Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 4


    ఝార్నా పట్టణంలోని పెద్ద కుటుంబాలన్నింటిలో వెతికినా తుల్యమైన యువతి కనిపించదు. లేఖ తనదేననే ఆశ్చర్యంలో ఆనందం అనుభవించేవాడు కాలూ. బాలప్సర స్వర్గచ్యుతమై భూమ్మీదికి వచ్చినప్పుడు మాతృగర్భంలో ప్రవేశించి ఉండాలి, లేదా ఆ బ్రహ్మ పొరపాటున ఆ అప్సరను మరొక వీధిలోని గుమ్మంలో ప్రవేశపెట్టి ఉండాలి. అలా కాకున్నా తల్లి అందమైందే. ఆమె మూసలో తయారైంది ఎలా ఉంటుంది మరి?
    మానవ మాతృడెవడూ అలాంటి సౌందర్య మూర్తులిద్దర్నీ కలిగి ఉండే అదృష్టానికి నోచుకోడు. అలాంటప్పుడు లేఖ అతని మహాప్రసాదం అయింది. అతడు చేతులు జోడించి భగవంతుని కరుణకై ప్రార్ధించినప్పుడల్లా అదే కోరుకునేవాడు.
    అతనికి భార్యను గురించి అట్టే తెలియదు. అతడు ఆమెతో గడిపింది బహుస్వల్పకాలం. ఏళ్ళు గడచిన కొద్దీ మసగ్గా ఉన్న ఆమె స్మృతులు గూడా స్మృతిపథంనుంచి మాయమై ఆమె స్థానంలో ఒక సుందరమూర్తి స్థానం కల్పించుకుంది. అతని యవ్వన సహచారిణి జీవించి ఉండాల్సిన అంతరంగికావసరం కాలూకు కనిపించేది. అతడు దానికి ఒక కొత్త అర్ధం కల్పించాడు. కొత్త సంపదలు కూర్చాడు.
    లేఖ చదువులో మునిగిపోయింది. ఆమె మేధస్సు సహితం తన తల్లి ఊహాచిత్రాన్ని నిర్మించుకుంటూంది. జీవస్మూర్తిగా తన తల్లి ప్రస్తుతం ఆమెకు చాలా అవసరం. తండ్రిలాగే ఆమె సహితం ఒంటరితనం భరించలేకపోయింది. ఆమె తక్కువ కులపుది అయినందున బడిపిల్లలంతా ఆమెనుండి దూరంగా ఉండేవారు. ఆమె ప్రతి పరీక్షలోనూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం ఇంకా చెరుపుచేసింది. తన పాఠశాల బాలికలు తనకు మిత్రులుగా ఉండేట్లైతే ఆమె తక్కువ తరగతిలో ఉత్తీర్ణురాలు కావడాన్నే కోరుకొనేది. అలా జరగదని ఆమెకు తెలుసు. పైపెచ్చు వెక్కిరింపులు ఎక్కువ అవుతాయి.
    తన ఊరివారు ఆమె అంటే మండిపడేవారు.
    ఒకసారి పెద్దకులాల వారంతా సమావేశం అయినప్పుడు ముసలి బృందావన్ ముగ్గుబుట్టలాంటి తల వణకుతూండగా "ఒక కమ్మరిపిల్ల విజ్ఞానపు ఈకలు తగిలించుకొని! ఊరపిచ్చుకై చిలుకతో తులతూగుతూంది" అని విచారం ప్రకటించాడు. ప్రేక్షకులంతా అదిరిపడి "తల్లిలేని పిల్ల విజ్ఞానంతో వెలిగిపోతే ఏం?" అని ఎదురుప్రశ్నవేశారు.
    ప్రజల్లో ఇలాంటి భావాలుండడం వల్ల ఉగ్రుడైన కాలూ దూరదూరంగానే ఉండసాగాడు. అయినా చుట్టుపట్ల ఉన్న తనకులం వారూ ఇతర కులాలవారూ, పండుగ ఏర్పాట్లను గురించీ, తగాదా పరిష్కారాల్ను గురించీ సలహా అడగడానిగ్గాను అతని దగ్గరికి వచ్చేవారు. అతడు ప్రశాంతంగానూ గంభీరంగానూ మాట్లాడేవాడు. అతని నిర్ణయాలకు విలువ ఉండేది. అతనిది ఆత్మశక్తి అని ప్రజలు గ్రహించారు. కాలూను విశ్వసించవచ్చునని వారికి తెలుసు. ఏదో ఒక చాపల్యంవల్ల అతడు తన బిడ్డను పాఠశాలకు పంపుతున్నా. అవివాహితగా ఉంచినా అతని హృదయం సదా తనవారి మధ్యనే ఉండేది. అనాదిగా వస్తున్న తనకులంలో అతనికి సుస్థిరమైన స్థానం ఉండేది.
    అయినా వారు దూరంగానే ఉన్నారు. తండ్రి బిడ్డలకు ఇది పెద్ద బాధ అయింది. లేఖ పుస్తకాల్తో కాలం గడుపుతూందనేది అతనికి సంతృప్తి కలిగించింది. ఆమె రాత్రింబవళ్ళు చదివేది. చివరకు ఆమె స్కూల్ ఫైనల్ లో ఉన్నప్పడు - ఆమెకు 16వ ఏట - బహుమతి లభించింది. బెంగాల్ మొత్తపు విద్యార్ధులకు వార్షిక వ్యాసరచన పోటీ జరుగబోతూంది. అందులో నెగ్గిన బాలునికైనా, బాలికకైనా అశోక మెమోరియల్ మెడల్ లభిస్తుంది.
    లేఖ ఎప్పటికంటే ఎక్కువ ఆలోచనామగ్నం అయింది. ఆమె ఒక చింకి చాపమీద కూర్చుంది. ఆమె ముందు ఒక అడుగు ఎత్తు బల్ల ఉంది. ఆమె చుబుకం ఒక అరచేతిలో ఉండగా కళ్ళుమూసి ఏదో ఆలోచించేది. లేదా ముత్యాల్లాంటి ఆమె రాతతో ఒక పూట అంతా నింపి చదివి దాన్ని చింపి మళ్ళీ రాసేది. ఒక్కొక్కసారి పుస్తకం తనలో తానే మెల్లగా చదువుకునేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కాలూ ఎన్నడూ విఘాతం కలిగించలేదు. ఒక్కొక్కసారి ఇత్తడి గిన్నెతోపాలు ఆమె బల్లమీద ఉంచేవాడు. పాలు ఆలోచనకు పదును పెట్తాయి. కాని లేఖ పాలను అంటేదికాదు. అవి ఆరిపోయేవి. కాలూ ఆ గిన్నె తీసి తిరిగి వేడిచేసి అక్కడ పెట్టేవాడు. జాగ్రత్తగా ఆమె ఆలోచనకు భంగంకలగని సన్నని ధ్వనితో "ఇంకొంచెం పంచదార వేయాలా?" అనేవాడు.
    అఖిల వంగ విద్యార్ధి వ్యాసరచన పోటీలో నెగ్గడానికి సాహసోపేతమైన ప్రయత్నం లేఖ చేస్తూందని సంతోషం కలిగినా ఆమె నిరుత్సాహం పడాల్సి వస్తుందేమో నన్న విచారం సహితం అతన్ని వేధించసాగింది.
    ఒకనెల తరువాత లేఖ ఆనందం చిందులు తొక్కే వదనంతో ఇంటికి వచ్చింది. ఆమె గెలిచింది.
    కాలూ కొంతసేపు ప్రతిమలా ఆమెవైపు చూస్తూనే ఉండిపోయాడు. మాట్లాడలేక పోయాడు. ఆమె బెంగాల్ లో ఆ బహుమతి పొందే మొట్టమొదటి బాలిక. అతడు ఆమె తెలివితేటల్ను ఎంత తక్కువగా అంచనా వేశాడు?
    ఆ రాత్రి అదృశ్యమైన తల్లితో - హార్దికంగా ఆ ఇంటిని దీవిస్తూన్న తల్లితో - మాట్లాడుతూ ఉన్న కాలూ విచారగ్రస్థుడై పోయాడు.
    "నీ కల నిజమైంది. నీ బిడ్డ ఝార్నా పట్టణానికే గౌరవం తెచ్చింది. ఇదంతా చూడ్డానికి నీవు జీవించి ఉంటే?"
    మహానగరమైన కలకత్తా ముఖాన మసిపూసి జార్నాకు గౌరవం తెచ్చిన తన బిడ్డను అభినందించడానికి ఊరి పెద్దలంతా వస్తారని ఆశిస్తూ కొన్ని రోజులపాటు కాలూ నిరీక్షిస్తూ వరండాలో కూర్చున్నాడు. ఆమెపేరు 'హిందూస్తాన్' పత్రికలో ప్రకటించ బడింది. అది జనులంతా చదివారు. దాంతోపాటు పోటీకి వేయికి పైగా వ్యాసాలు వచ్చాయని కూడా పత్రికలు ప్రకటించాయి. "వ్యాసం సుందరంగానూ స్వతంత్రంగానూ ఉంద"ని వారు అభిప్రాయం వెలిబుచ్చారు. అంతకంటే ఇంకేం కావాలి?
    ఆ పత్రిక మూడు ప్రతులు కొన్నాడు.
    తన గెలుపు విలువను గుర్తించనట్లే 'మూడుపత్రికలు ఎందుకు బాబూ' అని కిలకిలా నవ్వుతూ అడిగింది లేఖ.
    "ఒకటి నాకు. ఒకటి నీకు పెళ్ళయినాక నీ భర్తకోసం అన్నాడు."
    లేఖ తల నేలకు వాల్చింది. "అయినా ఇంకోటి మిగిలి ఉంటుంది" అన్నది తల వంచుకునే.
    "పై రెండింటిలో ఏదైనా పోతే ఇంకొకటి పనికి వస్తుంది" అన్నాడు.
    "సుందరమూ! స్వతంత్రమూ" అబ్బ ఎంతమంచి తీర్పు. అతడెవరో చంద్రలేఖను స్వయంగా చూచినట్లే తీర్పు ఇచ్చాడు. అనుకున్నాడు.
    మేజిస్ట్రేట్ తనింటికి వచ్చి అభినందించడా? గత సంవత్సరం తన గుర్రానికి నాదాలు వేయడానికిగాను అతడు కాలూను రెండుసార్లు పిలిపించాడు. ఇది అతడు బగ్గీ అమ్మి మోటారుకార్ కొనకముందు సంగతి. ఇన్ స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కూడా వస్తాడేమో? వారు తప్పకుండా టౌన్ హాల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి చంద్రలేఖకు పూలదండలు వేసి జనానికి పరిచయం చేస్తారు. వారు తనను కూడా నాలుగు మాటలు మాట్లాడమంటే? వేదికమీద తన నోరు మూతపడుతుందే. అది సిగ్గుచేటు కదూ!
    ఝార్నా పట్టణంలో చలనమే లేదు. ఎవరూ రాలేదు.
    శుభ్రమైన వెల్వెట్ కేసులో మెడల్ రానే వచ్చింది. దాన్ని చూచి, పరీక్షించి కాలూ కనుల పండుగ చేసుకున్నాడు. తనబిడ్డకు తగిన పేరు పెట్టడం ఎంత అదృష్టం? ఆ వెండిమెడల్ పైభాగాన ఆ పేరు చెక్కబడ్డం ఎంత సౌభాగ్యం! కాని దాన్ని చూపు కోవడానికి అతనికి ఎవరూ లేరు. ఆ రాత్రి కాలూ దాన్ని తన దిండుకింద పెట్టుకొని నిద్రపట్టేదాకా దాన్ని ప్రేమపూర్వకంగా తాకుతూనే ఉన్నాడు.
    
                                      2
    
    చంద్రలేఖ ప్రైజు గెల్చుకున్న మూడునాలుగు నెల్లకే గడ్డురోజులు మొదలైనాయి. వంగదేశపు చరిత్రమొత్తంలో ఇలాంటి కరువు రాలేదు. యుద్ధం మొదలుకావడంతో ఆకలి మంటలు బెంగాల్ నాలుగుమూలలా అలముకున్నాయి.
    అది 1943వ సంవత్సరం!
    తూర్పు రంగంలో జపాను సైన్యం విజ్రుంభించింది. శత్రుసేనలను ఎదుర్కొంటూ భారతదేశపు సరిహద్దుదాకా వచ్చింది. శత్రువును ఎదుర్కోవడానికి భారతదేశపు సరిహద్దుల్లో బారికేడ్లు నిర్మించబడలేదు. ఆహార ధాన్యాల విషయంలో రేషనింగుగాని కంట్రోలుగాని ప్రవేశపెట్టడం జరగలేదు. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడే తిమింగిలాల్ను అదుపులో పెట్టిన నాధుడులేడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS