Previous Page Next Page 
వారుణి పేజి 4


    నేనూ అందరి తల్లిదండ్రుల్లాగే ఆశపడతాను. కానీ నా ఆశలని ఆశయాలని నేనెప్పుడూ నా సంతానంపై రుద్దాలని ఆలోచించలేదు. వ్యక్తిత్వం వచ్చేదాక ఒక దార్లో పెట్టాలి. అంతే!
    సారధీ! తీగ లేత వయస్సులో అది పాకేందుకు ఒక ఆధారం కావాలి. దాన్ని మనం చూపాలి. తర్వాత అదే తీగ తీగలై సాగి పాకుతుంది, శోభిస్తుంది, కాస్తుంది, పూస్తుంది. సంతానమూ అంతే! నేనెప్పుడూ స్వార్ధం ఒసం సంతానం అభివృద్ధిని కోరలేదు. మీరు ఉన్నతులయితే సుఖపడేది మీరే! మీ ఆనందమే నాకు కావాలి. మీ నుంచి నేనేమీ ఆశించలేదు, ఆశించను_"
    తండ్రి మాటలు సారధి మనస్సుకి ఎంతో తృప్తినిచ్చాయి. వంగి తండ్రి పాదాలకి నమస్కరించాలనిపించింది.
    కానీ చప్పున ఆ పని చేయలేకపోయాడు. ఏదో ఎబ్బెట్టుగా ఫీలయ్యాడు.
    "నాన్నగారూ! మేం మీ కడుపున పుట్టటం మా అదృష్టం. అందరు తల్లిదండ్రులూ యిలా తమ సంతానాన్ని క్రమశిక్షణాయుతమైన స్వేచ్చతో పెంచితే అన్ని కుటుంబాలూ సుఖ సంతోషాలతో తూలతూగుతాయి" అన్నాడు మనస్ఫూర్తిగా.
    దానికి నారాయణ మీ జవాబు చెప్పలేదు ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు.


                                   2


    "పలకరేమిటి?"
    సుబ్బరత్నమ్మ పిలుపుకి తన ఊహల్లోంచి బయటికి వచ్చాడు నారాయణ. సారధి పెళ్ళికిముందు తమ మధ్య జరిగిన సంభాషణ అంతా గుర్తుకి రావడంతో ఆయన మనస్సు అదోలా అయిపోయింది.
    భార్యవైపు అదోలా చూశారు.
    "పలకరేమిటి?"
    "ఏమిటి?" ఆయన కంఠం బరువుగా ధ్వనించింది.
    "రిసెప్షన్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఒక ఆహ్వాన పత్రికల్లేవు, పందిళ్ళు లేవు, మేళతాళాలు లేవు, విందులు వినోదాలు అసలే లేవు. పెళ్ళయిందంటే అయిందని వచ్చేశారు_" అంది హేళనగా.
    "హు పెళ్ళికి యివన్నీ హంగులు మాత్రమే- కేవలం యీ హంగులు కూడితే పెళ్ళి అయిపోతుందా? అసలైన మనస్సులు కలవాలి అప్పుడే అది పెళ్ళి" అనుకున్నారాయన. కానీ ఆమెతో ఆ మాటలు అనలేదు.
    "రేపో-ఎల్లుండో నలుగుర్నీ పిలుద్దాం"
    "ఊఁ నీ యిష్టం-పెళ్ళి జరపలేకపోయాం. కనీసం గృహప్రవేశమయినా జరగాలి కదా! నలుగురికీ ఈమె నీ కోడలని తెలియజేయాలి కదా!"
    "ఆహాఁ ఈ రాజకుమారి నా కోడలు. ఈ జమిందారిణి నా కొడుకు భార్య- ఈ భూస్వామిని ఈ వంశగౌరవాన్ని వెలిగించబోయే ప్రబుద్ధురాలు_"
    "సుబ్బరత్నం-" ఆమె హేళన ఆయనకి కోపాన్ని తెప్పించింది, మందలింపుగా పిలిచారు.
    "సరే! సరే! ఇంట్లో దరిద్ర పెద్దమ్మ అడుగుపెట్టింది కదా! మళ్ళీ గృహప్రవేశం అంటూ మరో ఖర్చు ఎందుకు అని అలా అన్నాను-"
    "రత్నం!" కొద్దిగా కఠినంగా అన్నారాయన. "తప్పు అలా అనొద్దు-"
    "ఉన్న మాటంటే ఉలుకెక్కువ ?"
    "రత్నం ! అబ్బాయి వింటే ఏమవుతుంది ?"
    "వినకపోతే ఫర్లేదా ?" హేళనగా అడిగింది.
    "ఛ!"
    "ఓహోఁ యీ గొప్పింటి అమ్మాయి నచ్చిందని అడుగులకు మడుగులొత్త మంటారా? ఆచి తూచి మాటాడాలంటారా? సర్లేండి. అన్నీ కొత్తగా నేర్చుకుంటాను."
    "రత్నం! మనం ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే అది మన గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. అంతే- మనం ఇతర్లని హేళనగా చూస్తే లోకం మనల్ని చూసి హర్షిస్తుంది."
    ఆమె సమాధానం యివ్వలేదు.
    "నీ మనస్సులో ఎన్ని వున్నా నీవు పైకి సంతోషాన్నే ప్రదర్శించాలి. వినలేదా? గుండెల్లో వేయి అగ్నిగుండాలు రాగులుతోన్నా- పైకి చిరునవ్వుల వెన్నెలలు వర్షించాలి. లోకానికి నీ దుఃఖంతో పనేమిటి? రత్నం! మన అసంతృప్తి అయిష్టతే ప్రధానం కాదు. సారధి తృప్తి- అతని యిష్టం ముఖ్యం. వాళ్ళిద్దరూ కలిసిమెలసి సుఖంగా జీవించాలి- అందుకోసం మనం పరిస్థితులు కల్పించాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS