వారుణి ఏమీ అనలేకపోయింది.
"కానీ వారుణీ! గులాబీకి ముళ్లుంటాయని తెలుసుకున్నాను" కూలిపోతోన్న కుటుంబ వ్యవస్థని చూసి ఆక్రోశంతో అంటున్న మాటలవి.
ఆ మాటలు వారుణి గుండెల్ని చీల్చేయి.
"వస్తానమ్మా!" బరువెక్కిన గుండెతో అన్నారాయన.
"అదేమిటంకుల్!" నివ్వెరపోయినట్టుగా అయిన వారుణి అంది" అదేమిటంకుల్_అవి తీసుకోనేలేదు ప్లీజ్! మీరలా వెళ్ళిపోకండి! నేను సమరం సాగిస్తున్నాను. ఈ యింటిని మార్చాలి. కనీసం నా మనిషిని మార్చుకోవాలి. నాకు ఆ ఆత్మస్థయిర్యం యివ్వండి. ప్లీజ్_" అర్ధింపుగా అంది.
ఆ కంఠంలో ఆరాటం, ఉద్వేగం గమనించారాయన. కొత్త మార్గాన్ని నవ్యతని కోరే వ్యక్తులు నిజ జీవితంలో ఎన్నేసి ఎంతలేసి కష్టనష్టాలకి గురవుతారో ఆయనకి ప్రత్యక్షంగా కనిపించినట్టయింది.
వెన్నెల పల్లకీ ఎక్కి విహాయస వీధుల్లో సంచరించటానికి వచ్చిన లక్ష్మీదేవిలా వుండేది వారుణి. వీణాపాణి తన విద్యత్తుని ప్రజలకి ప్రత్యక్షంగా చూపేందుకు జన్మించినట్టుగా వుండేది. ఆమె ఒకానొక అచ్చెర మచ్చెకంటి ప్రేమవశాత్తూ భూలోకానికి దిగివచ్చినట్టుగా వుండేది సరస్వతీదేవి భర్త ప్రేమని తన వీణపై శృతివేయంగా వినిపిస్తే విధి ఆ రాగ భావనకి ఒక రూపం కల్పించినట్టుగా వుండేది.
అలాంటి వారుణి_?
నిట్టూర్చారాయన.
మౌనంగా టిఫిన్ ముగించారు.
కాఫీకోసం లోపలికి వెళ్ళింది వారుణి.
ఫ్లాస్కులో కాఫీ లేదు.
అదోలా చూసింది సావిత్రి వైపు.
ఆమె ముఖం తిప్పుకుంది.
"కాఫీ లేదా?"
"అత్తగారు తాగేసింది."
"అక్కయ్యా! అంకుల్ కి కాఫీ కలిపి యివ్వాలి" పొడిగా అంది వారుణి.
"పాలు అయిపోయాయి." ఇటుఐపు చూడనైనా చూళ్ళేదు సావిత్రి. ఏదో చెప్పాలన్నట్టుగా జవాబు చెప్పింది.
"ఏమ్మనుషులు?" అనుకుంది వారుణి.
ఫ్లాస్కు తీసుకొని గబగబా పెరటివైపు వెళ్ళింది. అక్కడ పెరట్లో కూచుని ఏదో చదువుకుంటోంది పద్మ. ఆమెని చూడగానే వారుణికి ప్రాణం లేచివచ్చినట్లయింది.
"పద్మా! ప్లీజ్! ఒక్కసారి అలా వెళ్ళి ఓ టీ పట్రావాలి. ప్లీజ్!" అంది అర్దింపుగా.
"ఈ మాత్రం దానికి యింతగా ప్రాధేయపడాలా వదినా! సేవింపులేగాని సేవించుటెరుగని శ్రీలక్ష్మిలాంటి దానివి నువ్వు. నువ్వు అర్ధిస్తే కాదంటానా?" అని వెళ్ళిపోయింది. పద్మకి డబ్బిచ్చి తిరిగి యింట్లోకి వచ్చింది వారుణి.
మరో పదినిమిషాల తర్వాత వారుణి యిచ్చిన టీ తాగేసి వెళ్ళిపోయారాయన. వెళుతూ వెళుతూ వారుణి చేతిలో ఓ కానుక పెట్టారాయన.
"వారూ!"
నీ పెళ్ళికి నేను రాలేకపోయాను. రైడింగ్స్ కి వెళ్ళేను. ఎక్కడికి వెళ్ళిందీ మీ ఆంటీకి కూడా తెలీదు. అందుకే నీ పెళ్ళి విషయం నాకు తెలియజేయలేకపోయింది. నేను రాలేకపోయాను. అందుకే యిది నా చిరుకానుక."
ఆమె పెట్టె తెరిచి చూసింది.
డైమండ్ రింగ్! మేలిమి బంగారంలో అందంగా పొదగబడిన శనగ గింజంత డిమాండ్! తళతళా కాంతులు విరజల్లుతోంది.
"థాంక్స్ అంకుల్!"
"నాకు కొంచెం గ్రహాల పిచ్చి వుంది. నీకూ ఆ విషయం తెలుసు. నాకు నీ జాతకం తెలుసుగా. అందుకే యీ డైమండ్ రింగ్ తెచ్చాను. ఇప్పుడు నీకు జరుగుతున్నది శుక్ర దశ. అందులో రవి అంతర్దశ. అంతేకాదు నీ జాతకంలో యిప్పుడు శుక్రుడు బలహీనపడ్డాడు. అందుకే యీ వజ్రపుటుంగరం తెచ్చాను.
దీన్ని నీ భర్తతో వేలికి తొడిగించుకో. అసలు నేనే దీన్ని అతని చేతికిచ్చి దగ్గరుండి స్వయంగా తొడిగించాలనుకుని వచ్చాను. కానీ వుండలేకపోతున్నాను. అది వేరే విషయం. ఇట్సాల్ రైట్.
