ఆమె దగ్గరకెళ్ళి నిలబడి "చూడండీ" అన్నాను. "ఒక స్త్రీ తనను తన కుటుంబాన్ని గౌరవించుకోనంత కాలం, సమాజం నుంచీ ఎలాంటి గౌరవం పొందలేదు. ఇతర స్త్రీలలో ప్రతి అంశాన్నీ తప్పుగా తీసుకుంటూ వాళ్ళకూ ఓ చిన్న హృదయమున్నదనీ, వాళ్లదీ శరీరమేననీ, వాళ్లలోనూ ఓ మనిషి ఉన్నారనీ గుర్తించలేని స్త్రీ.... వాళ్లకు కాదు తనకు తాను ద్రోహం చేసుకుంటోందని తెలుసుకోవాలి" అన్నాను.
* * *
సురేంద్ర ఇంట్లో వెనకున్న గెస్ట్ హౌస్ లో కాపురం మొదలుపెట్టాము.
ఆ మొదటి రాత్రి....
మా ఇద్దరి మధ్యా అది అధికారికంగా మొదటిరాత్రి. అనధికారికంగా ఎప్పుడో జరిగిపోయింది. ఈ అధికారికం, అనధికారికం.... ఇవి ఎవరి మానసిక పరిపక్వతలని బట్టి ఏర్పడిన, ఏర్పరచుకున్న కాన్ సెప్టులు. వీటిని గురించి తర్వాత చెబుతాను.
మొదటిరాత్రి అనేది స్త్రీ విషయంలో యాంత్రికంగా పురుషుడి విషయంలో కోరికలమయంగా జరుగుతుంది. వీటికి రకరకాల రంగులు పులుముతూంటారు.
ప్రేమగానీ, సెక్స్ గానీ మొదట్లో అంత రుచిగా, థ్రిల్లింగ్ గా ఉండవు. వాటి గురించి ఊహలు, ఆలోచనలు థ్రిల్లింగ్ గా, రుచిగా ఉంటాయి. ఈ రెంటికీ తేడా తెలీక ఆలోచననీ, అనుభవాన్ని ఒకటిగా భావిస్తూ ఉంటారు.
సుకుమార్ నన్ను గట్టిగా కౌగలించుకుని, వొళ్ళంతా ఎక్కడపడితే అక్కడ ముద్దులతో నింపేశాడు. నా శరీరమంతా స్పందనలతో దద్దరిల్లిపోయినట్లయింది.
"సతీ! నాకు చాలా గర్వంగా ఉంది."
"దేనికి?"
"నిన్ను సాధించినందుకు"
"సాధించటం ఏనాడో జరిగిపోయింది. ఇప్పుడు సొంతం చేసుకున్నావు."
"............"
"............"
"సొంతం చేసుకున్నాకే అసలు సమస్యలు మొదలవుతాయి. ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైనదేమిటో తెలుసా? ఈ సొంతమనే భావన. ఇది అవతలి మనిషిని పీల్చి పిప్పి చేస్తుంది."
"సతీ! నీ మాటలతో బెదరగొట్టేస్తున్నావు. నువ్వలా మాట్లాడుతూంటే నిన్ను అనుభవించటానిక్కూడా భయమేస్తోంది."
నవ్వొచ్చింది. అతన్ని చూస్తే జాలేసింది. లోపల్నుంచి ప్రేమ పొంగి పొర్లింది. ప్రక్కనే పడుకుని ఉన్న అతన్ని దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాను.
చిత్రమేమంటే నిజమైన ప్రేమలో కూడా 'అది' ఉంటే ఆ ప్రేమ నిలకడగా ఉండదు. మధ్య మధ్య అదృశ్యమవుతూ మళ్లీ ఆవిర్భవిస్తూ ఉంటుంది.
ప్రేమతత్వం అనుభవించటానికి ప్రేమ గురించి తెలియవలసిన అవసరం లేదు. ఉన్నాడో లేదో తెలీని దేవుడ్ని రకరకాల రూపాల్లో సందర్శిస్తున్నట్లుగానే ఉన్నదో లేదో తెలీని ఈ ప్రేమను కూడా ఎన్నో రూపాల్లో ఆవిర్భవింపచేసుకోవచ్చు.
"ప్రియా" అన్నాను పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ. "ఈ క్షణంలో నిన్ను చాలా చాలా ఆరాధిస్తున్నాను. రా. నన్నాస్వాదించు."
"ఈ క్షణం...."
"పదాల్లోని అర్థాలు వెదికి అనుమానాలు పెట్టుకోకు. గతం కన్నా భవిష్యత్తుకన్నా ఈ క్షణం విలువైనది. లేనిపోని ఆలోచనలు పెట్టుకోక ఈ క్షణంలోని అమూల్యత్వాన్ని ఆస్వాదించు. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప సత్యమేమిటో తెలుసా? ఈ క్షణం. నీకు మనస్ఫూర్తిగా అంకితమవుతోన్న దివ్యక్షణం. దీన్ని వాంఛ, సెక్స్ అని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి ఇందులోని అమరత్వాన్ని కించపర్చకు. ఇది ఉద్రేకం కాదు. అనిర్వచనీయమైన అర్పణ. ఇది వాంఛ కాదు. సృష్టిలోని అమాయకత్వాన్నంతా ఆవిర్భవింపచేసే అమృతానుభవం. అనుక్షణం దీన్ని గ్రోలుతూ దుర్మార్గులైన ప్రజలు హీనంగా చిత్రిస్తారు. దీనికి వ్యాపార దృక్పథాన్ని అంటగడతారు. నువ్వు...."
"అది కాదు...." అంటూ ఇంకేదో చెప్పబోతున్నాడు.
"ఉష్" అంటూ పెదాలని అతని పెదాలకద్ది తర్వాత మాటలు బయటకు రాకుండా చేశాను. ఊపిరి సలపకపోవటంలో కూడా ఇంత ఆనందముందని గ్రహించి ఉంటాడు. "బిగియారా కౌగిలించుకోవటమంటూంటారే.... ఆ బిగువు ఎంత బలమైనదో తెలుసా? మనిషిని కదలనివ్వకుండా చేసే శక్తి ఈ కోమల హస్తాలకెక్కడ్నుంచి వొస్తుందో తెలుసా?"
ఆ శక్తి హస్తాలలో లేదు. అనుభూతిలో ఉంది. అనుభూతి లేకుండా ఇంకో రకంగా అదుపు చెయ్యకలిగితే అది రాక్షస బలమవుతుంది.
యాంత్రికత్వంతో మొదలైన ప్రక్రియ మనసుల్లో నిగూఢమైన బంగారు అలల్ని స్పృజించి, స్పృజించి దుఃఖ సమ్మేళిత ఆనందతరంగాల మాధుర్యంలోకి సాగిపోయింది.
అతను నాలో, నా వక్షస్థలంలో, నా హృదయంలో, నా శరీరంలో కరిగిపోయాడనటం కంటే, అతన్నే నేను కరిగించుకున్నాననటం సమంజసం.
19
ఒకరోజు ఉదయం తొమ్మిది గంటలవేళ నైఫ్ తో కూరలు తరుగుతున్నాను. సుకుమార్ ఉద్యోగంలో చేరాడు. అన్నం తిని పదిగంటల కల్లా ఆఫీసు కెళ్ళిపోవాలి. వెనక నుంచి అతను రావటం తెలిసింది.
నన్నానుకుంటూ నిలబడ్డాడు.
"నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదూ."
"ఎందుకలా అనుకుంటున్నావు?"
"ఎంతో అమూల్యమైన భావాలున్నదాన్ని, తీసుకొచ్చి ఈ రొటీన్ లో పడవేసినందుకు."
"నిద్రపోవటం రొటీన్. ఆకలేస్తే అన్నం తినటం రొటీన్. స్నానం చెయ్యటం రొటీన్. అయినా ఎప్పటికప్పుడు తాజాగా వాటిని ఎన్ జాయ్ చేస్తామే. తనివి తీరక ఇంకా ఇంకా కావాలని కోరుకుంటామే అలాంటప్పుడు మన ఆకలి తీరటం కోసం పడే కాస్తంత కష్టాన్ని రొటీన్ అని తేలిగ్గా తీసిపారేసి విసుక్కోవటం దేనికి?"
