కొడుక్కి, కోడలికి వడ్డించి, బయటికి వచ్చి అయోధ్యరాంని, కోసలరాంని పిలిచింది పార్వతి.
"మీరూ రండర్రా! హోటలులో లాగా ఒక్కొక్కరికీ వడ్డించలేక నా నడుం పడిపోతుంది. అందరూ ఒక్కసారి వస్తే పని తెములుతుంది. అయినా మీకంత జాలిలేదురా! తల్లిని సుఖపెడదామని ఒక్కరికీ లేదేం!" ఆవిడ కంఠంలో విసుగు బాధా ధ్వనించాయి. ఇన్ని సంవత్సరాలుగా రామం లేకుండా చాకిరీ చేస్తున్నాను, నాకు విశ్రాంతి లేదా? అన్న వేదన పలికింది.
"ఎందుకమ్మా! అలా అన్యాయంగా అంటావ్! నిన్ను సుఖపెట్టాలని కదే మేం పెళ్ళి చేసుకోంది. మేంకూడా పెళ్ళి చేసుకుని వుంటే మాకే కాకుండా మా భార్యలకి కూడా చేయాల్సి వచ్చేది కదా!" అన్నారు నవ్వుతూ జంట కోయిలల్లాగా.
"బాగా మాటలు నేర్చారురా!"
తల్లిమాటలలో కోపం వుండదని కొడుకులందరికీ తెలుసు. తండ్రి ఏనాడూ తిట్టరు. పొరుగు సంసారాన్ని చూసి తమ తల్లిదండ్రులు దేవతలను కొంటారు కొడుకులందరూ.
"అత్తయ్యా!" జ్యోతి పిలుపుకి లోపలికి వెళ్ళింది పార్వతి.
ఆమె అటువెళ్ళగానే పట్టాభిరాం వచ్చాడు. అతను బ్యాంక్ లో కేషియర్ గా పనిచేస్తున్నాడు. బి.ఏ. పూర్తికాగానే పరీక్షవ్రాసి బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. చదువులో అతడి శ్రద్దనీ, అతను తెచ్చుకుంటున్న క్లాసుమార్కుల్ని చూసి అతన్ని ఎమ్.ఏ. చదివించాలని వుండేది శాస్త్రిగారికి.
కొడుకుని రీసెర్చికి పంపాలనీ వుండేది. కానీ పట్టాభి ససేమిరా చదవనన్నాడు. ఉద్యోగానికే ప్రయత్నాలు చేశాడు. అతను కాలేజీలో క్రికెట్ జట్టుకి కెప్టెన్. స్టేట్ కాంపిటీషన్స్ వరకూ వెళ్ళి ఇంటర్ స్టేట్స్ మే చెస్ లో పాల్గొని సెంచరీలు చేశాడు. క్రికెట్ అంటే వుండే క్రేజ్ వలన అతనికి సులభంగా బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. అతనికి ఏనాటికైనా సి.కె. నాయుడంతటివాడు కావాలని ఆశ. సునీల్ గవాస్కర్ అంటే ఎంతో యిష్టం. అతనిప్పుడు క్రికెట్ ప్రాక్టీసు చేసే వస్తున్నాడు.
అతని దిన చర్యలో మార్పుండదు. రెండుపూటలా క్రికెట్ ప్రాక్టిస్, పదింటికి భోజనం చేసి బ్యాంకికి వెళ్ళడం. ఒకటో తారీకున జీతంలో రెండొందలు యింట్లో ఇస్తాడు.
తొలిసారి జీతం తీసుకోగానే "యిదేమిట్రా? అని అడిగారు శాస్త్రిగారు. ఆయనకి కొడుకు జీతమెంతో తెలుసు.
"ఏం లేదునాన్న గారూ! ఈ రోజులలో ఒట్టి బి.ఎ.కి ఎంతగా ఉద్యోగాలు దొరుకుతున్నాయో తెలుసుగా! నా క్రికెట్ నాకు తిండి పెడుతుంది. అందుకే మామూలు ఎల్.డి.సి.కి ఎంత జీతం యిస్తారో అంతే యిచ్చాను. మిగతాది నా క్రికెట్ ప్రాక్టీస్ కి ఇతర ఖర్చులకి వుంచుకున్నాను."
ఆ సరికే ఒక్కో కొడుకు యిస్తున్న అనుభవాల ఇంజెక్షన్స్ బాగా పట్టి అలవాటైన శాస్త్రిగారు. "నీ యిష్టం బాబూ! ఇదీ ఇవ్వకుండా నీవు బ్యాంకిలోనే దాచుకుంటే నేనేం చేయగలను? కన్నందుకు తిండి పెట్టాలిగా. మీరున్నంత నిర్దాక్షిణ్యంగా నేనుండలేను గదా! అయినా కొడుకులకి తిండిపెట్టలేని దుస్థితిలో లేను.
నా సరస్వతి నాకు తిండి పెడుతూ నా యింటిలో వాళ్ళకీ పెడుతుంది" అన్నారు.
"బాధ పడకండి నాన్నగారూ! నిజాలెప్పుడూ నిష్టూరంగానే ఉంటాయి. అయినా దేశం రోజురోజుకి మారిపోతోంది. మారేకాలాన్ని చూసి మీరూ మారాలి" అన్నాడా సుపుత్రుడు.
ఉత్తుంగ తరంగంలా వస్తున్న కోపాన్ని పార్వతి ముఖం చూసి ఆపుకున్నారాయన.
పట్టాభిరాగానే అతడి వెంట అయోధ్యరాం, కోసల కూడా వచ్చారు. ఆ సరికి జానకిరాం జ్యోతి భోజనం ముగించారు.
"హలో!"
"హలో! ఎలా వుంది నీ ప్రాక్టీసు?"
"ఒరే అన్నయ్యా! నే చెపితే వినవుగానీ, నీవొట్టి ఫూల్ విరా! నీవూ ఫుట్ బాల్ ప్లేయర్ కదా! బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి ఆటగాడు కావచ్చంటే వినవు. వదిన యిలా ఎన్నేళ్ళు టైప్ చేసి రోజుకి నాలుగయిదూ సంపాదించి మామయ్యకిస్తుందిరా! ఒక మేచ్ లో పాల్గొంటే థౌజండ్స్ యిస్తార్రా!" అన్నాడు.
"థాంక్స్! మీ అన్నగారికే ఆ సలహా యిచ్చావు. నాతో చెప్పావు కావు. క్రికెట్ లో ఇంతవరకూ లేడి ప్లేయర్స్ లేరుకదా! ఇంటర్నేషనల్ ఫేం వచ్చేదని నన్ను వెళ్ళమనలేదు."
జ్యోతి, పట్టాభి క్లాస్ మేట్స్. ఇద్దరివీ ఒకటే గ్రూప్.
"ఆ మాటకొస్తే జ్యోతీ నువ్వూ నా మాట వినవు. చెస్ ఛాంపియన్ షిప్ వదిలేశావు నువ్వు. ఎడిషనల్ క్వాలిఫికిషన్ వుంటే బ్యాంక్స్ లో, పోష్టల్ డిపార్టుమెంటులో ఉద్యోగాలు ఈజీగా వస్తాయి" అన్నాడు నవ్వుతూ.
"పట్టాభీ! వడ్డించాను ఇక కూర్చోండి. అప్పుడే తొమ్మిదిన్నరయింది" అంది ఆ సంభాషణ వినటం ఇష్టంలేని పార్వతి.
"అవశ్యం మాతా! అవశ్యం! వదినగారినీ రమ్మను. నువ్వూ కూర్చో కలసి భోంచేద్దాం" అన్నాడు పట్టాభి.
"యూ... షటప్" అరిచాడు అయోధ్యరాం.
"ఏం రా?"
"ఒరేయ్! అమ్మకి కోపం తెప్పించకు."
"నేనే మన్నానురా?"
"నువ్వు ముందు నోర్మూసుకుని భోం చెయ్యరా!"
"ఒరేయ్! నోర్మూసుకుని ఎలా భోం చేస్తానురా?" అడిగాడు కోసలరాం.
పకపక నవ్వాడు పట్టాభిరాం.
పార్వతి తీక్షణంగా చూసింది. కాస్త పని తెరిపి చేసుకుని వెళ్ళి పడుకోవాలనిపిస్తోందామెకి.
"అమ్మా! అమ్మా! అలా చూసి మమ్మల్ని శపించకు. బుద్ధిగా భోజనం చేస్తాం." నవ్వుతూ అన్నాడు పట్టాభి. తల్లి కోసం ఎలా పోగొట్టాలో అతనికి బాగా తెలుసు.
ఫక్కున నవ్వేసింది పార్వతి. ఆమెకు ఆఖరు కొడుకంటే ఎంతో ప్రేమ! ముద్దు! అందులో అందరికంటే మంచి ఉద్యోగంలో వున్నాడనీ, అందరిలోకి అందంగా వుంటాడనీ ఆమెకి అంతరాంతరాల్లో అభిమానం. అందుకే అతనెంత అల్లరి చేసినా, గోముచేసినా ఏమీ అనదు. "పోనీ చిన్న సన్యాసి!" అనుకుంటుంది ప్రేమగా.
ముగ్గురూ భోజనాలు చేసి వెళ్ళారు. జ్యోతి, జానకిరాం ఆఫీసుకెళ్ళారు.
తనకీ స్వాతికీ కంచాలు పెట్టి 'స్వాతీ!' అని కేకేసింది పార్వతి.
