Previous Page Next Page 
జోగబాల పేజి 6


    తీవ్రంగా వీస్తోన్న గాలివల్ల కానీ, పెనుగులాటలో కింద పడిపోవటం వల్ల కానీ కాగడాలన్ని ఒకటొకటిగా ఆరిపోసాగాయి.


    చివరకు గాఢాంధకారమలముకొంది. కేకలూ, పెడబొబ్బలూ ఎక్కువయిపోయాయి. ఇప్పుడు ఒక్క కాగడా కూడా వెలగడం లేదు. చీకట్లో ఎవరెవరు కొట్టుకుంటున్నారో తెలియడం లేదు. గాలీ, వానా ఉధృతమై పోయింది. దేవాలయంలో నర్తకులు నాట్యం ఆపేసి కకావికలై అటూఇటూ పరుగులు తీస్తున్నారు.


    ఆ గలాటా నుండి, భీతావహమైన వాతావరణం నుండి బయటపడి నగ్నంగా ఉన్న ఓ యువతి బయట ఉన్న చెట్ల కింద నుండి వడివడిగా నడుస్తోంది.


    హఠాత్తుగా బుజం మీద ఓ చెయ్యి పడింది. "ఎవరు?" అంది వొణికే గొంతుకతో. "భయపడకు" అంది ఓ పురుష కంఠం. "అందరిలోకి అద్భుతంగా నువ్వే నాట్యం చేశావు. అందరిలోనూ గొప్పగా, అందంగా ఉన్నది కూడా నువ్వే. అందుకే సత్తెమ్మతల్లి అనుగ్రహించి వర్షం పడేటట్టు చెయ్యడమే కాకుండా, నిన్ను ఆస్వాదించడానికి నన్ను పంపింది. రా" ఆ చేతులామెను బలంగా దగ్గరకు తీసుకొంటున్నాయి. పెదాల మీద తియ్యగా భగ్గుమంది. ఆ చేతుల్తో దగ్గరగా హత్తుకోవడంలో పెదాలు తీసుకోవడంలో మగసిరి ఉంది. ఆ యువతి నిరాకరించటానికి ప్రయత్నించలేదు. అభ్యంతరం చెప్పాలని కూడా అన్పించలేదు. మత్తుగా, నిషాగా అతన్తో పాటూ ఆ బోరున కురిసే వానలో కిందకు వాలిపోయింది.


    తూరుపు తెలవారుతూండగా ఊరి బయట ఓ చెట్టు క్రింద నిలబడి నిరీక్షిస్తోన్న శ్రీహర్షను వచ్చి కలుసుకున్నాడు.


    శ్రీహర్ష చాలా ఆతృతగా వున్నాడు. "హమ్మయ్య వచ్చావా? ఆ గలాభాలో ఏమయిపోయావోనని హడలి చస్తున్నాను." అన్నాడు స్నేహితుణ్ణి చూసిన సంతోషంతో.


    కంఠం తడబడుతుండగా "నాకేమన్నా ప్రమాదం జరిగిందా అదేంకాదు పై పెచ్చు గొప్ప థ్రిల్ కూడా..."


    "థ్రిల్లా? ఏమయింది?"


    "ఏమీలేదులే. పద పోదాం" ఇద్దరూ సైకిళ్ళెక్కి బయల్దేరారు.


    "ఒకరకంగా చూస్తే ఈ మూఢ నమ్మకాలు మంచివే అనిపిస్తోంది. పాపం అంత కష్టపడి చేసినందుకు ఎంత్ పెద్ద వర్షం పడిందో చూశావా?" అన్నాడు విలాస్.


    "అది కేవలం కాకతాళీయం. కానీ ఈ సంఘటనతో వాళ్ళ నమ్మకం ఇంకా ప్రబలిపోతుంది." అన్నాడు శ్రీహర్ష విచారంగా. విలాస్ నవ్వాడు. ఆ నవ్వు చాలా శాడిస్టిక్ గా కనిపించింది శ్రీహర్షకు. అతని వొళ్ళు గగుర్పొడిచింది.


                                         2


    దాదాపు పదిహేనురోజుల తర్వాత ఇద్దరూ జోగాపురం చేరుకున్నారు. ఉదయం తొమ్మిదయి ఉంటుంది. సరిగ్గా ఆ సమయానికా వూళ్ళో మహాసంరంభంగా గొప్ప ఉత్సవం జరుగుతోంది. ఉత్సవంలో అయిదారు వందలమందిదాకా పాల్గొంటున్నారు.


    అది ఓ జాతర పద్ధతిలో జరుగుతోంది. హరిజనవాడలో 'వాసంతి' అనే పదహారేళ్ళ అమ్మాయి జోగినిగా మారబోతోంది.


    ఎల్లమ్మదేవత అంతకు నాలుగయిదు రోజుల క్రితం ఓ నడివయసు స్త్రీ కలలోకివచ్చి వాసంతిని జోగిని చెయ్యాలని లేకపోతే అచిరకాలంలో మహమ్మారి కలరా రూపంలో వ్యాపించి ఊరు మొత్తాన్ని కబళించి వేస్తుందని హెచ్చరించింది. ఊరంతా కంగారుపడిపోయి వాసంతి తల్లిదండ్రులను సమావేశపరిచారు.


    "ఎల్లమ్మదేవత ఆదేశం, తిరుగేముంది దొరా?" ఆజ్ఞ శిరసావహించాడు వాసంతి తండ్రి.


    వాసంతి ఇష్టా ఇష్టాలను గురించి ఎవరూ ప్రశ్నించలేదు. ఆమె నోట్లోంచి ఒక్క మాట కూడా వెలువడలేదు. వెంటనే జోగిని సంబరం ఏర్పాటయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS