Previous Page Next Page 
వారుణి పేజి 48


    ఒరేయ్ !
    ఇదిగో అది యిలాగే ప్రవర్తించేట్టయితే నేను సహించలేనుగాక సహించలేను. ఈ యింట్లో అలాంటి ప్రవర్తనని నేను ఓర్చుకోలేను గాక ఓర్చుకోలేను. నా హయాంలో యిలాంటి దగుల్బాజీ పనులు జరుగుతూ వుంటే నేను వూరకే వుండను గాక వుండను.
    మీరు వెళ్ళిపోండి !
    ఈ యింట్లోంచి వెంటనే వెళ్ళిపోండి మీ యిష్టం మీ కాపురం ఎక్కడైనా ఎలాగైనా ఏడ్చుకోండి. మా అభ్యంతరం లేదు. మాకేం ఫర్వాలేదు మాచావు మేంచస్తాం. మీ ఏడ్పు మీరేడ్వండి.
    నీ యిష్టం వచ్చిందాన్ని యిష్టం వచ్చినట్టు చేసుకుని_ కానీ కట్నం లేకుండా_ మా పెద్దరికం లేకుండా చేసిన రోజునే_ మా పని ముగిసిపోయింది. నీవు మాకు కావని మేం నీకు ఏమీ కామని అనుకున్నాం. అయినా కన్నకొడుకన్న మమకారం, కోడలనే ప్రేమ చావక మిమ్మల్ని పట్టుకుని వేళ్ళాడుతున్నాం. అది మా దౌర్భాగ్యం."
    దులిపి పారేసింది సుబ్బరత్నమ్మ.
    "ఎరేంజ్ డ్ మారేజెస్ లవ్ మారేజెస్ గురించి లైఫ్ మేగజైనో" తను చదివిన ఆర్టికల్ యింకా మనస్సులో తిరుగుతున్నట్టుగానే వుందతనికి.
    "వెస్ట్రన్ కల్చర్ వైపు పరుగెడుతోందా తనదేశం!" అనుకున్నాడు మనస్సులో.
    "సారధీ !"
    "అమ్మా ?" బాధగా పిలిచాడతను. "ఒక్క విషయం బాగా ఆలోచించమ్మా! వారుణి తరహా వేరు. ఆమె పెరిగిన వాతావరణం_ఆమె ఊహలు వేరు. మా మామగారు తనకి పరిపూర్ణమైన స్వేచ్చ యిచ్చారు. తననో సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దారు."
    "నీ గొంతుక్కోశారు." అతని మాటలకి అడ్డొచ్చి తీవ్రమైన కోపంతో రగులుతోన్న మనస్సుతో అందిచప్పున. ఆమెకి అతని ధోరణి కోపాన్ని రెచ్చగొట్టేలా అయింది. తన మాటలు వింటాడని, తనకి సై దోడులాగా కోడల్ని తనూ తట్టిపోస్తాడనీ ఆశించింది. కానీ అతను వారుణిని సమర్ధించటం ఆమెని రెచ్చిపోయేలా చేసింది.
    "ఆడదానికి స్వేచ్చ ఏమిట్రా? వెర్రివెధవా? తనెప్పుడు భర్తని కాదని తిరక్కూడదు. తిరిగిందో ఆ ఆడది తప్పకుండా చెడిపోతుంది. మాకేం అనుభవాలుంటాయ్. లోకమేం తెలుస్తుంది. అడుగుపెట్టి తీసేలోగా సవాలక్ష ఆటంకాలు. అడుగడుగునా అవరోధాలు_ అనుమానాలు_ అవమానాలు."
    "అమ్మా ?" విసుగ్గా పిలిచాడు సారధి. అతనికామె ధోరణి చిరాకును తెప్పిస్తుంది. సాధించి, సాధించి హింసించే ఆమె ప్రవృత్తి అతనికేం తెలీనిది కాదాయె! అందుకే అన్నాడు "అమ్మా మీ తరానికీ మా తరానికి ఎంతో తేడా వుంది. మీ కాలం వేరు. మా కాలం వేరు. మీరు_"
    "వుంటే నువ్వు నీ భార్య బజార్లో డాన్స్ చెయ్యండి బాబూ_మాకేం అభ్యంతరం లేదు. మీరు వేరుపోయి మీ బ్రతుకులు మీరు బ్రతుక్కోండి. కాదనం_కానీ ఇక్కడుండి మమ్మల్ని యిబ్బంది పెట్టి_మధ్య నా కూతుర్ని పాడుచెయ్యకండి!"
    "అమ్మా!" బాధగా పిలిచాడు సారధి. ఆమె ఉమ్మడి కుటుంబ విషయాలు మాటాడేసరికి అతన్లో బాధ్యత తలెత్తినట్టయింది. "పద్మ! పద్మ నా చెల్లలమ్మా! ఆ గౌరవాగౌరవాలు నావి_నా వీనూ_
    "అయితే నీ భార్యని హద్దులో పెట్టెయ్. ఆమె తనేదో లోకం నుంచి దిగివచ్చినట్టుగా తలపోస్తోంది. ఆ తలపొగరు అణిచెయ్! మేమంతా అనాగరీకులమన్నట్టు తనేదో నాగరికురాలన్నట్టుగా ప్రవర్తితోంది. బుద్ధిచెప్పు."
    తల్లి మాటల్లోని కరుకుదనం, ఆమె మొండితనం గ్రహించాడు. "అమ్మా! కొన్నాళ్ళు గడవనీ_మన యింటి పరిస్థితులు గమనించి వారుణి అలాగే సర్దుకుపోతుంది" అంటూ నచ్చచెప్పబోయాడు.
    "నీ ముఖం నీకేం తెలుసు? ఆమె తన ఆలోచనల మేరకి మనల్ని మార్చేస్తుంది_నీలాగే. నువ్వు మారిపోయావుగా."
    అంతలో నారాయణ రావటంతో ఆమె విసవిసా వెళ్ళిపోయింది. తండ్రిని చూసిన సారధి కూడా మౌనమే వహించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS