దీన్ని అంతనితో తొడిగించుకో. మీ దాంపత్యం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. దాంపత్య సౌరభాలు మీ కుటుంబానికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి." ఎంతో దృఢ విశ్వాసంతో అన్నారాయన.
వారుణి మనస్సే కాదు కంఠం కూడా ఆర్ద్రమైపోయింది. చప్పున గొంతు పెగిలి రాలేదు.
"థాంక్యూ అంకుల్! థాంక్యూ మా జీవితంపై ఆయనకైనా లేని శ్రద్ధ మీకుంది" అనుకుంది. ఆ మాటలు పైకి అనలేకపోయింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లినాయ్.
"అవి ఆనంద భాష్పాలు కావాలి వరూ!"
ఆశీర్వదించినట్టుగా అన్నారాయన.
చప్పున వంగి ఆయన పాదాలకి నమస్కరించిందామె.
"సుఖ శాంతులతో జీవించు తల్లీ!"
ఆయన వెళ్ళిపోయారు.
శంకర రామారావుగారు వెళ్ళిపోయినా యింకా ఆయన మాటలే వారుణి చెవుల్లో రింగు మంటున్నాయి.
వారుణి అలాగే కూర్చుండిపోయింది.
21
ఆశా తరంగాల వెంట పరిగెత్తే మనిషికి అవి నిజజీవితంలో ఎండమావులే అవుతాయి. మనిషి ఒక్కోసారి తాను ఆశించిందాని వెనకపడి పరిగెత్తుతూ వుంటే అది యింకా దూర దూరంగానే వెళుతూ వుంటుంది.
మనం ఒక్కోసారి దేన్నయితే పరిహరించాలని శతవిధాలా ప్రయత్నిస్తూ వుంటామో అదే మనపాలిటి శనిగ్రహంలాగా తప్పనిసరిగా మన పాల బడుతుంది.
ఆ రోజు సరిగ్గా అదే జరిగింది.
కోపాన్ని నిగ్రహించుకోవాలనుకున్న సారధికి ఆ రాత్రి మళ్ళీ కోపం ఉవ్వెత్తుగా వచ్చేసింది. అదీ నిగ్రహాన్ని సంపూర్ణంగా కోల్పోయేంత కోపం వచ్చింది.
పరిస్థితులు అలా తీసుకుని వచ్చాయి.
లైబ్రరీ నుంచి యింటికి రాగానే సుబ్బరత్నమ్మగారు కొడుకుని పెరట్లోకి లాక్కెళ్ళినంత పనిచేసి ఘాటుగా తిట్టిపోసింది. వడగళ్ళ వానలా కురుస్తోన్న ఆమె తిట్లని అతను అడ్డుకోలేకపోయాడు.
బలహీనత_తల్లిని అడ్డుకోలేని బలహీనత. అతని కోపాగ్నికి మరింత ఇంధనమైంది. అటూ యిటూ ఎటూ తేల్చి మాటాడి సమర్ధించలేని అతని నిస్సహాయత అతన్ని మరీ కృంగదీసింది. అతని అహాన్ని యింకా రెచ్చగొట్టింది. కోపం మూడు రెట్లయింది.
"నేను కొడుకుని కన్నాననుకున్నాను కానీ వాజమ్మని కన్నాననుకోలేదురా! అలా అయితే నిన్నూ ఓ ఆడపిల్లగా మార్పించేసేదాన్ని. నీ భార్యకి ఎంత పొగర్రా?
నన్నూ మీ వదిన్నీ నిర్లక్ష్యంగా చూస్తుందా? ఏం చూసుకుని దానికా గర్వం? కాపురాని కొచ్చి నెల తిరగలేదు అప్పుడే అధార్టీలా?
ఏనాడైనా మనం పదమని కాకా హోటల్ కి టీకి పంపేమా? ఎవరో వచ్చారు. చొరవగా వంటింట్లో చొరబడి టిఫిన్ తీసుకెళ్ళి పెట్టింది, ఎంత స్వతంత్రం?
ఏం? నేను అత్తముండని అక్కడే చచ్చానే? నాతో ఒక మాట అనకూడదా? ఎవరో ఏమో ! వరూ, వరూ అంటూ కేకలు వేసుకుంటూ లోపలికొచ్చాడు. ఓ మంచా? మర్యాదా? ఏదీ తెలిసినట్టు లేదు. అయినా మనకేం అయినా వాళ్ళు బంధువులా? ఎవరో! ఈ చదువుకున్న అమ్మాయిలని ఎక్కడకని విశ్వసించటం?
కాఫీ ఇద్దామంది. లేదు_నేను తాగేశాను మళ్ళీ కలుపుదామంటే పాలు విరిగిపోయాయి లేవు. అందుకని పద్మని బయటికి పంపిస్తుందా? అదీ కాకా హోటల్ కి.. ఎంత పొగరు!
తను ఓ మహారాణి!
నేనూ_మీ వదిన_నీ చెల్లెలు తనకి బానిసలు. అవునా? అంతే కదూ దాని వుద్దేశ్యం?
