Previous Page
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 48


    'సీతా! నేనెందుకేడుస్తున్నానని ప్రసాదం అడుగుతున్నాడు. చెప్పేదా సీతా మన రహస్యం? మూడోవాడికి తెలీకూడదన్నావ్. మూడోవాడు ప్రసాదం అయ్యాడిప్పుడు. చెప్పేదా?.... "నాయనా ప్రసాదం, నీకు సీత అక్క కాదు. నిన్ను కన్నతల్లి! నవ మాసాలూ మోసి నిన్ను కన్నతల్లి బాబూ! ఇదిగో నేను....నేను నీ తండ్రిని. నేను నీ తండ్రిని. భగ్న ప్రేమికురాలిగానే సీత నీకు తెలుసు. నిన్ను కన్నతల్లిగా నీకు తెలీకుండా జాగ్రత్తపడింది సీత. నేచేసిన కిరాతకం తెలిసిన తర్వాత సీత తల్లితండ్రులు ఎప్పుడో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంత గొప్ప కిరాతకం నాది. కాని, సీత అప్పట్లో చావలేదు. నీకోసం బ్రతికింది నాయనా! సొంత వూరు వదిలి అక్కడికి కొన్ని వందల మైళ్ళ దూరం పారిపోయి అక్కడ నిన్ను కన్నది. తన తల్లితండ్రుల్ని నీ తల్లి తండ్రులుగా చెప్పి నీకు నీ తల్లి అక్కగా కుదిరింది. అక్కగానే నిన్ను పెంచింది. నిన్ను గౌరవంగా పెంచుదామనీ, నీ పుట్టుక పట్ల నీకు అసహ్యం కలగరాదనీ అలా పెంచింది నిన్ను. సదాశయంతో, మనోధైర్యంతో నిన్ను పెంచి పెద్ద చేసి కన్ను మూసింది. నీ తల్లి చరిత్ర మంచిది. నీ తల్లి ఆశయం మంచిది. నీ తల్లి మరణమూ మంచిదే! కాని, బాబూ! ఈ రహస్యాన్ని, నేచేసిన కిరాతకాన్నీ ఈ గుండెల్లో దాచుకుంటూ బతికి చచ్చిన మనిషిన్నేను. నీ తండ్రిని. నేను మిగిలాను' అని చెప్పేదా సీతా! మన కథంతా చెప్పేదా?'
    గుండె పట్టుకుని రామదాసు పక్కకి ఒరిగిపోతుండగా ప్రసాదం ఆయన్ని పట్టుకుంటూ అన్నాడు___
    "సార్! అయ్యో ఏమిటిది? మీకేం జరిగింది?"
    ఈ విడ్డూరం యావత్తూ కళ్ళారా చూచిన మనుషులు ఏమిటో అనుకున్నాం. దాసుగారిది జాలి గుండె! ఆ గుండెకి షాక్ తగిలిందని మాత్రం అనుకున్నారు.
    రామదాసు తయారుచేసుకున్న పాపం కథ ఇక్కడితో పూర్తయింది.
    
                                 *    *    *    *

    "అంటే? కథ పూర్తయిందా?"
    "కథ కాదు నవల!"
    "అదే! పూర్తయిందా అంటున్నాను."
    "ఆ. పూర్తయింది. ఎలా వుంది?"
    "ఏమిటీ? పూర్తయిందా?"
    "ఆశ్చర్యమెందుకు?"
    "కథని___"
    "కథ కాదు నవల!"
    "అదే నవలని కావాలని ఆపి పూర్తయిందంటే ఆశ్చర్యంగానే వుంది మరి!"
    "కావాలని ఆపలేదు. పూర్తయిందని ఆపేను."
    "నేన్నమ్మను. ప్రసాదానికి తండ్రెవరో ఇప్పటికొచ్చి తెలీదు. పోనీ, ఆ రహస్యం ఈ రామదాసు ఎప్పటికైనా చెబుతాడా? చెప్పడా? అవతల ఆ చిరంజీవి తన భార్య సుమతిని ప్రేమగా చూడగలడా? లేదా? ఆ సంసారం మూడు పూలూ ఆరు కాయలుగా వర్ధిల్లుతోందా? లేదా? ఆపైన_ చిరంజీవి రాజకీయాలేవిఁటి? అతనెందర్ని పొట్టనపెట్టుకున్నాడు? అతనివల్ల తిమ్మాపురానికీ, దేశానికీ కలిగిన నష్టమేవిఁటి? ఇవన్నీ అటుంచి___అయ్యో లేచి వెళ్ళిపోతావేమిటి చోద్యం? కొంచెమాగు కథా _ అదె _ నవలా రచయితా! ఆగక్కడ. నా అనుమానాలు పూర్తిచేసి వెళ్ళు. ఇదిగో నిన్నే___"

                                      * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS