Previous Page Next Page 
జోగబాల పేజి 5


    కానిస్టేబుల్స్ లో ఒకడు వొళ్ళంతా పులకరిస్తుండగా నాలికతో పెదాలు తడుపుకుంటున్నాడు.


    "కమాన్. చూస్తూ నిలబడతారేం? స్టాప్ దట్ నాన్సెన్స్" అంటూ ఎస్.ఐ. చేతిలోని లాఠీ గిరగిర తిప్పుతూ ముందుకు పరుగెత్తాడు. కానిస్టేబుల్స్ అతన్ననుసరించారు.


    "ఆపండి?" అని అరిచాడు ఎస్.ఐ. ఖంగ్ మనే కంఠంతో. అంత సందడిలోనూ అతని గొంతు మార్మోగినట్టయింది.


    వాతావరణమంతా ఒక్కసారి ఉలిక్కిపడినట్టయింది. "నాట్యం చేస్తోన్న వాళ్ళంతా ఎక్కడి వాళ్ళక్కడ డిస్సర్న్ అయిపోవాలి. ఊ క్విక్!"


    నాట్యం చేస్తోన్న వాళ్ళంతా చలనం లేనట్లు అలా నిలబడిపోయారు. కాని ఆ దృశ్యాన్ని తిలకిస్తోన్న గ్రామస్థులలో నుండి ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. నడివయసు దాటి ఉంటుంది. అతని ముఖంలో వర్చస్సూ, వేష భాషలూ చూస్తే ఊరి పెద్దల్లో ఒకరనిపిస్తుంది.


    "ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకుంటే సహించారు. ఇది అతి పవిత్రమైన ఆచారానికి సంబంధించినది. దీనికి ఎవరి పర్మిషనూ అక్కర్లేదు. అనవసరంగా కల్పించుకున్నారా_ రక్తపాతానికి దారితీసిన వాళ్ళవుతారు. ఊఁ కానివ్వండి. మధ్యలో ఉత్సవమాపితే సత్తెమ్మదేవత ఆగ్రహిస్తుంది" అని అరిచాడు.


    అతని వెనకనే ఉన్న పదిమంది యువకులు ముందుకు వచ్చారు.


    "ఉత్సవం ఆపడానికి వీల్లేదు. అడ్డు వచ్చిన వాళ్ళ తలలు పగిలిపోతాయి. మొదలు పెట్టండి" అని గట్టిగా అరిచారు.


    నాట్యం చేస్తూ ఆపేసిన వాళ్ళకు ఈ భరోసాతో ధైర్యమొచ్చింది. వాళ్ళలో కదలికలు మొదలయినాయి.


    కాగడాల వెలుగులో ఎస్.ఐ. మొహం క్రోధంతో ఎర్రబడడం స్పష్టంగా గోచరించింది.


    "లా అండ్ ఆర్డర్ నే ధిక్కరిస్తారా? కమాన్! ఎదిరించిన వాళ్ళను ఎటాక్ చేయండి?" అంటూ వేగంగా ముందుకు దూకాడు.


    కాని ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్ నిలబడ్డ చోటునుంచి కదల్లేదు. అతను వెనక్కి తిరిగి చూసి "రారేం?" అన్నాడు గర్జిస్తున్నట్టుగా.


    "సార్! వాళ్ళు చూస్తే వందల కొద్దీ ఉన్నారు. మనమంతా కలిసి అయిదుగురు కంటే లేము. ఎదురు తిరిగితే నజ్జు నజ్జయిపోతాము. అందులోనూ ఇదేదో తీవ్రమైన ఆచారానికి సంబంధించిన వ్యవహారమంటున్నారు. మనం కల్పించుకోవడం మంచిది కాదనుకుంటాను సార్!" అన్నాడు వారిలో ఒకడు ధైర్యం చేసి.


    "నాన్సెన్స్! మీ ఉద్దేశాలు, భయాలు కట్టిపెట్టి నేను చెప్పినట్టు చేయండి లేకపోతే ఎస్.పి.గారితో చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయించేస్తాను. ఊఁ రండి_" అన్నాడు ఎస్.ఐ. ఆజ్ఞాపిస్తూ.


    కానిస్టేబుల్స్ విధిలేక అతన్ని అనుసరించారు.


    "లాస్ట్ వార్నింగ్! ఆపుతారా లేదా?" ఎస్.ఐ. కంఠం మళ్ళీ ఇంకోసారి మార్మోగింది.


    గ్రామస్తులలో ఎవరూ అతని హెచ్చరిక లెక్క చేయలేదు. కర్రలూ, రాళ్ళూ ఇంకా కొన్ని చిన్న చిన్న ఆయుధాలు పట్టుకుని సిద్ధంగా నిలబడ్డారు. ఇంత ఉద్రిక్త వాతావరణంలోనూ గుళ్ళో నృత్యం తీరస్థాయిలో జరుగుతూనే ఉంది. ఈ సందడిలో ఆకాశంలో మబ్బులు అలముకుంటూ ఉండడం, గాలి రివ్వున వీస్తూ ఉండడం ఎవరూ గమనించలేదు.


    పోలీసులు లాఠీలు జనాన్ని చీల్చుకుంటూ ఎడాపెడా బాదిపారేస్తున్నాయి. అవతల్నుంచి రాళ్ళు వచ్చి ఢీకొంటున్నాయి. ఒక కానిస్టేబుల్ తలచిట్లి నెత్తురు కారసాగింది. ఇంకో కానిస్టేబుల్ కు వెనుక నుంచి ఓ కర్ర బుజంమీద వాలి విరిగిపోయినంతపనయింది. దాంతో ఆగ్రహావేశాలు పెచ్చు మీరి వాళ్ళు మరింత రెచ్చిపోయారు. ఎస్.ఐ. ఉగ్రరూపం దాల్చి వీరవిహారం చేస్తున్నాడు.


    అతని తలమీద బలంగా ఓ కర్ర దెబ్బపడింది. "అమ్మా" అని అరిచాడు. నెత్తురు జరజరమని కారింది.


    ఎక్కడో ఉరుము ఉరిమింది. మనుషులను పడదోసేటంతటి వేగంగా గాలి వీచింది. దానితో బాటు ఉన్నట్లుండి భారీగా వర్షం కురవసాగింది.


    ఒక వైపు వర్షం, ఇంకోవైపు గాలి. ఆ భయానక వాతావరణంలో డోళ్ళు, డోలకుల మధ్య నగ్న నర్తకుల విలయ తాండవం. హాహాకారాలు, ఆర్తనాదాలు, రౌద్రపూరితమైన కేకలు...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS