Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 46


    'వర్ధిల్లు బాబూ! మీ అమ్మ కడుపు చల్లగా వెయ్యేళ్ళు వర్థిల్లు!' అనుకున్నాడు వెళ్ళిపోతూ.

                                                                          15

    పూల మొక్కలికి నీళ్ళు పోయడం ముగించి, తన మేడవేపు చూశారు రామదాసు.
    ఆ మేడ ముందు చాలా కారులున్నాయి. గుండె గుభేలుమన్నది రామదాసుకి.
    మరో తరం కథ అప్పుడే ప్రారంభమైందని తెలుసుకున్న ఆయన విచారించాడు.
    "చిరంజీవి నా చేయిదాటిపోయాడు. వాడిని పాడుచేసింది నేను. నేనే పాడు చేశాను. ఈ తిమ్మాపురానికి మరో రామదాసు అప్పుడే వెలిసి సిద్ధంగా వున్నాడు. కారులొచ్చేశాయి. కారుల్లో నుంచి నక్కలూ, పులులూ, సింహాలు దిగేయి. ఇవి మనిషిని ప్రశాంతంగా బ్రతనివ్వవు. చిరంజీవి చుట్టూరా వీళ్ళు కాళ్ళరిగేలా తిరిగి, తిరిగి వాడిని మోసంచేసి తదుపరి వీళ్ళు మోసగింపబడతారు. కథ మళ్ళా ప్రారంభింపబడింది. ఈ కథకి ఇంతలో ముగింపు రాదు. ఈ కారుల్లో వచ్చిన మనుషులు ఈ కథని ఆశ్రయించుకు బతికే జాతివాళ్ళు. వీళ్ళందరికీ చాలా గట్టి వ్యాపారాలూ, వ్యాపకాలూ ఉన్నాయి. అవి భద్రంగా ఉండి, పదికాలాలపాటు వర్ధిల్లాలంటే 'శాసనాల' సహకారం ఎంతైనా అవసరం! 'శాసనాలు' తయారుచేసే వ్యక్తి తమ చేతిలోని వాడైతే యింకా అంతకంటే వేరే వరం ఏముంటుంది. అందుకే ఈ వేట! చిరంజీవిని వీళ్ళు బతకనివ్వరింక! చేటుకాలం సమీపించేసింది!"
    కారులన్నీ వెళ్ళిపోయిం తర్వాత చిరంజీవి వచ్చాడు! అతనొచ్చేసరికి రామదాసు ఫేము కుర్చీమీద కూచుని పేపరు చదువుకుంటున్నాడు.
    తండ్రి ముందు నించున్న చిరంజీవి_ ఎక్కువసేపు నుంచునే ఓపిక లేక___
    "కూర్చోనా?" అన్నాడు.
    తండ్రి తలూపాడు. కొడుకు మరో కుర్చీలో కూర్చున్నాడు.
    "కారులొచ్చేయి. చౌదరీ, నాయుడూ, రెడ్డి, పంతులూ యింకా చాలామంది పెద్దలొచ్చారు," అన్నాడు కొడుకు జనాంతికంగా.
    "చూశాను." అన్నాడు రామదాసు.
    "నువ్వూ వస్తావనుకున్నా నాన్నా!"
    "ఆ మేడకింక రానురా!"
    చిరంజీవి మనస్సు చివుక్కుమన్నది.
    "ఇక్కడేం తోస్తుంది నీకు?" అన్నాడు.
    కొడుకువేపు చిత్రంగా చూశారు రామదాసు. ఆపైన ఆ పూలతోటనంతా కలియజూశారు. చల్లటి గాలికి వారి పల్చటి దుస్తులు రెపరెప లాడటవూఁ గమనించారు. పూలమొక్కలనుంచి వచ్చే సుగంధ పరిమళాన్ని గుండెల్నిండా పీల్చుకొని చాలా ప్రశాంతంగా అన్నారు.
    "ఇక్కడ నాకు తోచకపోవడమా? ఇక్కడింత ఆనందాన్ని వదులుకుని నేనా మేడ దగ్గరికి ఎలా రానురా అబ్బీ. ఈ పూలమొక్కలూ, అందమైన క్రోటన్సూ, చల్లటి సాయంత్రమూ, మనసుకి హాయిగా ఇంత గాలీ_ఇన్నింటిని వదిలేసి ఎలా రమ్మంటావ్ చెప్పు? ఇన్నేళ్లూ నేను ఆ మేడలో సుఖపడ్డానని భ్రమించానే గానొరేయ్, సుఖమంతా ఇదిగో ఇక్కడీ ఆరుబయట ప్రశాంత వాతావరణంలోనే ఉందిరా జీవీ! ఇక్కడే ఉంది నిజమైన సుఖం, శాంతీని!"
    కొడుకు మొహం చిట్లించుకున్నాడు. చెప్పవలసిందేదో టూకీగా చెప్పదలుచుకుని ప్రారంభించాడు.
    "వచ్చే ఎన్నికల్లో మన నియోజకవర్గం నుంచి నన్ను పోటీ చేయమంటున్నారు ఈ పెద్దలు?"
    "ఎప్పుడో ఏడాదికి వచ్చిపడే ఎన్నికల ఇంజక్షన్లు ఇప్పట్నుంచే ఇస్తున్నారన్నమాట పెద్దలు" అన్నారాయన.
    "నేను వాళ్ళ కోరికను కాదనలేకపోయాను. పోటీ చేస్తానని మాటిచ్చేను?"
    "అలాగా!"
    "అలాగా అని చప్పరించేస్తే ఎలా నాన్నా? నీ సలహా ఏమిటో చెప్పరాదూ?"
    "చెబితే నువ్వు వింటావా? వాళ్లు నిన్ను విననిస్తారా? ఎందుకొచ్చిన మాటలు గానొరేయ్ జీవీ! ఈ వచ్చిన వాళ్ళంతా ఎవర్రా! ఒకప్పుడు నా చేతికింద బతికిన మనుషులేగా? ఇవాళ నన్నొదిలి నిన్ను పట్టుకు తింటున్నార్రా నాయనా! నీ మేడకొచ్చి వెళ్ళేరేగాని అక్కడికి వందడుగులు దూరంలో బతుకుతున్న నన్ను పలుకరించారా? వీళ్ళనెవర్నీ నమ్మనొరేయ్. మొన్నటివరకూ నేను, ఇవాళ నువ్వు, రేపు మరో చెవలాయ్ _ ఇలా మనుషుల కోసం వేటాడే ఈ గుంట నక్కల్ని దూరంగా వుంచడం ఎంతయినా మంచిది! వప్పుకుంటావా?"
    కొడుకుకి కోపం వచ్చేసింది____
    "ఇంతకీ నేను పోటీ చేయటం నీకిష్టమా కాదా?" అన్నాడతను.
    "నిజం చెప్పాలంటే నాకిష్టం లేదు."    
    "ఎందుచేత?"
    "మనలాంటివాళ్లు ఎన్నికల్లో పోటీచేయడం మహాపాపం!"
    "మరి నువ్విన్నాళ్ళూ చేసింది?"
    "మహాపాపమే!"
    "ఎందుకొచ్చిన మాటలివి నాన్నా! నిజమొక్కటి చెప్పు చాలు! నీకు నా పట్ల అసూయ అని చెప్పరాదూ, గొడవేఁ ఉండదు. రాజకీయంలో నువ్వు అనుభవించవలసినదంతా అనుభవించేసి ఇవాళ నా వంతు వచ్చేసరికి మహాపాపమంటూ నీతులు చెబుతావెందుకు? నేనూ రాజకీయాన్ని అనుభవించాలి. ప్రజల్ని ఏలాలి! ఏ మంత్రినో అయితేనేగాని నాకు తృప్తి వుండదు. అన్నేళ్ళూ నన్ను ఉత్సాహపరిచి, సరిగ్గా సమయం చేతికి వచ్చిం తర్వాత, ఇప్పుడు నన్ను నీతిగా బతకమని సలహా ఇస్తున్నావంటే ఇది అసూయ కాదూ? గుర్తుందా నాన్నా!_ నువ్వెక్కిన సింహాసనం నాకిస్తానని మునుపు మాటిచ్చావ్, జ్ఞాపకం ఉందా? నేను నోరుజారి రాజకీయాన్ని తిట్టినప్పుడు నా కళ్ళు పోతాయని కోప్పడ్డావ్. మరిచిపోయావా? ఇంతచేసి ఇవాళ ప్లేటుమార్చావంటే అసూయ కాక మరేమవుతుంది? ఎలాగైతేనేం_పాపిష్ఠి డబ్బు నువ్వే సంపాయించావనే గర్వంతో దాన్ని అడ్డంపెట్టుకుని నా నోరుమూసి నా పెళ్ళి చేశావ్. ఆస్తినంతా సుమతికి దానంచేసి నా చేతులకి సంకెళ్ళు వేశావ్. నీ ఆస్తిని నా యిష్ట మొచ్చినట్టు ఖర్చు చేసేందుకు. తగనా నేను? ఆ డబ్బు నా చేతిలో ఉంటే, చక్రం తిప్పేస్తానని నీ భయం కదూ? చక్రం తిప్పి నిన్ను మించిన జాతకుడినవుతానని అసూయకదూ? అవునా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS