రకరకాల వ్యాకులపాటులో, భావాలతో, జాలితో మనసు బరువెక్కి మళ్ళీ కనురెప్పలు మూతలు పడిపోయినాయి.
* * *
తలుపు లెవరో దబదబ బాదుతూంటే మెలకువ వచ్చింది. అదే సమయానికి సుకుమార్ కూడా ఉలికిపాటుతో లేవటం కనిపించింది.
ఇద్దరం క్షణంపాటు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నాం.
తర్వాత వెళ్ళి తలుపు తీశాను.
వైదేహి తల్లీ, ఆమె భర్తా ఇంకా ఇద్దరు ముగ్గురు నిలబడి వున్నారు.
ప్రపంచంలో మూర్తీభవించిన నీతికి ప్రతీకల్లా కనిపించారు.
నిన్నగాక మొన్ననే కూతురు నిప్పంటించుకుని మరణించినా ఆమెలో కొంచెమైనా కాఠిన్యం తగ్గినట్లనిపించలేదు.
"నీ సంగతి కొన్నాళ్ళుగా గమనిస్తున్నాను. పోన్లే పోన్లే అని సరిపెట్టుకుంటూంటే రోజురోజుకీ రెచ్చిపోతున్నావు. ఇది సంసారుల కొంప. అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి పడుకోపెట్టుకోటానికి వీల్లేదు.
అవకాశం దొరికింది కదా అని విజృంభించటానికి సిద్ధపడుతోంది.
కొన్ని కొన్ని నిర్ణయాలు నిద్దట్లో తీసుకోబడతాయి. రాత్రి నా విషయంలోనూ అంతే జరిగింది.
"పిచ్చి పిచ్చిగా వాగకండి. ఆయనెవరనుకున్నారు? నా భర్త" అన్నాను.
అక్కడున్న వారందరితో బాటు సుకుమార్ కూడా అప్రతిభుడవటం తెలుస్తోంది.
17
అంతకు కొన్ని గంటల ముందు అలా మాట్లాడి హఠాత్తుగా నా నిర్ణయం ప్రకటించినందుకు సుకుమార్ అప్రతిభుడైపోయి ఉంటాడు.
గుమిగూడిన వాళ్ళందరూ ఏదేదో గొణుక్కుంటూ వెళ్ళిపోయారు.
సుకుమార్, నేనూ మిగిలిపోయాం.
కొంతసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది.
"థాంక్యూ సతీ!" అన్నాడు సుకుమార్ నెమ్మదిగా. అతని గొంతులో ఆనందతరంగాలు ధ్వనిస్తున్నాయి.
* * *
"ఇప్పుడు మనం సురేంద్ర దగ్గరకు వెడుతున్నాం" అన్నాడు సుకుమార్.
"అతనెవరు?"
"నా ప్రాణస్నేహితుడు."
"నీకంత మంచి స్నేహితుడున్నాడని చెప్పలేదేం?"
"సమయమేదీ? మనిద్దరం కలుసుకున్నది చాలా తక్కువ సార్లు. వాడి విలువ అనంతమనుకో. ఆ కాసినిసార్లూ మన గురించి మనం అధ్యయనం చేసుకోటంతోనే సరిపోయింది. ఇతరుల గురించి మాట్లాడటానికి అవకాశమెక్కడ?"
నవ్వాను.
"మన గురించి మనం అధ్యయనం" ఇది మానవ చరిత్రలో సంభవమేనా?
మేము వెళ్ళేసరికి సురేంద్ర ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. మమ్మల్ని చూసి చిరునవ్వుతో లేచి నిలబడి చాలా ఆదరంగా ఆహ్వానించాడు.
అప్రయత్నంగా అతని ముఖంలోకి పరిశీలనగా చూశాను. సుకుమార్ కన్నా రెండు మూడేళ్ళ వయసు ఎక్కువుంటుంది. పైజమా, లాల్చీ వేసుకున్నాడు. అందగాడే.
"మీ గురించి సుకుమార్ చాలా చెప్పాడు" అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ.
ఆ కళ్ళు....
అందులో ఆలోచించాల్సిందేమీ లేదు. కాని ఎందుకనో ఉలిక్కిపడ్డాను.
కళ్ళు.... ఎన్ని చరిత్రలు చెబుతాయి!
పలకరింపుగా నవ్వితే నవ్వుతోనే జవాబిచ్చేశాను.
ఇంట్లో అతను ఒక్కడే ఉన్నట్లు కనిపించాడు. భార్య లేదా? పెళ్ళి కాలేదా?
నా అభిప్రాయం గ్రహించినట్లు "నాకు పెళ్ళయింది. ప్రస్తుతం తనిక్కడ లేదు" అన్నాడు.
పండితుడి దగ్గర్నుంచీ పామరుడి దాకా ప్రతి మనిషికీ ఓ కథ ఉంటుంది. ఇతని కథ ఇతన్దీ అనుకున్నాను.
ఆ ఇల్లు చాలా విశాలంగా ఉంది. పద్ధతీ అదీ చూస్తే అతను పుష్కలంగా ఉన్నవాడిలానే కనిపించాడు. ఈ ఉండటం ఉండకపోవడం మధ్య తేడా, ఆర్ధిక వ్యత్యాసాల్లోని గజిబిజిలు నాకు తర్వాత తర్వాత తెలిసింది.
అతను కేకేస్తే లోపల్నుంచి వంటచేసే మనిషిలా ఉన్న ఒకతను వచ్చాడు. చెప్పిన ప్రకారం ముగ్గురికీ కాఫీ తీసుకొచ్చాడు.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను మౌనంగా కూర్చుని ఉన్నాను.
వాళ్ళ మాటల్ని బట్టి నాకు కొన్ని సంగతులర్థమవుతున్నాయి. మా ఇద్దరి పెళ్ళి గురించీ తెలిసిన శమంతకమణి సుకుమార్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోంది. ఆమె విముఖత్వం భరించలేక అతనుద్యోగం మానుకున్నాడు. ఇప్పుడు వేరే ఉద్యోగం చూసుకోవాలి. శమంతకమణి అండదండలు లేకపోవటంతో అతను వొంటరివాడయ్యాడు. మా పెళ్ళికి కూడా ఆమె అంతరాయం కలిగించే అవకాశముంది.
అందుకే సురేంద్ర సాయం తీసుకుంటున్నాడు. సురేంద్ర అతనికన్ని విధాలా సాయపడటానికి సిద్ధంగా ఉన్నాడు.
వాళ్ళ సంభాషణలో నేనేమీ కల్పించుకోలేదు.
జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగేముందు ఏవేవో సమస్యలు పరివేష్టించి ఉంటాయి. సమస్య లేకుండా సమస్య ముందుకు జరగదు. అలా జరగటం సహజంగా భావించాలి.
