Previous Page Next Page 
రాగోదయం పేజి 47


    తలొంచుకుని అవునన్నాడు వాడు.
    "మరింకేం! రాత్రి తోటలో చౌదరి పంపుసెట్టు ఎవరో ఎత్తుకెళ్ళారు. దాని ఖరీదు నాలుగువేలదాకా వుంటుంది. కావిలికి ఒప్పుకుని లేకపోవటం తప్పుక్ కాదా? వెళ్ళుంటే ఆ దొంగతనం జరిగేదా? పోనీ పోవటానికి కుదర్దని వుంటే ఇంకెవర్నయినా పంపుకునేవాడు. ఇది నమ్మకద్రోహం కదా? ఇప్పుడు నష్టం ఎవరికి? చౌదరి నష్టానికి బాధ్యులెవరు, సోమన్నేకదా? పంచాయితీ పెట్టాం. మీరు నేరం ఒప్పుకున్నారు! కాబట్టి పంపుసెట్టు ఖరీదు కట్టి యివ్వాలి_అంతే!" ఏకబిగిని తీర్పు చెప్పాడు శేషయ్య.
    హాహాకారాలు చేశారు చంద్రయ్య జానయ్యలు.
    "మోసం! మోసం! కెవ్వున అరిచింది చంద్రమ్మ.
    "అన్యాయం! అన్యాయం! అన్నాడు జానయ్య.
    "జానయ్యా! చంద్రమ్మ! ఇప్పుడరిచి లాభం లేదు. తప్పు నీ కొడుకుది శాంతంగా అన్నాడు కరణం.
    "అట్టనక యింకెట్టా అంటావులే? మీరూ మీరూ ఒకటి. మమ్మల్ని జలగలు పీక్కుతిన్నట్టు తినాలనుకుంటున్నారు."
    అది బలహీనుడి చివరి కేక. అందులో ధైర్యం లేదు. అందులో ఆవేశం లేదు. దీనత్వం తమ దుస్థితికి ఏడ్పూ వుంది.
    క్రమంగా లొంగిపోతున్నారని అందరికీ తెల్సింది.
    "మరిప్పుడేం చేయాలి? మూడు నాలుగు వేలు సొమ్మాయె!"
    హాహాకారం చేసింది చంద్రమ్మ. ఆమెకి భూమి అడ్డంగా తిరుగుతున్నట్టుగా అనిపించింది.
    "ఎట్లా తీరుస్తారు?"
    "బాండు రాసిస్తా" చప్పున అన్నాడు సోము.
    ఎద్దేవాగా నవ్వాడు చౌదరి. "ఎందుకు నాలిగ్గీసుకోవాలా ఏం జెయ్యను? దాఖలు చేసినా కోర్టు ఖర్చు దండగ అంతేనా?
    నరాల్లో రక్తం చివ్వున ఉరకలెత్తింది. అయినా సోము నోరు జారలేదు.
    "సొమ్ము నీ ఎదాన కొట్టానికి యాడుంది. పోయేలోగా తీర్చేపోతాంలే! కసిగా అంది చంద్రమ్మ.
    "ఇప్పుడే వెయ్యికి అయిదు నూర్లిస్తానని పైసా చెల్లు బెట్టలా నీ కొడుకు, ఇప్పుడికి బాండు రాసిస్తే అది కుంకం పోసుకునేందుకే చెల్లేది?"
    "ఇంకా బాకీనా?" తెల్లబోయిందామె.
    "మొగముంది. అద్దముంది నన్నెందు కడుగుతావ్, నీ కొడుకునే అడుగు" కొడుకువైపు చూసిందామె. తలూపేడు వాడు.
    "అయితే ఏం చేయాలంటావ్?"
    "నా అప్పు తీర్చండి!"
    "ఎట్టా తీర్చాలా?"
    అదీ నేనే చెప్పాలా? కొట్టినోడే కాపడం పెట్టినట్టు. సరే! మీ మాగాణి పొలం వుండ్లా. అది అమ్మెయ్యండి. నా అప్పు రద్దు చేస్తా.
    "ఒరె దుర్మార్గుడా!" అప్రయత్నంగా అనేసింది.
    "చంద్రమ్మా!" గద్దించాడు కరణం.
    "తప్పయిపోయిందయ్యా తప్పైపోయింది. అసలు మా పుటకలే ఎదవ పుటకలు. నెయ్యున్న చోట నూనె వుండాలని మమ్మల్ని మీలాంటి వాళ్ళున్న చోట పుట్టించిండు దేవుడు. సర్లే! అది మీకేం అర్థమైతాది. ఇదిగో నయ్యా! నీ కొడుకు చేసిన నిర్వాకానికి మన తాత ముత్తాతల ఆస్తి తెగ్గొయ్. కాయితం రాయిచ్చిరా! ఎందుకు? రిజిట్టరాపీసుకు నేరుగా యిప్పుడే ఎల్లండి. వాడి ముఖాన కాలబెట్టి రండి?" గొల్లుమంటూ వెళ్లిపోయింది చంద్రమ్మ.
    "పాపం బాధగానే వుంటుంది." అన్నాడు నాయుడు.
    ఎవరేం మాటాళ్ళేదు.
    "ఏం జానయ్యా ఆఫీసు కెళదామా" అడిగాడు కరణం.
    పెద్దకొడుకు తలకి కొరివి పెట్టబోయే తండ్రిలా తలూపేడు జానయ్య.
    మరి కాస్సేపటికి రిజిష్టరాఫీసు వున్న దగ్గరి వూరికి పయనమై వెళ్ళాడు చౌదరి కరణం జానయ్య, సోము, జయన్న.
    

                                           22


    ఆ సంఘటన జరిగిన మరుజోజే ఆర్. ఐ. ఎంక్వయిరీకి వచ్చాడు బంజరు భూముల పట్టాల గురించి. రికార్డెడ్ సాక్ష్యం లేకపోవటంతో జానయ్యని సోముని, తెగతిట్టి వాళ్ళతో స్టేట్ మెంట్స్ తీసుకుని వెళ్ళిపోయారు. మునసబుకి చాలా ఖర్చు అయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS