"నాలాంటి కుర్రవాళ్లు మీకు చాలామందిని తెలుసు. సుమతి పెళ్ళి విషయమై నేను కాకపోతే మరో కుర్రవాడొచ్చి మిమ్మల్ని అడిగి వెళ్లేవాడు. అలాంటిది నాలో ఏం ప్రత్యేకత వుందని నా వల్ల మీరు మారిపోయానని అనుకుంటున్నారు?"
"అదే_ దాన్ని అంత సుళువుగా చెప్పలేను. కాని, నేనన్నది మాత్రం నిజం. ఈ తిమ్మాపురానికి నేనింతకు మునుపు కొందరు స్వాముల్ని రప్పించేను. వాళ్ళొచ్చి ప్రజల ఖర్చుల మీద నాలుగు రోజులు యిక్కడ గడిపి, ధర్మోపదేశాలు సెలవిచ్చి చేతులు దులుపుకు వెళ్ళిపోయారేగాని వాళ్ళ ఉపదేశాలు నా తలకెక్కినవి కావు. ఎందుచేతనో తెలుసా? వాళ్ళ అసలు రంగు నాకూ తెలుసు. కాని బాబూ; నాకు ఒక నిజమైన స్వామి కనిపించి, చాలా బలమైన దెబ్బకొట్టి, బుద్ధిగా బతకమని హెచ్చరించాడు. అదుగో, అప్పట్నించీ___ఆ స్వామి వల్లనే నేను పూర్తిగా మారిపోయాను."
"ఆ స్వామిని నేనా రామదాసుగారూ?" అన్నాడు ప్రసాదం నవ్వేస్తూ.
"ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు గదా! థాంక్స్....అవునూ_ నీ పరీక్షలెప్పటి వరకూ వున్నాయి?"
"రెండు రోజుల్లో పూర్తవుతాయి."
"అయితే ఒక చిన్న రిక్వెస్టు బాబూ! నీ పరీక్షలు పూర్తయిన్నాడు, ఆ రాత్రి నా కుటీరంలో నీకు విందు ఏర్పాటు చేస్తున్నాను. నేను నీకు ప్రేమతో యిచ్చే మొదటి విందన్న మాట____తప్పకుండా రావాలి.
"విందా?"
"కాదనకు. నువ్వు కాదంటే నేను చాలా బాధపడతాను."
"పరీక్షలు పూర్తయిన వెంటనే అక్క దగ్గిరికి వెళదామనుకుంటున్నాను, సర్లెండి. మీ యింట్లో భోంచేసి ఆఖరి బస్సుకి వెళతాను."
"చాలా థాంక్స్. నీకు పరీక్షలు గనుక మనం కాలాన్ని వృథా చేయకూడదు. పద బాబూ! నడుద్దాం."
వాళ్ళిద్దరూ తిరుగు మొహం పట్టేరు. ప్రసాదం రామదాసు గార్ని పరిశీలించి చూశాడు.
ఈ మధ్యనే అలవాటు చేసుకుంటూన్న నడకతో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు. రొప్పుతూ నడుస్తున్నారు. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఒక్కోచోట ఆగి మళ్ళా నడుస్తున్నారు.
దారిలో ఇంత అలసట కనిపిస్తున్నా, నడిచి తీరాలనే పట్టుదల మాత్రం ప్రస్ఫుటంగా వారి మొహంలో వెలుగుతోంది.
దార్లో వాళ్ళిద్దరికీ నరసయ్య కనిపించాడుగానీ, అతను వాళ్ళను చూచి తల తిప్పుకు వెళ్ళిపోయాడు. అది గమనించి రామదాసు అన్నారు____
"అతని పేరు నరసయ్య. నా కుడి భుజమని మురిసేవాడిని. నా కొలువులో ముఖ్యుడు. వెధవ పనులు నాతోపాటు వాడూ చాలా చేశాడు. ఇవాళ చూడు మొహం చాటుచేసుకు నడుస్తున్నాడు. పోనీలే_ కుడిభుజ మయినందుకు కొంతైనా గౌరవముంచాడు. లోకనాథం తెలుసుగా_ మన ఇప్పటి ప్రభువు. అతనూ, అతనితోపాటు కనకం_ మీ సీతాపతి మేనమామ_ వాళ్ళిద్దరూ మొన్న నన్ను నడిరోడ్డు మీద చూసి అవాకులు పేలుతూ వెళ్లారు నాయనా! తలొంచుకు వచ్చేశాను. అవమానాలు చాలా ఎదురవుతున్నాయి. భరించడం అలవాటు చేసుకుంటున్నాను. ఎంత మార్పో గ్రహించు. నేను అధికారంలో వున్నప్పుడు ఈ కుక్కలు నా మొహాన్ని కన్నెత్తి చూసేందుకే భయపడేవి. ఇవాళ, ఆ అధికారం నుంచి బయటపడ్డ తర్వాత నన్ను కరుస్తున్నాయి. చిత్రంగా లేదూ?"
ప్రసాదానికి జాలిగలగడమేగాకుండా సమయానికి ఒక కథ జ్ఞాపకం రాగా అన్నాడు___
"పూర్వం ఒక అడవిలో ఒక పాము వుండేదిట. కనిపించిన మనిషినీ, పశువునీ కరిచి పొట్టన పెట్టుకోడం దాని వృత్తి. ఆ విధంగా ఆ పాము చాలా మందిని చంపింది. ఒక రోజున ఒక మహాముని ఆ అడవిగుండా వెళుతూ పడగవిప్పి బుసలు కొడుతూన్న ఆ పాముని చూశాడు. చూసి ఆగేడు. ఆ పాము మునిని కాటందుకోబోయింది. కాని, చాతకాక ఆశ్చర్యపోయింది. 'పామూ, నన్ను నువ్వు కరవలేవు. అదలావుంచు. పూర్వజన్మలో నువ్వే మహా పాపం చేసేవోగాని ఈ జన్మకి విషప్పురుగువై పుట్టేవు. ఈ జన్మలో గూడా నువ్వు ఇలా పాపాలు చేసుకుంటూపోతే రేపొచ్చే జన్మకి నువ్వే నీచమైన బతుకు బతకవలసివస్తుందోనని నేను బెంగపడుతున్నాను. కాలం మించిపోలేదు గనుక, నేటి నుంచైనా ప్రాణుల్ని కరవడం మాని బుద్ధిగా బతుకు. ఆ విధంగా రాబోయే జన్మలోనైనా సుఖిస్తా'వని, ముని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి పాము సాదువైపోయింది. వానపాములా బతకడం ప్రారంభించింది. అకస్మాత్తుగా మారిన ఆ పాము అందరికీ అలుసైపోయింది. ఆ అడవిగుండా వెళ్ళే యాత్రికులందరూ దానిని చిత్రహింసలు పెడుతున్నారు. అందుచేత పాము చిక్కి సగమైపోయింది. రేపో మాపో చచ్చే స్థితిలో వుండగా, మళ్ళా ఆ మహాముని దానికి దర్శనమిచ్చాడు. ముని పాదాల్ని తాకింది సర్పం. ముని ఆ పాము యొక్క దుస్థితిని గమనించి జాలిగా 'ఏం జరిగిం'దని అడిగాడు. పాము కథ మొత్తాన్నీ మునికి వివరించింది. ముని అంతా విని ఆశ్చర్యపోయి అన్నాడు. 'కరవడం కూడదన్నానే గాని నిన్ను హింసించే మనిషిని భయపెట్టవద్దని చెప్పలేదే? కరవకు. కాని, బుసకొట్టి భయపెట్టు. మనిషి పారిపోతాడు. అంతేగాని, కరవడం మాని, భయపెట్టడం మానేస్తే నువ్వు బతకడం కష్టం అన్నాడు. పోల్చి చెబుతున్నానని కాదుగానీండి, ఆ పాము కథ మనం గుర్తుంచుకోడం మంచిది. ఏమంటారు?"
రామదాసు ప్రసాదం చెప్పిన కథవిని చాలా ఆనందంగా అన్నారు.
"మంచి కథే చెప్పేవు నాయనా! ఈ కథలో పాముని నేను, మహామునివి నువ్వు. పాముని హింసించిన వెధవలు ఈ లోకనాథం, కనకం, నరసయ్యాను. నాకీ హెచ్చరికలు కావాల్సిందే మరి....నేను వెళ్ళొస్తానింక. ఎల్లుండి నీకోసం ఎదురు చూస్తుంటాను. వెళ్ళిరానా?"
"సెలవు," అన్నాడు ప్రసాదం చేతులు జోడించి.
