటంతో సురేఖ కి పుట్టెడు దుఃఖం ముంచుకు వచ్చింది.
    'నువ్వు అందంగా వుండవు -- నీ మొహానికి ఈ చీర చాల్లే' అని ఈసడించి పారేసినట్లే అనిపించింది ఆ పిల్ల ప్రాణానికి. అందంగా ఆకర్షణీయంగా వుండే సంతానం అంటే తలిదండ్రులకి ప్రేమాభిమానాలు ఒపాలు ఎక్కువగానే వుంటాయి అనిపించింది.'
    అదంతా తలుచుకుంటూ ఆలోచిస్తూ పడుకున్న సురేఖ కి అంత దిగులు లోనూ కాస్త ఓదార్పు కలిగినట్లయింది. 'పోనీలే -- ఇదీ మంచిదే-- అమ్మా నాన్నగారు పట్టుదలగా నన్నే చేసుకోమనటం చివరకీ బావ నోటంటే నా కక్కర్లేదు అనిపించుకోటం మరీ ఘోరంగా వుండేది." అనుకుంది.
    అయినా బావకీ నాకూ ఒకప్పుడు  మాత్రం సరిపడిందా -- ఎప్పుడూ ఎందుకో అందుకు తగూలాడుకోటం తోనే సరిపోయేది -- తనకింకా బాగా జ్ఞాపకం , తన కప్పుడు పన్నెండేళ్ళుంటాయేమో -- పిల్ల లంతా కూర్చుని సరదాగా ఖబుర్లు చెప్పుకుంటుండగా ఏం తోచిందో 'సురేఖా , నువ్వు కొబ్బరి పీచు పెట్టి ఒళ్ళు రుద్దుకోరాదు కాస్త తెల్ల బడతావేమో.' అన్నాడు బావ నవ్వుతూ. పిల్లలంతా ఫక్కుమని నవ్వటంతో తను లేచి వెళ్ళిపోయి ఏడుస్తూ పడుకుంది.
    'బావ సరదా కేదో అంటే ఏడుస్తావా' అంటూ  అత్తయ్య తనని ఓదార్చబోయింది.
    "అసలదేమిటో మా ఇంట్లో వాళ్ళందరికీ హాస్యాలు చెయ్యటం అలవాటు-- మీ మామయ్యా అంతేగా.' అంటూ గొప్పగా చెప్పుకుంది తమ ఇంట్లోనే ఈ హస్యతనం అనేది పుట్టింది అన్నట్లు.
    "హస్యంట-- హాస్యం .' ఆ సంఘటనని తలుచుకుంటూ అప్పుడు కూడా పళ్ళు పటపట లాడించుకుంది సురేఖ.
    హాస్యం అంటే మల్లె పూల సౌరభం లా, మంచి గంధపు పరిమళం లా హృదయానికి మృదువుగా తాకి మనస్సుని ఆహ్లాద పరచాలి కాని ఇలా మనస్సులు నలిగిపోయి అంతరంగం విలవిల్లాడి పోయేలా చేసేది హాస్యం అనిపించుకుంటుందా? హాస్యం పేరుతొ ఎదుటి మనిషి మనస్సు నొప్పించే మాటలు అని తను సంబరపడ గలగటమే ఓ ఘనకార్యమా -- అయినా అదేమిటో అంతటి హాస్య ప్రియుడు ఎదుటి వాడు మళ్ళీ తిరిగి తనని ఒక మాట అంటే భరించలేడు. బావా అంతే , మామయ్యా అంతే. వచ్చినప్పుడల్లా నాన్నగారిని ఏదో ఒకటి అంటూనే వుంటాడు మామయ్య- అని, తన హాస్యానికి తనే మురిసిపోతూ ఫెళ్ళున నవ్వేస్తూ ఉంటాడు-- నాన్నగారు మళ్ళీ నవ్వుతూనే ఏదైనా అనేసరికి మాత్రం మూతి ముడిచేసుకుని రుసరుస లాడుతూ ఆ కోపం అంతా అత్తయ్య మీద చూపించేస్తాడు. అలా అల్లుడికి ఎక్కడ కోపం వచ్చి పోతుందో అని అగ్గగ్గ లాడిపోతూ మామ్మ ముందు నుంచీ నాన్నగారి నోరు నొక్కుతూనే వుంటుంది-- అవాల్టి కావాళ బావ అన్న మాటలకి ఓ చెంప ఏడుస్తూనే 'గుడ్డి కొక్కిరాయిలా నీ అందం మహా బాగుందేమిటి' అనేసింది తను. దాంతో అత్తయ్యకి బావకీ కూడా కోపాలోచ్చాయి.
