తిరిగి వస్తూన్నప్పుడు సుకుమార్ అన్నాడు. "సురేంద్ర చాలా మంచివాడు. నా శ్రేయోభిలాషి."
"మంచీ.... చెడూ" నాకు నవ్వొచ్చింది. మంచీ.... చెడూ, స్వార్థం.... త్యాగం, పుణ్యం.... పాపం.... ఈ కాన్సెప్టులనుండి మనిషి ఎందుకు బయటపడలేక పోతున్నాడు.
"అతని మంచితనమే అతనికి శత్రువయింది. ఎంతగానో ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య అతన్ని వొదిలి వెళ్ళిపోయింది."
"ప్రేమించి పెళ్ళి చేసుకోటం ఎంత సహజమో, ఒకరినొకరు ద్వేషించుకోటం కూడా అంతే సహజం."
అతన్లో ఉలికిపాటు తెలుస్తోంది.
* * *
రిజిస్టర్ మేరేజ్. ఆ ప్రయత్నాలన్నీ సుకుమార్ చూసుకుంటున్నాడు.
ఒకరోజు శమంతకమణి వచ్చింది.
కూచోమని "మీరు నన్ను మరిచిపోనందుకాశ్చర్యంగా ఉంది" అన్నాను.
"నీతో ఒకసారి పరిచయమైనాక ఎవరూ మరిచిపోలేరు. ఆడదయినా సరే, మగాడైనా సరే."
"ఈ నిజాన్నే అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నాను."
"అర్థం చేసుకోటం లేదు. చేసుకున్నట్లయితే అపూర్వమైన భవిష్యత్ ప్రసాదించటానికి నేను సిద్ధమై ఉండగా ఓ మామూలు మనిషిని పెళ్ళి చేసుకోబోతున్నావు."
"పెళ్ళి అనేది నా వ్యక్తిగత విషయం. ఉజ్వలమైన భవిష్యత్తుకి మీ నిర్వచనం వేరు. నా నిర్వచనం వేరు."
"నీ నిర్వచనం తప్పంటున్నాను."
"తప్పు అని మీరనుకునేది ఓ కాన్ సెప్ట్. దానికే సరైన నిర్వచనం లేనప్పుడు మీరెలా చెప్పగలరు?"
"అనుభవంతో."
"అనుభవం కాని దాన్ని అనుభవమనుకుంటూ జీవితాంతం గడిపేసిన వాళ్ళు, అనుభవం లేకుండా అదే జీవితమనుకుంటూ చివరికంటా గడిపేసిన వాళ్ళూ.... చాలామంది ఉన్నారు."
నువ్వింత అనుభవజ్ఞురాలిలా ఎలా మాట్లాడగలుగుతున్నావు?"
మీ కాంప్లిమెంటే నిజమైతే.... అది వయసిచ్చింది కాదు మనసిచ్చింది.
"మనసనేది అంత గొప్పదా?"
"అబ్బో! ఎంత గొప్పదో అంత అల్పమైనది కూడానూ."
* * *
కొన్ని నిమిషాలు నిశ్శబ్దం.
"ఈ పెళ్ళి జరక్కుండా ఆపు చేస్తే?"
"ఎలా చెయ్యగలరు?"
"నేను శమంతకమణిని. ఏమైనా చెయ్యగలను"
"అంటే?"
"నా దగ్గర ఎన్నో పదునైన ఆయుధాలున్నాయి. అవసరమనుకుంటే సుకుమార్ అనే మనిషిని ఈ భూమ్మీద లేకుండా చెయ్యగలను."
"దానివల్ల సాధించేదేముంది? భర్తను పోగొట్టుకున్న దాన్నవుతాను. కానీ మీకు లొంగను. మీ చేతిలో కీలుబొమ్మను కాను."
"చూద్దాం. నిన్నెలా లొంగదీసుకోవాలో, నా చేతిలో కీలుబొమ్మని చేసుకుని ఎలా ఆడించాలో నాకు తెలుసు."
"చూద్దాం."
శమంతకమణి విసురుగా లేచి వెళ్లిపోయింది.
18
మా పెళ్ళి జరిగిపోయింది. అరగంటలో సంతకాలూ, ఆ ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి బయటి కొచ్చాము.
సురేంద్ర రిసెప్షనివ్వటానికి ఏర్పాట్లు చెయ్యబోయాడు. నేను వారించాను.
"నాకు తెలిసిన వాళ్లు చాలా కొద్దిమందున్నారు. చాలామందికి నేను పరిచిత వ్యక్తిని. ఈ రిసెప్షనూ అదీ నాకు మొహమాటంగా ఉంటుంది."
సుకుమార్ కి కూడా ఎక్కువ పరిచయాలు లేవు. కొంచమాలోచించాక అతను కూడా వద్దన్నాడు. అంతటితో ఆ సమస్య ముగిసిపోయింది.
సురేంద్ర ఇంట్లో ఉన్న వెనకవైపు ఖాళీ స్థలంలో మూడు చిన్న చిన్న గదులతో ఉన్న గెస్ట్ హౌస్ ఉన్నది. బహుశా అతను స్నేహితులకిచ్చే బుల్లి బుల్లి పార్టీలకు ఆ గెస్ట్ హౌస్ ఉపయోగించుకునే వాడేమోననిపించింది. ఆ ఇల్లు మాకు ఉండటానికిచ్చాడు.
అందులోకి దిగేముందే పాతింట్లో సామాన్లు సర్దుతూంటే వైదేహి తల్లి వచ్చింది.
"ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా?"
సామాన్లు సర్దుతూనే తల ఊపాను.
"ఇప్పుడు ఖాళీ చెయ్యమనలేదుగా. అంత అవసరమేమొచ్చింది?"
పెళ్ళయినప్పట్నుంచీ సుకుమార్, నేనూ అందులోనే ఉంటున్నాము.
"మీ దృష్టిలో నేను మంచిదాన్ని కాదు. ఆఫ్ కోర్స్. నేననుకునే మంచీ, మీరనుకునే మంచీ వేరనుకోండి. మీకర్థం కావటం కోసం ఆ పదముపయోగిస్తున్నాను. ఇదే సుకుమార్ తో నేను ముందు ఈ ఇంట్లో పరిస్థితిని బట్టి ఒకటి రెండు రోజులు గడిపితే పతితనన్నారు. ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేదన్నారు. ఇప్పుడతను నా భర్త రూపం ధరించేసరికి పవిత్రురాల్నయ్యాను. మళ్ళీ మా యింటికి ఏ మగాడైనా అధికంగా వచ్చినట్లు కనబడితే అమాంతం అపవిత్రురాల్నయిపోతాను. పవిత్రత, అపవిత్రత.... వీటిని పనికిమాలిన శరీరాలకంటగట్టి, వాటిని పదే పదే స్మరించే మనుషుల మధ్య మసులుకోటం చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు. మమ్మల్నిక్కణ్ణించి వెళ్ళనివ్వండి."
నా ముఖంలోకి కళ్లప్పగించి చూస్తూ నిలబడింది.
