"ఏమిటో అనుకున్నాం గానీ పెద్దవాళ్ళ ఉసురు ఊరికే పోదండీ. వాళ్ళ కిష్టంలేని పెళ్ళి చేసుకుని మనం ఏమి సుఖపడ్డాం?... ఏమండీ...నాకో మాటిస్తారా?"
"అడుగు!"
"మన పెళ్లిలాగా... మన కిష్ణుడి పెళ్ళి జరక్కుండా చూడండి. మీ అంగీకారంతోపాటు వాడి అత్తమామల ఆశీస్సులు ముఖ్యం. వాళ్ళ ఆత్మీయతా అనుబంధాలే వరాలు. అల్లాంటి పెళ్ళే చేస్తానని మాటిస్తారా?"
సత్యం కదిలిపోతూ ఆమె చేతిలో చెయ్యివేసి అన్నాడు-
"అట్లాగే సుభద్రా! నువ్వు కోరుకున్నట్టుగానే వాడి పెళ్ళి చేస్తాను!"
ఆ మాట ఆమెకు మనశ్శాంతిని కలిగించింది. అందుకే ఆమె ఎంతో నిబ్బరంగా కన్ను మూయ గలిగింది.
"సుభద్రా" అని పిచ్చిగా గొనుక్కున్నాడు సత్యం!
... పసిగుడ్డు పెంపకభారం సత్యం మీద పడింది. భార్యకిష్టమైన కిష్ణుడి పేరే పెట్టుకున్నాడు. లాల పోసేడు జోల పాడేడు.
... ఏళ్ళు గడుస్తున్నాయి. కిష్ణుడికి తల్లీతండ్రీ గురువూ అన్నీ సత్యమే అయ్యాడు.
ఆ కథ పూర్తయింది.
గతంనుంచి సత్యం బయటపడ్డాడు. కళ్ళజోడు తీసి కళ్ళొత్తుకున్నాడు. ఎంతో గంభీరంగా తన మిత్రులతో అంటున్నాడు...
"మా కిష్నుడు ఇప్పుడు యమ్మెస్సీ చేస్తున్నాడు. వాడిని నా బిడ్డగా కంటే ఒక మంచి ఫ్రెండుగా చూసుకుంటున్నాను. అఫ్ కోర్స్ - వాడికి నేను బెస్టు ఫ్రెండని వదిలేయండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ - మా ఆవిడ కిచ్చిన మాటకి విలువనిచ్చి కిష్నుడ్ని మనసారా ఆదరించే అత్తమామల కోసం వెతకనా? లేక మీరన్నట్టు వాడికిష్టమైన పిల్లతో పెళ్ళిచేసి నేను ఇచ్చిన మాట తప్పనా?"
"నీ ఫీలింగ్స్ హర్ట్ చేసేనేమో..." అన్నాడు నారాయణ.
"అఫ్ కోర్స్. హర్టు చేసిన మాట వాస్తవమే! నా గొడవ తెలీని ఫ్రెండువి గనుక సరిపెట్టుకుంటాను" అన్నాడు సత్యం.
"ఒకవేళ మీవాడు నీకు తెలీకుండా ఎవర్నైనా ప్రేమించి వుంటేనో..." అడిగేడు ఇంకో ఫ్రెండు...
"అయ్ కాంట్ హెల్పిట్. పెళ్ళి మాత్రం షరతుల ప్రకారం జరగాల్సిందే. ఏక్సిడెంటల్ గా ఆ పిల్ల తల్లిదండ్రులు, మంచి వాళ్ళూ మనసున్న వాళ్ళయితే నో ప్రాబ్లమ్. మా మావ జాతి మనుషులైతే ఆ పెళ్ళి జరగదు" అన్నాడు సత్యం.
"ఆ దెబ్బతో ప్రేమికులిద్దర్ని బాధపెట్టిన వాడివవుతావు."
"వాళ్ళకి పెళ్ళయినా సుఖపడతారనే గ్యారంటీ లేదు. కనుక ఆ పెళ్ళి జరక్కుండా పిల్లల్ని బాధ పెట్టడమే మంచిది."
"ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావో చెప్పేవు కాదు" అన్నాడాయన అసహనంగా.
"అయామ్ కమింగ్ టు దట్ ఇంపార్టెంట్ పాయింట్. మనమంతా మంచి స్నేహితులం. మా ఆవిడ కోరుకున్న ఆత్మీయత, అనుబంధం మీదగ్గర మా కిష్ణుడికి దొరుకుతాయనే నమ్మకం నాకుంది. అయ్ బిలీవ్ యూ! మా వాడికి జోడైన పిల్ల మీలో ఎవరికున్నా-ఆ పిల్ల నాకు నచ్చితే ఆ తండ్రి నాకు వియ్యంకుడవుతాడు" అని నీళ్ళ గ్లాసు ఎత్తి గొంతు తడుపుకున్నాడు సత్యం.
4
నారాయణ వాళ్ళది పెంకుటిల్లు. చాలా పాత ఇల్లు. అతనొక బడిపంతులు. అంచేత ఆర్ధికంగా వెనుకబడిన జాతి మనిషి.
ఎక్కడ అప్పు చేసేడోగాని ఆ పాత యింటిని డాబుగా అలంకరించేడు. ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు ఏర్పాటు చేసేడు.
పక్క ఇళ్ళలోంచి కొత్త కుర్చీలు ఎరువు తెచ్చి హాల్లో వేసేడు.
అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా వున్నాయి, ఇంక సత్యం రావడమే తరువాయి.
నారాయణకో తల్లి వుంది. అమెక్కొంత చాదస్తం ఆస్థిగా వుంది. అంచేత అడిగిందే అడిగి ప్రాణాలు తీస్తుంది.
"అవున్రా అబ్బీ! అంత ఆస్థిపరులు నీ కూతుర్ని చేసుకుంటాడనుకుంటావా?"
నారాయణ ఎంతో సౌమ్యంగా సమాధానం చెప్పేడు.
"సత్యానిక్కావాల్సింది ఆస్థీ ఐశ్వర్యాలు కావే! ఆత్మీయతా అనుబంధం!"
"ఏమిటో నీ పిచ్చిగానీ అత్మీయతానుబంధాల కిది పురాణకాలమట్రా, ఆ రోజుల్లో క్రిష్ణపరమాత్మా కుచేలుడూ వున్నారంటే వాళ్ళ స్నేహానికి ఆస్తులూ అంతస్థులూ అంతరాయం కలిగించలేదు. అలాంటిది ఈ దిక్కుమాలిన రోజుల్లో కూడా---"
"అమ్మా! సత్యం నా పాలిట సాక్షాత్తు కృష్ణ పరమాత్మేనే! నా కూతురు నచ్చాలేగాని ఈ పెళ్ళి జరగడానికి అడ్డంకులేమీ వుండవు."
"ఏమిటో... నీ పిచ్చి నీ కానందం---"
బయట కారు హారను శబ్దం వినిపించగానే నారాయణ కలవరపడ్డాడు. తల్లి నోరుమూయించి అమ్మాయిని సిద్ధం చేయమని భార్యతో చెప్పాడు.
ఆ తర్వాత అతను సత్యాన్ని ఆహ్వానించటానికి గుమ్మం బయటకి వచ్చాడు.
సత్యం పెళ్ళి పెద్ద వేషంతో కారు దిగాడు. పంచె లాల్చీ పైన ఉత్తరీయం.
డ్రైవరు పళ్ళ బుట్టని లోపల పెట్టాడు. నారాయణతో పాటు సత్యం లోపలికి వచ్చాడు.
నారాయణ తన తల్లినీ, భార్యని సత్యానికి పరిచయం చేసాడు.
నారాయణ తల్లి తన డ్యూటీని మరిచిపోలేదు. సత్యాన్ని అడిగింది-
"ఏం నాయనా! పెళ్ళికుమారుడు యింకా కార్లోనే కూచున్నాడా?"
సత్యం నారాయణ వేపు చూసేడు. నారాయణే తల్లికి సమాధానం చెప్పేడు---
"అమ్మాయి మా సత్యానికి నచ్చితే చాలు. వాళ్ళబ్బాయి తండ్రి మాట కాదనడు"
నారాయణ భార్య అమ్మాయిని తీసుకొచ్చింది.
ఆ పిల్ల అందంగానే ఉంది. నడక బావుంది. వచ్చి కూచునే వరస బావుంది.
సత్యం ముచ్చట పడుతున్నట్టు గమనించిన నారాయణ గాలి పీల్చుకున్నాడు.
"నీ పేరేమిటమ్మా!" ఆ పిల్లని ప్రశ్నించేడు సత్యం.
"సుగుణ, టెన్తు క్లాసు పాసయింది. వంటా వార్పు వచ్చు" అన్నాడు నారాయణ.
"ఓ.కే! అవునొ రేయ్-సంగీతం" అంటూ నసిగాడు సత్యం.
నారాయణ నీళ్ళు నముల్తు అన్నాడు-
"లేదురా! అంత ఖర్చు పెట్టి నేర్పించే స్తోమత లేక-"
నారాయణ భుజం తట్టి అతని మాటకి అడ్డంపడి అన్నాడు సత్యం.
"ఓ.కే! ఓ.కే. మా కోడలుపిల్ల పాటకచేరి చేయాల్సిన అవసరం లేదు. సంగీతం నేర్పించలేని వాడివి ఇంక నాట్యమెట్లా నేర్పిస్తావులే వదిలేయ్... ఓ.కే! నారాయణా - మీ అమ్మాయి నాకు నచ్చిందిరా!"
ఆ మాటకి ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషించారు. నారాయణ ఆనందం వర్ణనాతీతం!
సత్యం సుగుణతో అన్నాడు-
"చూడమ్మా! ఇన్నేళ్ళుగా ఒక తియ్యటి పిలుపు-ఐ మీన్ పలకరింపు కోసం మొహం వాచి వున్నాను ఒకసారి నన్ను 'మావయ్యా' అని పిలు తల్లీ!"
ఆ కోరిక వినగానే ఆ పిల్ల తన తండ్రి వేపు బేలగా చూసింది. నారాయణ కంగారుపడ్డాడు. అతను తల్లివేపు చూసాడు. ఆమె తీరుకూడా అలాగే వుంది. నారాయణ భార్య పరిస్థితీ అంతే-
ధైర్యం తెచ్చుకుని నారాయణ మెల్లిగా గొణిగేడు---
"నీ యింటికొచ్చాక ఒకసారి ఏమిట్రా-నీకు విసుగ పుట్టేంతవరకు పిలుస్తూనే వుంటుంది."
సత్యం నారాయణ మాట వినిపించుకోలేదు.