    ఏమిటో చిన్నప్పుడే కలవని మనస్సులు పెద్దయాక మాత్రం ఎలా అతుకుతాయి-- అయినా ఏమిటి వెర్రి -- బావే కావాలని నా మనస్సెం తహతహ లాదిపోవటం లేదు . అతను తప్ప ఈ లోకంలో మరి పెళ్ళి కొడుకులే ;లేరా-- ప్రపంచమేం గొడ్డు పోలేదు -- అన్ని విధాల బావని తలదన్నే వాడే దొరుకుతాడు నాకు -- ' మనస్సులో ఓ ప్రక్క తగిలిన గాయాన్ని మన్పుకోటానికి మరో ప్రక్క నుంచి కొత్త నమ్మకాలని విశ్వాసాలని ఏర్పరచుకుంది సురేఖ.
    రుక్మిణమ్మ వూరుకి వెళ్ళబోయేముందు మరో సూచన కూడా చేసింది. 'ఉమని అలా వూరికే ఇంట్లో కూర్చో పెట్టెశారేం , మళ్ళీ చదివించండి -- పెళ్ళి అయినా, ఇప్పుడు వూరూరా కాలేజీ లు ఉండనే వున్నాయి కనక చదువు మానక్కరలేదు. అంతగా లేకపోతె ప్రైవేటు గా చదువుతుంది -- అబ్బాయి సరదా పడుతున్నాడు.' అంటూ.
    'అలాగే, దానికేం భాగ్యం ,' అంటూ ఇంటిల్లపాదీ అంగీకారం తెలియజేశారు.
    వెళ్ళబోయే ముందు ఆడబిడ్డకీ బొట్టు పెట్టి వర్ధనమ్మ ఇచ్చిన చీర, జాకెట్ గుడ్డ కాబోయే వియ్యపురాలి హోదాకి తగినట్లే వున్నాయి. పసుపులు, కుంకాలు కూడా అడివరకటి కంటే ఎక్కు వెక్కువ గానే మూటలు కట్టి ఇచ్చింది -- అన్నయ్య గారికి ఇష్టం అంటూ ఇన్ని కాజాలు, చేయించింది. తీపితో పాటు కారం కారంగా నమలటానికి కారబ్బూంది దూయించింది ఎత్తుకి ఎత్తు జీడిపప్పు వేసి.
    ఆవిడ్ని వీధి గుమ్మం దాకా సాగనంపుతూ "శలవల్లో రామకృష్ణ ని తప్పకుండా పంపించమని' మరీ మరీ చెప్పారు కామాక్షమ్మ గారు , రమణ మూర్తి దంపతులు కూడా.
    'నేను పంపెదేమిటి వాడే వస్తాడు -- ఎవరి కోసమని,' అంటూ గడప అవతలే నిలబడిపోయిన ఉమని చూసి నవ్వి, రిక్షా ఎక్కి కూర్చుందావిడ.
    ఆవిడ మాట ఇచ్చిందని వూరుకోకుండా -- రామకృష్ణ వచ్చాడని తెలియగానే -- రమణమూర్తి గారు బావగారి పేర మర్యాదగా వుత్తరం కూడా వ్రాశాడు. శలవలె కనక అందరూ రావలసిందని కోరుతూ....
    'నాకూ ఆరోగ్యం సరిగ్గా వుండటం లేదు మీ వూళ్ళో ఎండలు మరీ ఎక్కువ-- అందుకే ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను . మరి మీ చెల్లెలు కూడా రావటానికి వీలు కాదు -- మీ మేనల్లుడోచ్చి నాలుగు రోజులు పాటు వుండి వస్తాడు.' అని జవాబు వచ్చింది. ఉమామహేశ్వరం గారి దగ్గర నుండి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS