తండ్రికి ఆ మాటలన్నీ శూలాల్లా గుచ్చుకున్నాయి. చాలా బాధపడిపోతూ అన్నాడు___
"గూండాలు చెప్పిన కథలు వినొచ్చే వొరేయ్ జీవీ! నిజమేరా! నన్ను మించిన జాతకుడివవుతావనే భయం కొద్దీ నిన్ను వారిస్తున్నాను. నా జాతకంలో పాపాలెక్కువరా! అది మరిచిపోవద్దు. నిన్ను ఈపాడు రాజకీయాలవేపు తిప్పుకోడం నా తప్పే! చక్కగా బుద్ధి చెబుతున్నావ్! నా మనస్సాక్షిగా చెబుతున్నాను నాయనా!___ నీలాంటివాడు ప్రజల్ని తింటాడే తప్పించి పాలించలేడు. నిన్ను వక్రమార్గంలోనే పెంచాను. ఇప్పుడందుకు చాలా విచారిస్తున్నాను. తండ్రిగా నామీద నీకు గౌరవముంటే రాజకీయాల్నొదిలి బుద్ధిగా బతుకు. లేదూ, నీ ఖర్మ. అనుభవించు."
చిరంజీవి విసురుగా లేచి నించున్నాడు.
"చెప్పకింక నాన్నా! ఏ క్షణంలోనైనా నీ బుద్ధి మార్చుకుని నా పక్షం చేరతావని ఇన్నాళ్ళూ ఎదురుచూశాను. ఇంక లాభం లేదు. నిన్నెవడో మార్చేశాడు" స్వామెవడో నీకు మందుపెట్టాడు. నువ్వు స్వాముల్నాహ్వానించినప్పుడే అనుకున్నాను నువ్వీ పాడుపనులేవో తప్పకుండా చేస్తావని, లేకపోతే ఈ చికాకంతా ఏమిటి చెప్పు? వస్తా....మరోమాట నాన్నా? నీ డబ్బు పాడు చేస్తానని బెంగపడుతున్నావు కాబోలు, నీమీదొట్టేసి చెబుతున్నాను. నీ ఆస్తిలో పూచిక పుల్లయినా ముట్టను. చూస్తుండు. ఈ మెదడిచ్చిన బలంతో నీ పాపిష్ఠి ఆస్తికి రెండింతలు అయిదేళ్ళలో_నాకిచ్చే గడువులో, సంపాయించకపోతే నన్ను పేరుతో పిలవకు. ఇది నా ఛాలెంజ్ అనిగూడా హెచ్చరించి వెళుతున్నాను. వస్తా!" అని చెప్పేసి అతనక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
రామదాసు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
'ఈ తిమ్మాపురాన్నీ, ఈ దేశాన్నీ, ఈ ప్రజల్నీ ఈ రౌడీకి బలికాకుండా దేముడే రక్షించాలి. వీణ్ణి రౌడీగా తయారుచేసిన నన్ను ఆ దేముడే శిక్షించాలి, అనుకున్నాడాయన మనసారా!
* * * *
ఆ సాయంత్రం నుంచీ ప్రసాదం కోసం రామదాసు ఎదురుచూస్తూనే వున్నాడు.
రాత్రి ఎనిమిది దాటినా ప్రసాదం రాకపోవడంతో రామదాసుకి ఎదురుచూడటంలో విసుక్కలిగింది. ఆనాడు, అర్థరాత్రివరకూ ప్రసాదం కొరకు ఎదురుచూస్తూనే గడిపేడాయన.
ప్రసాదం రానేలేదు.
రాత్రంతా ఆయన నిద్రపోనేలేదు. తెల్లవారుతూనే ప్రసాదం గదికి వెళ్ళాడు. ఆ గదికి తాళం వేసివుంది. ఆయనక్కడ తచ్చాడుతూ కాసేపు గడిపేడు.
ఆ యింటివాళ్ళు అడిగేరు.
"ఎవరికోసమండి? ప్రసాదం కొరకేనా?"
రామదాసు తలూపేడు.
"నిన్న సాయంత్రమే వెళ్ళిపోయాడు. వాళ్ళక్కయ్యకి సీరియస్ గా వుందని కబురొచ్చింది."
రామదాసు అక్కడింక నిలబడలేకపోయాడు. ఇంటికొచ్చి కూచున్నాడేగాని అక్కడా ఉండలేకపోయాడు. సీత చివరి మాటలన్నీ గుర్తుకొచ్చాయి.
చివరి క్షణాల్లో కలుసుకుందామన్నది సీత!
సీతకి ముంచుకొచ్చిందని ప్రసాదానికి కబురొచ్చింది. అంతా పూర్తిగాక మునుపే వెళ్ళాలి. తప్పనిసరిగా వెళ్ళి తీరాలి.
ఆయన వెంటనే బస్టాండుకొచ్చి, సిరిపల్లె వెళ్ళే బస్సెక్కారు. ఆ బస్సు సిరిపల్లె చేరేసరికి అంతా అయిపోయింది.
ఆ ఇంట్లో ప్రసాదం సీత శవం ముందు కూచున్నాడు. అతనెప్పట్నుంచి ఏడుస్తున్నాడో గాని, మనిషంతా నలిగిపోయి వున్నాడు. రవి భుజాలమీద వాలిపోయి వున్నాడతను, అక్కడ మరికొంతమంది మనుషులూ ఉన్నారు. వాళ్ళందరూ ప్రసాదాన్ని ఓదార్చే ప్రయత్నంలో ఉన్నారు.
రామదాసుని వాళ్ళందరూ చూశారు. కాని, ఆ పెద్దమనిషి అక్కడికెందుకు వచ్చివుంటాడో అర్థం చేసుకోలేకపోయారు. రామదాసు తిన్నగా శవం దగ్గిరికి వెళ్ళాడు. ప్రసాదం ప్రక్కన కూర్చుని, ప్రసాదం భుజమ్మీద చేయి వేశాడు.
"మా అక్క సార్!....సీతక్క" అన్నాడు ప్రసాదం.
"చూస్తున్నాను నాయనా, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తూనే వున్నాను" అన్నాడు రామదాసు.
"నాకు అమ్మా, నాన్నా, అన్నా, అక్క అన్నీ ఈ సీతక్కే సార్! కష్టాలన్నీ నాకోసం అనుభవించి....నా వల్ల సుఖపడేరోజు వస్తుండగా కన్ను మూసిండ్. నా చేతులు సార్....ఈ చేతులు పుణ్యం చేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాయి సార్! అంతా అయిపోయిందండి దాసుగారు!" అన్నాడతను గాద్గదికంగా.
రామదాసు కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
"సీతా! మనం మనమాట నిలబెట్టుకోలేకపోయాం సీతా!.... నువ్వన్నట్టు చివరి క్షణాల్లో గాకుండా అంతా అయిపోయిం తర్వాత కాళ్ళీడ్చుకుంటూ వచ్చారు సీతా!" అనుకున్నారాయన.
ప్రసాదం రామదాసు వేపు చూశాడు.
ఆశ్చర్యం! ఆయనేడుస్తున్నారెందుకు?
"సార్! నన్ను ఓదార్చడానికి వచ్చి మీరెందుకు సార్ ఏడుస్తారు?!" అన్నాడు ప్రసాదం.
కన్నీరుబికి వస్తున్నా నవ్వగలిగాడు పేలవంగా రామదాసు.
