Previous Page Next Page 
జోగబాల పేజి 4


    "తాతా! సైన్సు యింతగా పురోగమించిన ఈ రోజుల్లోకూడా ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవడం మంచిదంటావా?"


    ఆ వృద్ధుని కళ్ళు క్షణంలో ఎర్రబడ్డాయి. "సైన్స్! ఏం చేసింది మీ సైన్స్! రాకెట్ లో చంద్ర మండలానికి ఎగరగానే సరిపోయిందా? చావుని నివారించగలిగిందా? సగానికి పైగా జబ్బులు సరియైన చికిత్స లేకుండానే ఉండిపోతున్నాయి. నువ్వు చెప్పిన సైన్స్ మారణాయుధాలు కనిపెట్టడానికీ, విలాసాలకూ ఉపయోగపడింది గానీ మాలాంటి పేద ప్రజల ఆకలి బాధను తీర్చడానికిగానీ, కరవు కాటకాలను తొలగించడానికిగాని ఉపయోగపడిందా?" అన్నాడు. ఉద్రేకంలో అతని గొంతు బాగా వణికింది.


    "తాతా? ఓ యాభయ్యేళ్ళ క్రిందటికీ ఇప్పటికీ సైన్స్ వల్ల ఎన్ని రంగాలు అభివృద్ధి చెందాయో గమనించలేదా? ఉదాహరణకు ఈ పొలాలు దున్నటం విషయమే తీసుకోండి..."


    ఆ వృద్ధుడిలో ఆగ్రహావేశాలు మరింతగా ఎగసినాయి.


    "మా నమ్మకాలను ఖండిస్తూ మాట్లాడే మీతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేను. నేను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరెవరితోనైనా మీరీ మాటలు అంటే నరికి పోగులు పెట్టేవారు. మర్యాదగా ఇక్కడినుండి తొలగిపొండి" అంటూ అరిచాడు ఉద్రేకస్వరంతో.


    శ్రీహర్ష ముఖం చిన్నది చేసుకుని అక్కణ్ణుంచి కదిలాడు. స్నేహితులిద్దరూ కొంతదూరం వెనక్కి నడిచారు.


    "నీ తొందరపాటు వల్ల ఓ మహారంజకమైన దృశ్యాన్ని కళ్ళారా ఆస్వాదించే అవకాశాన్ని పాడుచేసేశావు" అన్నాడు విలాస్ కోపంగా.


    శ్రీహర్ష ఏమీ జవాబు చెప్పలేదు. ఇద్దరూ సైకిళ్ళు పార్కు చేసి చెట్టు కిందకి వచ్చారు.


    "నువ్వెళ్ళు. నేనిక్కడే కాసేపుంటాను. అనుభవాన్ని అనుభూతిని జుర్రుకోకుండా వొదిలిపెట్టలేను" అన్నాడు విలాస్.


    "సరే! నే వెడుతున్నాను" అని సైకిల్ ఎక్కి అక్కణ్ణుంచి కదిలాడు శ్రీహర్ష.


    "ఎక్కడికి?"


    పోలీసు స్టేషన్ కు. "పోలీస్ స్టేషన్ కా? దేనికి?"


    "ఇక్కడ జరుగుతున్న వికృతమైన దురాచారాన్ని గూర్చి కంప్లెయింటు ఇచ్చి అరికట్టడానికి"


    "హర్షా! లేనిపోని వ్యవహారాల్లో తలదూర్చటానికి నీకేమన్నా పిచ్చి పట్టిందా?"


    "నీ దృష్టిలో నువ్వు చూస్తోన్న దృశ్యం పిచ్చికాదు. అది వారించడం పిచ్చి" అని అతని మాటలు వినిపించుకోకుండా సైకిలెక్కి చీకట్లోకి దూసుకుపోయాడు.


    పోలీసుస్టేషన్ లో ఎస్.ఐ.నలుగురయిదురు కానిస్టేబుల్స్ ఉన్నారు. ఎస్.ఐ. ట్రాన్సిస్టర్ రేడియో పెట్టుకుని వింటూ హుషారుగా సిగరెట్ కాలుస్తున్నాడు.


    శ్రీహర్ష లోపలకు విసురుగా వెళ్ళాడు. ఎస్.ఐ అతనివంక ప్రశ్నార్ధకంగా చూశాడు. "సార్! ఊరి బయటి గుళ్ళో చాలా ఘోర దురాచారం జరుగుతోంది. మీరు దయ ఉంచి పట్టించుకోవాలి" అన్నాడు శ్రీహర్ష కొంచెం రొప్పుతూ, వినయంగా.


    "ఏమిటది?"


    శ్రీహర్ష గబగబా వివరించి చెప్పాడు. ఎస్.ఐ అతను చెప్పింది విని బాగా రియాక్ట్ అయ్యాడు. "ఏదో సంబరం చేసుకుంటారంటే విని ఊరుకున్నను గాని ఇంత అరాచకంగా ఉంటుందనుకోలేదు. ఐ డోన్ట్ స్పేరిట్" అంటూ కుర్చీలోంచి లేచి నిలబడి "కమాన్" అన్నాడు కానిస్టేబుల్స్ వంక తిరిగి.


    స్టేషన్ లో ఒక్క కానిస్టేబుల్ ని మాత్రం ఉంచి మిగతా వాళ్ళంతా జీపులో బయల్దేరారు. పదినిముషాల్లో జీపు ఊరి బయటి గుడి దగ్గరకు చేరుకుంది. ఎస్.ఐ. తన సిబ్బందితో జీపు దిగాడు.


    సంబరంలో మరింత ఉద్రిక్తత, ఉత్సాహం పెరిగి కేరింతలు_వింత విన్యాసాలు...పరాకాష్ఠ దశలో ఉంది సంబరం.


    ఎస్.ఐ. కళ్ళప్పగించి నిశ్చేష్టితుడైనట్లు నిలబడ్డాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS