Previous Page Next Page 
రక్తచందనం పేజి 4


    అటవీశాఖ అధికారులు మేడలు కడుతున్నారట. కార్లు, టీవీ.లు, నగలు, రియల్ ఎస్టేట్స్,బ్యాంక్ బ్యాలన్స్ లు సమకూర్చుకుంటున్నారట. విషయం అర్థమైందనుకుంటాను...." మంత్రి గంభీరంగా, సంక్షిప్తంగా విషయాన్ని తెలియజేశారు.
    "తమిళనాడు, కర్ణాటక అటవీశాఖ పైఅధికారుల దృష్టికి ఈ విషయాన్ని తెచ్చాం సార్...." అసిస్టెంట్ సెక్రెటరీ నీళ్ళు నములుతూ అన్నాడు.
    "అదే....అదే విషయాన్ని ఆయా రాష్ట్రాల అధికారులు స్మగ్లర్ల దృష్టికి తెచ్చి జాగ్రత్తగా మసలుకోమని చెప్పుంటారు. అంతటితో సమస్య పరిష్కారమయింది. అంతేనా....?" మంత్రి కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి.
    అధికారులు సిగ్గుతో తలలు వంచుకున్నారు.
    "సారీ సార్...." నిజంగానే తన విచారాన్ని వ్యక్తం చేశాడు సెక్రెటరీ. మిగతావాళ్ళ కళ్ళల్లో కూడా అదే భావం వ్యక్తమయింది.
    "గంధం చెక్క ఆధారంగా నడిచే పరిశ్రమలు కేరళలో, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులలో కేంద్రీకృతమై ఉన్నాయి. అక్కడికే స్మగ్లర్స్ సాండల్ ఉడ్ ని తరలిస్తున్నారు. వాళ్ళు దాన్నుంచి మంచి గంధం నూనెని తీసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు, విదేశాలకు ఎక్స్ పోర్టు చేస్తున్నారు.
    మరికొంత చెక్కతో విగ్రహాలు తయారుచేయించి ధనవంతుల భక్తి ప్రవత్తులకు సహాయపడుతున్నారు. కోట్లాది రూపాయలు వారి ఇనప్పెట్టెలోకి వెళ్ళిపోతున్నాయి....లక్షలాది రూపాయలు అధికారుల విలాసాలకు, స్తిరాస్థులకు చేయూతనిస్తున్నాయి. విషయం మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఆపైన నేనేమి కోరుకుంటానో కూడా మీరు అర్థంచేసుకోగలరనుకుంటాను...." అంటూనే ఛాంబర్ నుంచి విసురుగా బయటకెళ్ళిపోయారు.  
    నిజానికి సంబంధిత అధికారులే మంత్రులకు కావలసిన ఇన్ ఫర్మేషన్ ని ఫీడ్ చేయవలసి ఉంటుంది. మంత్రులు వస్తుంటారు_పోతుంటారు. సంబంధితశాఖ అధికారులు రిటైరయ్యేవరకు ఆ శాఖలోనే ఉండిపోతారు. ఇన్ ఫర్మేషన్ బ్యాంకుల్లా పనిచేయవలసిన తాము అలాంటి స్థితిని ఎదుర్కోవలసి రావటాన్ని అవమానంగా భావిస్తూ ఆఫీసునుంచి బయటపడ్డారు.


                                         *    *    *    *


    ఆ రాత్రి పదిగంటలకు ఊటీ చేరుకున్న డాక్టర్ డ్రైవర్ కి కారు కిరాయిచ్చి ఆరెంజ్ గ్రోవ్ రోడ్ లోని రిట్జ్ హోటల్ లో దిగాడు. అప్పటివరకు గుండెదడతో తల్లడిల్లిపోతూనే ఉన్నాడు. ముందయితే డబ్బుకోసం ఒప్పుకున్నాడుగానీ, ఆ తరువాత తను చేసింది ఎంత పెద్ద తప్పో గ్రహించి ఒణికిపోయాడు.
    ఆపైన ఆ అనుభవం తాలూకు ఆలోచనల తీవ్రతను భరించలేక లిక్కర్ తెప్పించుకొని ఆఫ్ బాటిల్ తాగి మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు.


                         *    *    *    *


    ఉదయం ఎనిమిది గంటల సమయం....
    న్యూఢిల్లీ....కేంద్ర ప్రభుత్వ సచివాలయం....
    సౌత్ బ్లాక్....పర్యావరణం, అడవుల శాఖ కార్యాలయం హడావిడిని సంతరించుకుంది ఆ పాటికే.
    సెక్రెటరీ స్టెనోని పిలిచి నోట్ డిక్టేట్ చేస్తున్నాడు. జాయింట్ సెక్రెటరీ, డిప్యూటీ సెక్రెటరీ నీలగిరి నుంచి ధర్మపురి వరకు వున్న అటవీ ప్రాంతపు మ్యాప్ ని టేబుల్ మీద పరిచి నిశితంగా పరిశీలిస్తున్నారు.
    "అవునూ....ఇంతకీ మంత్రిగారి దృష్టి హఠాత్తుగా చందన వృక్ష సంపదమీద పడిందేమిటి?" డిప్యూటీ సెక్రెటరీ అడిగాడు.
    పెన్సిల్ తో మ్యాప్ మీద ఏదో మార్క్ చేస్తున్న జాయింట్ సెక్రెటరీ ఒక్కక్షణం తను చేస్తున్న పని ఆపి _ "నిన్న ఎవరో మద్రాసు నుంచి వస్తూ హిందూ పేపరు పట్టుకొచ్చాడట. అందులో చందనం స్మగ్లింగ్ మీద ఒక ఆర్టికల్ పడిందట. దాన్ని చూసి ఆయన మనమీద విరుచుకుపడ్డారు. ఈసారి ఏదో ఒకటి ఖచ్చితంగా చేయకపోతే మనల్ని వెనక్కి పంపించే ప్రయత్నం కూడా చేయవచ్చు...." అన్నాడు నిట్టూరుస్తూ.
    "అయితే ఇన్వెస్టిగేటివ్ ప్రొసీడింగ్స్ ని త్వరితం చేయమని రెడ్ ఫైల్ పంపించాల్సిందే" అన్నాడు డిప్యూటీ సెక్రెటరీ గత్యంతరం లేదన్న భావాన్ని వ్యక్తం చేస్తూ.
    పదిన్నరకల్లా నోట్ తయారయిపోయింది.
    తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అటవీ విభాగాల చీఫ్ కన్జర్వేటివ్ లను ఉద్దేశిస్తూ తయారుచేసిన రెడ్ ఫైల్స్ లో తీవ్రమైన పదజాలాన్ని వాడటం జరిగింది.
     పదకొండు గంటలకు కార్యాలయానికి వచ్చిన మంత్రిగారి ముందు టైప్ చేసిన నోట్ ని ఉంచారు. ఆయన నోట్ చదివి తలెత్తి అధికారులవైపు సూటిగా చూశారు. ఆయన ముఖంలో అంత గంభీరతని వాళ్ళెప్పుడూ చూడలేదు. ఏదో పొరపాటు జరిగిందని గ్రహించారు.
    "అవసరమైతే పోలీసు శాఖ సహాయాన్ని ఎంతమేరకయినా తీసుకోమని ఇందులో ఇంక్లూడ్ చేయండి" అని అదే విషయాన్ని నోట్ కి ఎడంవైపు మార్జిన్ లో రాసి సంతకం చేశారు.
    సత్యమంగళం, బర్గూర్ కీకారణ్య పర్వత శ్రేణులపై క్రమంగా ఉచ్చు బిగుసుకోబోతోందన్న వార్తకిక కాళ్ళు రాబోతున్నాయి.
    మరో గంటకి రెండు రెడ్ ఫైల్స్ బెంగుళూరు, మద్రాసు నగరాల కేసి ఆఘమేఘాల మీద బయలుదేరి వెళ్ళిపోయాయి.


                          *    *    *    *


    కేంద్ర పర్యావరణ శాఖనుంచి వచ్చిన టెలెక్స్ మెసేజ్ ని తీసుకొని సెక్రెటేరియట్ నుంచి ముఖ్యమంత్రి అధికార నివాసానికి ఆఘమేఘాలమీద బయలుదేరాడు పర్సనల్ సెక్రెటరీ.
    సరిగ్గా అదే సమయానికి ఇటు కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయాలకు రెడ్ ఫైల్స్ అందాయి.


                                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS